బాలకృష్ణ ఇంటర్వ్యూ

Wednesday,August 30,2017 - 05:53 by Z_CLU

నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ ‘పైసా వసూల్’ రిలీజ్ కి రెడీ అయింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 1న థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ సందర్భంగా నందమూరి నటసింహం బాలయ్య మీడియాతో మాట్లాడుతూ పైసా వసూల్ గురించి ఎన్నో విశేషాలు తెలియజేశాడు. ఆ విశేషాలు బాలయ్య మాటల్లోనే…

ఇద్దరికీ కుదిరింది

నిజానికి పూరితో ఆ మధ్య ఓ సినిమా చేయాలనుకున్నాను. ఎందుకో అప్పుడు మా కాంబినేషన్ కుదరలేదు. ఈ సినిమాతో కాంబినేషన్ కుదరడం, మంచి కథ దొరకడం, సినిమా స్టార్ట్ అవ్వడం అప్పుడే పూర్తవ్వడం  అన్ని యాద్రుచికంగా జరిగిపోయాయి. అనుకున్న సమయానికంటే ఇంకాస్త తొందరగానే సినిమాను పూర్తి చేసే టాలెంటెడ్ డైరెక్టర్ పూరి . నా మనస్కత్వం ఆయన మనస్కత్వం ఒకటే…ఆయన ఎప్పుడూ పని గురించే ఆలోచిస్తాడు నేను అంతే. వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్. వెరీ కూల్. మా ఇద్దరికీ బాగా కుదరడంతో ఫైనల్ గా మంచి అవుట్ ఫుట్ వచ్చింది.

ఇంకా చాలా ఉంది

టీజర్,ట్రైలర్ చూసి సినిమా మొత్తం మాస్ అంశాలతో యాక్షన్ ఎంటర్టైనర్ అనుకుంటున్నారు. కానీ సినిమాలో మాస్ అంశాలతో పాటు మరెన్నో ఉన్నాయి. యాక్షన్ అనేది సినిమాలో కేవలం ఒక భాగమే అంతకు మించిన ఎంటర్టైన్ మెంట్ సినిమాలో ఉంది. రేపు సినిమా రిలీజ్ అయ్యాక యాక్షన్ కంటే ఎంటర్టైన్ మెంట్ గురించే ఎక్కువ మాట్లాడుకుంటారు..


ఆ క్యారెక్టర్ పై సస్పెన్స్ ఉంటుంది.

ఈ సినిమాలో శ్రియ నాకు జోడిగా నటించింది. ఇప్పటికే మేం ఇద్దరం కలిసి రెండు సినిమాల్లో నటించాం. ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ తర్వాత ఎలాంటి సినిమా చెయ్యాలి.. అని శ్రియా ఆలోచిస్తున్న టైంలో ఈ సినిమా చెయ్యమని నేనే చెప్పాను. తనకి కూడా స్క్రిప్ట్ బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పి చేసేసింది. చాలా మంచి క్యారెక్టర్ చేసింది. ఆ క్యారెక్టర్ పై ఓ సస్పెన్స్ ఉంటుంది. అదేంటనేది సినిమా చూస్తే  తెలుస్తుంది.

అప్పటి వరకూ అల్లరే.

ఈ సినిమా చేస్తున్నంత సేపు షూటింగ్ స్పాట్ లో చాలా సరదాగా సందడి గా ప్రతీ ఒక్కరం ఎంజాయ్ చేస్తూ గడిపాం.. షూటింగ్ జరిగేటప్పుడు సందడి సందడి గా ఉండేది. శ్రియ, కైరా దత్, ముస్కాన్ మామూలు అల్లరి కాదు. ఓ రేంజ్ లో అల్లరి చేస్తూ సినిమా చేశారు. నేను కూడా వారితో పాటే చాలా సరదాగా ఉంటూ షాట్ రెడీ అయ్యేంత వరకూ  అల్లరి చేస్తూ షాట్ రెడీ అనగానే సీరియస్ మూడ్ లోకి వెళ్ళిపోయి చేయడం జరిగింది.

ఇది ముందే గ్రహించా

గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా తర్వాత ఎలాంటి సినిమా చేస్తే బాగుంటుందా.. అనుకుంటున్న టైం లో పూరి ఈ స్క్రిప్ట్ చెప్పడం, నాకు కూడా కొత్తగా అనిపించడంతో వెంటనే స్టార్ట్ చేసేశాం. అయితే సినిమా పై మొదట్లో కొన్ని నెగటివ్ మాటలు కూడా వినిపించాయి అవి నాకు తెలుసు. ఓ గొప్ప సినిమా చేసి ఇదేంటి ఈ కాంబినేషన్  ఏంటి అనే మాటలు వినిపించాయి. ఇప్పుడు చూస్తే సినిమా పై భారీ అంచనాలున్నాయి. ఇది నేను ముందే గ్రహించాను.


