జీ సినిమాలు స్పెషల్ : 2020 ఎట్రాక్షన్స్

Wednesday,January 01,2020 - 10:02 by Z_CLU

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త ఏడాదిలో కూడా క్రేజీ మూవీస్ రెడీ అవుతున్నాయి. 2020 టాలీవుడ్ బాక్సాఫీస్ ను మరింత కలర్ ఫుల్ చేసేందుకు మెగాస్టార్ చిరంజీవి నుంచి విజయ్ దేవరకొండ వరకు చాలామంది హీరోలు క్రేజీ ప్రాజెక్ట్స్ తో రెడీ అయ్యారు. 2020 టాప్-ఎట్రాక్షన్ చూద్దాం.

ఏ ఇయర్ అయినా టాప్ ఎట్రాక్షన్స్ సంక్రాంతి మూవీస్ తోనే స్టార్ట్ అవుతాయి. ఈ ఏడాది కూడా సంక్రాంతి సినిమాలు మేజర్ ఎట్రాక్షన్స్ గా నిలిచాయి. వాటిలో ఒకటి ‘అల వైకుంఠపురములో’. ఫ్లాప్ అంటే ఏంటో తెలియని బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోంది ఈ సినిమా. పాటలతో గతేడాది నుంచే హంగామా చేస్తున్న ఈ మూవీ ఈసారి సంక్రాంతి బరిలో హాట్ ఫేవరెట్ గా వస్తోంది.

ఈ మూవీకి ఏమాత్రం తీసిపోని విధంగా వస్తోంది ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ. మహేష్ బాబు నటిస్తున్న ఈ మోస్ట్ ఎవెయిటింగ్ ప్రాజెక్ట్ కూడా సంక్రాంతి బరిలో ఉంది. అనీల్ రావిపూడి డైరక్షన్, రష్మిక అందాలు, డీఎస్పీ ట్యూన్స్… వీటన్నింటికీ మించి కామెడీ ట్రాక్ ఈ సినిమా ప్రధాన బలాలు.

నిజానికి 2020లో మోస్ట్ ఎవెయిటింగ్ మూవీస్ ఈ రెండూ కాదు. అసలు సిసలైన ఎవెయిటింగ్ మూవీ RRR. ‘బాహుబలి-2’ లాంటి చరిత్ర తర్వాత రాజమౌళి తీస్తున్న సినిమా కావడం.. ఏకంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి ఇద్దరు స్టార్స్ ఇందులో నటిస్తుండడం ఈ సినిమాను హాట్ మూవీగా మార్చేసింది. ఇవి మాత్రమే కాదు, బడ్జెట్ పరంగా కూడా ఈ సినిమా టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. దాదాపు 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా జులై 30న థియేటర్లలోకి వస్తోంది.

RRR తర్వాత మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ చిరు-కొరటాల సినిమా. దర్శకుడు ఎవరైనా, కథ ఏదైనా చిరంజీవి ఓ సినిమా చేస్తున్నాడంటే.. ఆ ఏడాది అది మెయిన్ ఎట్రాక్షన్ గా నిలవాల్సిందే. గతేడాది సైరాతో సంచలనం సృష్టించిన మెగాస్టార్, ఈ ఏడాది కొరటాల శివ సినిమాతో సెన్సేషన్ కు రెడీ అవుతున్నాడు. ఆగస్ట్ 14న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది.

పాన్-ఇండియా స్టార్ గా అవతరించిన ప్రభాస్ కూడా 2020లో క్రేజీ ప్రాజెక్ట్స్ రెడీ చేశాడు. వీటిలో ఒకటి జాన్. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ సినిమాను ఈ ఏడాది రిలీజ్ చేయబోతున్నాడు యంగ్ రెబల్ స్టార్. ఈ మూవీతో పాటు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేయాల్సిన సినిమాను కూడా ఇదే ఇయర్ లో థియేటర్లలోకి దించాలనేది ప్రభాస్ ప్లాన్.

ఇక ఈ ఏడాది టాప్ ఎట్రాక్షన్స్ లో ఒకటిగా నిలుస్తుంది బన్నీ-సుకుమార్ సినిమా. దాదాపు పదేళ్ల తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తోంది. పైగా డిఫరెంట్ జానర్, సరికొత్త కాన్సెప్ట్ తో వస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో పక్కా మాస్ ఎలిమెంట్స్ తో రాబోతున్న ఈ సినిమా కూడా ఈ ఏడాదిలోనే థియేటర్లలోకి వస్తోంది.

పూరి-విజయ్ దేవరకొండ కాంబోలో వస్తున్న ఫైటర్ కూడా క్రేజీ ప్రాజెక్టుగా నిలిచింది. ఇస్మార్ట్ శంకర్ లాంటి డబుల్ బ్లాక్ బస్టర్ తర్వాత పూరి చేస్తున్న సినిమా కావడం.. పూరి-విజయ్ ది ఫ్రెష్ కాంబో కావడంతో మూవీపై అంచనాలు పెరిగాయి. దీనికితోడు సినిమాలో విజయ్ కు తల్లిగా రమ్యకృష్ణ నటిస్తోంది. మరోవైపు వరల్డ్ ఫేమస్ బాక్సర్ మైక్ టైసన్ ను ఈ సినిమాలో తీసుకోవాలనే ప్లాన్స్ కూడా నడుస్తున్నాయి. అలా ఫైటర్ టాప్ ఎట్రాక్షన్స్ లో ఒకటిగా మారింది.

బాలయ్య-బోయపాటి సినిమా కచ్చితంగా ఈ లిస్ట్ లో ఉంటుంది. ఎందుకంటే ఈ కాంబోకు ఉన్న ట్రాక్ రికార్డు అలాంటిది. ఇంతకుముందు సింహా, లెజెండ్ లాంటి సూపర్ హిట్స్ ఇచ్చింది ఈ జోడీ. ఇప్పుడు హ్యాట్రిక్ కోసం ఉవ్విళ్లూరుతోంది. అందుకే 2020 టాప్ ఎట్రాక్షన్స్ లో బాలయ్య-బోయపాటి శ్రీను మూవీ కూడా చేరిపోయింది.

ఈ సినిమాలతో పాటు రానా నక్సలైట్ గా నటిస్తున్న ‘విరాటపర్వం’, నాని 25వ చిత్రం ‘V’, రామ్ నటిస్తున్న ‘RED’, నితిన్-చంద్రశేఖర్ ఏలేటి కాంబోలో వస్తున్న చదరంగం, శర్వానంద్-సమంతల ’96’ రీమేక్ ప్రాజెక్టులు కూడా 2020 టాప్ ఎట్రాక్షన్స్ లో నిలిచాయి. ఈ సినిమాలతో న్యూ ఇయర్ టాలీవుడ్ మరింత కలర్ ఫుల్ గా మారనుంది.