ఓంకార్ ఇంటర్వ్యూ

Monday,October 09,2017 - 03:11 by Z_CLU

బుల్లితెరపై తానేంటో నిరూపించుకొని, ప్రస్తుతం వెండితెరపై దర్శకుడిగా వెలుగుతున్న ఓంకార్… నాగార్జున, సమంతలతో తెరకెక్కించిన సినిమా ‘రాజు గారి గది 2’.. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 13 న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఓంకార్ మీడియాతో ముచ్చటించాడు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే…

 

వెంకటేష్ గారి తో చేయాలనుకున్నా

‘రాజు గారి గది’ సినిమా తర్వాత ‘రాజు గారి గది 2’ తో పాటు ఓ ఫామిలీ ఎంటర్టైనర్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నా. కానీ చాలా మంది ఇప్పుడే ‘రాజు గారి గది’ సీక్వెల్ వద్దని ,వెంటనే హారర్ సినిమా చేస్తే దర్శకుడిగా అదే ముద్ర పడిపోతుందని చెప్పారు. కానీ అప్పటికే రెడీ చేసుకున్న ‘రాజు గారి గది 2’ కథను వెంకటేష్ గారితో చేద్దామనే ఆలోచనతో ఆయనకీ కథ చెప్పాను. ఆయన కథ వినగానే కచ్చితంగా చేద్దామని చెప్పారు. కానీ ఆయన కొంచెం బిజీ గా ఉండడంతో అది కుదరలేదు. వెంటనే పి.వి పి గారికి మరో కథ చెప్పాను. ఆయన ‘రాజు గారి గది’ సక్సెస్ అయింది కదా.. మనం ఆ సీక్వెల్ తోనే సినిమా చేద్దామని చెప్పారు. అలా ఈ సినిమా స్టార్ట్ అయింది.

 

రీమేక్ అయితే ఆడదని చెప్పేశా …

పి.వి.పి బ్యానర్ లో రాజు గారి గది 2 చేద్దామనుకొన్నాక.. ఒకసారి పి.వి.పి గారు మలయాళంలో వచ్చిన ‘ప్రేతం’ సినిమా ట్రైలర్ పంపించి దీన్ని రీమేక్ చేద్దాం అన్నారు. అయితే ఆ సినిమా చూసి తెలుగులో రీమేక్ చేస్తే ఆడదని కానీ అందులో నుంచి సోల్ తీసుకుందామని చెప్పా. అలా ఆ సినిమా రైట్స్ కొనుగోలు చేసి ఆ సినిమా నుంచి మూల కథను మాత్రమే తీసుకొని మన నేటివిటీ కి తగ్గట్లుగా మార్పులు చేసి సమంత క్యారెక్టర్ ను ఆడ్ చేసి కొత్తగా తెరకెక్కించాం. అందుకే ఈ సినిమా రీమేక్ లా కాకుండా కొత్తగా అనిపిస్తుంది.

 

మామా- కోడలు అదరగొట్టేశారు

ఈ స్క్రిప్ట్ రెడీ అవ్వగానే నిరంజన్ రెడ్డి గారు ఈ క్యారెక్టర్ నాగార్జున గారు చేస్తే బాగుంటుందని ఆయనకీ కథ చెప్పించారు. నాగార్జున గారు వినగానే 5 నిమిషాల్లో మనం ఈ సినిమా చేద్దాం అని చెప్పారు. ఇక కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఈ క్యారెక్టర్ సమంత చేస్తే బాగుంటుందని నిరంజన్ గారే సజిస్ట్ చేశారు. సమంత గారు కూడా కథ విని నేను ఇప్పటి వరకూ చేయని క్యారెక్టర్ ఇది కచ్చితంగా చేస్తా అని చెప్పి ఓకే అన్నారు. మామా కోడలు కలిసి తమ క్యారెక్టర్స్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టేశారు.

వాళ్లిద్దరే గుర్తుంటారు

నిజానికి సినిమాలో ఎవరెంత ఎంటర్టైన్ చేసినా ఫైనల్ గా ఇంటికెళ్లి ప్రేక్షకుడికి గుర్తుండేది మాత్రం నాగార్జున గారు సమంత గారే..వీళ్లిద్దరి క్యారెక్టర్స్ అంతలా ఇంపాక్ట్ చూపిస్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ అందరినీ మెస్మరైజ్ చేస్తాయి.

