సాహో సినిమా దుబాయ్ షెడ్యూల్ ఫిక్స్

Tuesday,October 31,2017 - 01:54 by Z_CLU

ప్రభాస్ హీరోగా నటిస్తున్న సాహో సినిమాకు సంబంధించి వచ్చే నెల నుంచి దుబాయ్ లో ఓ భారీ షెడ్యూల్ ప్రారంభంకానుంది. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కెన్నీ బేట్స్ ఆధ్వర్యంలో దుబాయ్ లో సాహో సినిమాకు సంబంధించి కొన్ని యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించబోతున్నారు. వీటిలో ఓ కార్ ఛేజ్ ఎపిసోడ్ కూడా ఉంది. దుబాయ్ లోని ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫా టవర్స్ ప్రాంగణంలో ఈ యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించబోతున్నారు.

దాదాపు 2 నెలలుగా రజనీకాంత్ నటించిన 2.0 సినిమాకు యాక్షన్ సీక్వెన్సులు కంపోజ్ చేశాడు కెన్నీ బేట్స్. ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వడంతో ఇప్పుడు సాహో ప్రాజెక్టుకు షిఫ్ట్ అవ్వబోతున్నాడు బేట్స్. ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ హైలెట్ కానున్నాయి. భారీ ఖర్చుతో వీటిని తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు.

సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాహోలో ప్రభాస్ సరసన శ్రద్ధాకపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. శంకర్-ఎహసాన్-లాయ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ఇంకా రిలీజ్ డేట్ ఫిక్స్ చేయలేదు. దాదాపు 150 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోంది సాహో.