ఏఎన్నార్ జయంతి స్పెషల్
Wednesday,September 20,2023 - 01:19 by Z_CLU
భక్తిరస చిత్రాలు రాజ్యమేలుతున్న సమయంలో సాంఘిక చిత్రాలకు ఓ గుర్తింపు… ఆ సినిమాలతో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్న మహానటుడు. తెలుగుచిత్రసీమకు దశ-దిశను నిర్దేశించిన నాయకుల్లో ఒకరు. పరిచయం అక్కర్లేని ఆ సంపూర్ణ వ్యక్తిత్వం పేరు అక్కినేని నాగేశ్వరావు. జనాల గుండెల్లో ఆయన పేరు ఏఎన్నార్. ఈరోజు అక్కినేని జయంతి. మహానటుడి శతజయంతి సందర్భంగా టాలీవుడ్ మరోసారి అక్కినేనిని స్మరించుకుంటోంది. స్మరించుకోవాలి కూడా.

క్రమశిక్షణ అంటే ఏమిటి..? వందల పుస్తకాలు తిప్పాల్సిన పనిలేదు. అక్కినేని జీవితాన్ని తరచిచూస్తే చాలు. వృత్తిగతంగానే కాదు… వ్యక్తిగతంగా కూడా క్రమశిక్షణకు మారుపేరు అక్కినేని. పనిలో క్రమశిక్షణ, జీవితంలో క్రమశిక్షణ, జీవనంలో క్రమశిక్షణ, అంతెందుకు తినే తిండిలో కూడా క్రమశిక్షణ. అందుకే సంపూర్ణ జీవితాన్ని చూడగలిగారు. తుదిశ్వాస వరకు సినిమాలు చేయగలిగారు.

కథల్లేవు… మంచి స్టోరీలు దొరకడం లేదు… ఈ డైలాగులు ఇప్పటివి కాదు. అక్కినేని జమానా నుంచే ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. అయితే ఏఎన్నార్ మాత్రం ఎప్పుడూ ఆ మాట అనలేదు. కనీసం ఆ దిశగా కూడా ఆలోచించలేదు. ఎందుకంటే… అక్కినేని ఏ కథలో అయినా ఇమిడిపోతారు. ఏ కథ అయినా అక్కినేని మేనరిజమ్స్ లో కలిసిపోతుంది. అలా ఎన్నో వందల చిత్రాలతో ప్రేక్షకలోకాన్ని అలరించారు అక్కినేని.

అక్కినేని వారసత్వాన్నే కాదు… ఆయన ఆశయాలు, ఆలోచనల్ని కూడా తమ సినిమాలతో చూపిస్తున్నారు ఏఎన్నార్ వారసులు అక్కినేని నాగార్జున. తాతగారి ఆలోచనల్ని ఇప్పుడు నాగచైతన్య, అఖిల్, సుశాంత్, సుమంత్ కూడా ఆచరణలో పెడుతున్నారు. ఇలా తరతరాలకు స్ఫూర్తిని కగిలిస్తున్న ఏఎన్నార్ ను చిత్రపరిశ్రమ కలకాలం గుర్తుంచుకుంటుంది. #ANRlivesOn