 

ఫామిలీ ఎమోషన్ హైలైట్

ఫస్ట్ అంతా ఎంటర్టైన్ మెంట్ తో సాగిపోయినప్పటికీ సెకండ్ హాఫ్ లో వచ్చే ఫామిలీ ఎమోషన్ సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలుస్తుంది. ముఖ్యంగా సమంత క్యారెక్టర్ తో అందరూ బాగా కనెక్ట్ అయిపోతారు. సమంత క్యారెక్టర్ భయపెట్టకుండా.. తనపై జాలి కలిగించేలా ఉంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే ఎమోషన్ అందరినీ విపరీతంగా ఆకట్టుకొని ఒక మంచి సినిమా చూశాం అనే ఫీల్ కలిగిస్తుంది.

 

 

చైతూ- అఖిల్ కచ్చితంగా చూస్తారు

ఇటీవలే నాగ చైతన్య , అఖిల్ ఈ సినిమా చూడమంటూ చెప్పారని విన్నాను. కానీ సమంత క్యారెక్టర్ వాళ్ళు ఊహించినట్లు ఉండదు. ఖచ్చితంగా రిలీజ్ తర్వాత ఆ విషయం తెలుసుకొని వాళ్లిద్దరూ ఈ సినిమా చూస్తారనుకుంటున్నా.

అదే నా బలం 

నిజానికి దర్శకుడిగా ప్రతీ ఒక్కరికి ఒక్కో బలం ఉంటుంది. నా విషయానికొస్తే టైం సెన్సే నా బలం. ఆ బలంతోనే టి.వి.రంగంలో ఈ స్థాయికి చేరుకోగలిగాను. ఇక టైం సెన్స్ తో పాటు పేషన్స్, పాజిటీవ్ నెస్ కూడా నన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయని నా నమ్మకం. అందుకే ఈ సినిమాను అనుకున్న సమయానికే పూర్తి చేసి రిలీజ్ కి రెడీ చేయగలిగాను.

 

 

దర్శకుడిగా నా స్థాయి పెంచుతుంది.

నిజానికి ‘రాజు గారి గది’ తర్వాత దర్శకుడిగా పి.వి.పి బ్యానర్ లో ఈ సినిమా చేయడం.. ఇందులో నాగార్జున గారు , సమంత గారు నటించడం.. ఇలా అన్ని కలిపి  ఈ సినిమా రిలీజ్ తర్వాత దర్శకుడిగా నా స్థాయి పెంచుతుంది.

 

 

తెలియకుండానే చెప్పాలి 

మెసేజ్ అనేది ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పినట్లు కాకుండా ఎంటర్టైన్ మెంట్ తో చెప్పాలనేది నా ఉద్దేశ్యం… ఒక్క మాటలో చెప్పాలనే వాళ్ళకి తెలియకుండానే చెప్పేది చెప్పాలి అది నా కాన్సెప్ట్. నా ప్రతీ సినిమాలో లాగే ఈ సినిమాలో కూడా విమెన్ కి అందరూ రెస్పెక్ట్ ఇవ్వాలి అనే ఓ స్ట్రాంగ్ మెసేజ్ ఉంటుంది. సినిమా చూశాక అందరూ కచ్చితంగా దాని గురించి ఆలోచిస్తారు.

 

‘రాజు గారి గది’ సిరీస్ ఇలాగే కంటిన్యూ చేస్తా .

నిజానికి ‘రాజు గారి గది’ దర్శకుడిగా ఇండస్ట్రీలో నాకో మంచి స్థానం అందించింది. అందుకే ఆ సిరీస్ ఇలానే కంటిన్యూ చేద్దామనుకుంటున్నా. హాలీవుడ్, బాలీవుడ్ లో ఇలా వరుసగా సిరీస్ రావడం సహజమే. తెలుగులో రాజు గారి గది సిరీస్ కూడా  అలా వస్తూనే ఉంటాయి ..

 

ఇంకా ఏం అనుకోలేదు

ప్రస్తుతానికి నా నెక్స్ట్ సినిమా గురించి ఇంకా ఏం అనుకోలేదు. ప్రస్తుతం ‘రాజు గారి గది- 2’ తో ఎలాంటి సక్సెస్ అందుకుంటామా..అనే ఆలోచనలో ఉన్నా.. కానీ ఒక ఫామిలీ కథ మాత్రం రెడీగా ఉంది. పెద్ద వాళ్ళతో కాకుండా యంగ్ స్టర్స్ తోనే ఆ సినిమా ఉంటుంది. అది కూడా పి.వి.పి బ్యానర్ లోనే ఉండబోతుంది.