ఇదంతా ప్లానింగా..? అలా జరిగిపోతుందా..?

Friday,June 07,2019 - 12:03 by Z_CLU

ఆ మధ్య సురేష్ బాబు సినిమా నిర్మాణంలో స్పీడ్ తగ్గించారు అనుకున్నా, ఇప్పుడున్న స్పీడ్ చూస్తుంటే అస్సలు తగ్గేది లేదని ఫిక్సయ్యారనిపిస్తుంది. వరసగా సినిమాలు నిర్మించేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే.. ఆ సినిమాల్ని కూడా తన కుటుంబ సభ్యులతోనే నిర్మిస్తున్నారాయన.

సమంతా ‘ఓ బేబీ’ సినిమాకి ప్రొడ్యూసర్ సురేష్ బాబే. కొరియన్ సినిమా హక్కులు కొని మరీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అంతెందుకు చైతు, వెంకీల ‘వెంకీమామ’ కి ప్రొడ్యూసర్ కూడా ఆయనే. ఈ క్రేజీ కాంబో ఆలోచన పాతదే అయినా… కథ దొరికీ దొరకగానే ఆలస్యం చేయకుండా సినిమాని ట్రాక్ పైకి తెచ్చేశారు.

రానా – గుణశేఖర్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న’హిరణ్యకశిప’ కూడా తెరకెక్కబోయేది సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పైనే. మూడేళ్ళుగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది. ప్రతీది దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు సురేష్ బాబు. మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమా ఈ బ్యానర్ పైన రాబోతున్న భారీ బడ్జెట్ చిత్రంగా నిలిచిపోనుంది.

ఇప్పుడు రీసెంట్ గా అనౌన్స్ అయిన వెంకీ, తరుణ్ భాస్కర్ సినిమా తెరకెక్కబోయేది కూడా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లోనే. మొత్తానికి మ్యాగ్జిమం ఫ్యామిలీ లోని స్టార్స్ సినిమాలకు తనే దగ్గరుండి నిర్మాణ బాధ్యతలు చూసుకుంటున్నారు సురేష్ బాబు.