నేనే అడిగాను

సినిమాలో నేను పాడిన పాటకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నిజానికి ఆ  ట్యూన్, లిరిక్స్ విని నేనే పాడతా అని అడిగాను. అసలే సాహిత్యం అంటే చెవి కోసుకుంటాను.  పూరికి అనూప్ కి ఈ పాట నేను పడితేనే బాగుంటుంది అనే ఉద్దేశ్యం ఉందేమో నాకు తెలియదు కానీ నేను చెప్పగానే ఓకే సార్ మీరే పడేయండి అని ఎంకరేజ్ చేశారు. స్టూడియో కి వెళ్ళాం ఒక గంటలో పడేశాను. .. అదేంటో అలా కుదిరేసింది.

నా టార్గెట్ అదే.

గౌతమి పుత్ర శాతకర్ణి 79 రోజుల్లో పూర్తి చేశాం. ఇప్పుడు ఈ సినిమాను ఆ సినిమా కంటే ఒక రోజు ముందే అంటే 78 రోజుల్లో పూర్తి చేశాం. నెక్స్ట్ రవి కుమార్ తో చేస్తున్న సినిమాను 77 రోజుల్లో పూర్తి చేయాలనుకుంటున్నాం. అలా ఒక్కో సినిమాకు ఒక్కో రోజు తగ్గించుకుంటూ వస్తున్నా కారణం ఎక్కువ సినిమాలు చేయడానికి, అభిమానులను తొందర తొందరగా కలవడానికే. ఈ సినిమా అనుకున్న సమయానికి పూర్తయినందుకే ప్రకటించిన డేట్ కంటే నాలుగు వారల ముందే థియేటర్స్ లోకి వచేస్తున్నాం. నెక్స్ట్ మరో సినిమాను కూడా జనవరి నుంచి స్టార్ట్ చేయబోతున్నాను.

ఫస్ట్ టైం చేశాను

ఈ సినిమాలో నాన్న గారి ‘కంటి చూపు చెబుతుంది’ అనే సాంగ్ ను రీమేక్ చేశాం. నాకు ముస్కాన్ కి మధ్య వచ్చే సాంగ్ అది. ముస్కాన్ ని బాగా ఏడిపించడం, కొట్టడం అచ్ఛం నాన్న గారిలాగే చేశాను. చూడాలి ఆ పాటను అభిమానులు, ప్రేక్షకులు ఎలా ఎంజాయ్ చేస్తారో.


ఎంత ఉండాలో అంతే.

ఈ సినిమాలో ఎవరు ఎంత మాట్లాడాలో  ఓ కొలమానం పెట్టుకొని అతి లేకుండా శృతి మించకుండా డైలాగ్స్ రాసుకున్నారు పూరి. నిజంగా ఒక్కో డైలాగ్ ఎంత ఉండాలో అంతే ఉంటూ అందరినీ ఆకట్టుకుంటాయి.. ఆ డైలాగ్స్ కి థియేటర్స్ లో అదిరిపోయే రెస్పాన్స్ రావడం పక్కా.

ఓ మంచి సినిమా చేయాలనుకున్నారు

ఈ సినిమా ఆనంద్ ప్రసాద్ గారి నిర్మాణంలో తెరకెక్కడం చాలా సంతోషంగా ఉంది. ఎప్పటి నుంచో  భవ్య క్రియేషన్స్ లో ఆయన నాతో ఓ మంచి సినిమా నిర్మించాలనుకున్నారు. అయితే యాదృచికంగా  ఇప్పుడు ఈ సినిమాతో కుదిరింది. నేను పూరి గారి పేరు చెప్పగానే చాలా మంచి కాంబినేషన్ అవుతుంది బాబు అంటూ సినిమాని నమ్మి బాగా ఖర్చు పెట్టి ఫైనల్ గా ప్రేక్షకులకు ఓ మంచి సినిమాను అందిస్తున్నారు.

ఏ రేంజ్ హిట్ అవుతుందో తెలుసు.

జనాలు కోరుకునే అన్ని అంశాలతో వస్తుంది ‘పైసా వసూల్’. టీం అందరం కలిసి సినిమా చూశాం.. సినిమా ఏ రేంజ్ హిట్ అవుతుందో ఎలా ఉంటుందో మాకు తెలుసు ..త్వరలోనే ప్రేక్షకులందరూ చూస్తారు ఆదరిస్తారు. కచ్చితంగా సినిమా చూశాక అభిమానుల నుంచి ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంటాం.