డిసెంబర్ బాక్సాఫీస్ రివ్యూ

Wednesday,January 01,2020 - 11:30 by Z_CLU

డిసెంబర్ నెలలో కూడా టాలీవుడ్ బాక్సాఫీస్ మెరిసింది. సాయితేజ్ నటించిన ప్రతి రోజూ పండగే సినిమా హిట్ అవ్వగా.. మత్తు వదలరా సినిమా సైలెంట్ హిట్ గా నిలిచింది. అటు రూలర్, ఇద్దరిలోకం ఒకటే సినిమాలు అంచనాలు నిలబెట్టుకోలేకపోయాయి.

 డిసెంబర్ ఫస్ట్ వీక్ లో కార్తికేయ నటించిన 90ml విడుదలైంది. ఓ మోస్తరు అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా నిరాశపరిచింది. కార్తికేయ నటన, అనూప్ రూబెన్స్ పాటలు బాగున్నప్పటికీ సినిమాలో కథ, సరైన స్క్రీన్ ప్లే లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది. ఈ మూవీతో వచ్చిన భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు అనే సినిమాది కూడా ఇదే పరిస్థితి. కమెడియన్ బ్యాచ్ మొత్తం ఉన్నప్పటికీ సినిమా తేలిపోయింది. ఈ మూవీస్ తో పాటు వచ్చిన మిస్ మ్యాచ్, అశ్వమేథం, కలియుగ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.

 సెకెండ్ వీక్ లో ‘వెంకీమామ’ క్లిక్ అయింది. వెంకీ-చైతూ నటించిన ఈ మల్టీస్టారర్ మూవీ ఇదే నెలలో బ్రేక్ ఈవెన్ సాధించింది. కంటెంట్ పై అక్కడక్కడ విమర్శలు వచ్చినప్పటికీ స్టార్ పవర్ కారణంగా సినిమా సేఫ్ వెంచర్ అనిపించుకుంది. ఈ మూవీకి పోటీగా వచ్చిన అమ్మరాజ్యంలో కడపబిడ్డలు, హేజా, మామాంగం, అయ్యప్ప కటాక్షం సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.

 ఇక డిసెంబర్ మూడో వారంలో.. రూలర్, ప్రతిరోజూ పండగే, దొంగ సినిమాలు రిలీజయ్యాయి. వీటిలో బాలయ్య నటించిన రూలర్ సినిమా అతడి అభిమానుల్ని అలరించింది తప్ప, ఓవరాల్ గా సక్సెస్ టాక్ తెచ్చుకోలేకపోయింది. సాయితేజ్-మారుతి కాంబోలో వచ్చిన ప్రతిరోజూ పండగే సినిమా మాత్రం హిట్ మూవీగా నిలిచింది. వీటికి పోటీగా వచ్చిన దొంగ సినిమా కంటెంట్ బాగున్నప్పటికీ, పోటీ కారణంగా నిలవలేకపోయింది. కార్తి నటించిన ఈ సినిమా చాలా బాగున్నప్పటికీ, స్క్రీన్ ప్లే చాలా స్లోగా ఉందనే విమర్శలొచ్చాయి.

 ఇక ఈ ఇయర్ కు ఫినిషింగ్ టచ్ ఇస్తూ మత్తు వదలరా, ఇద్దరిలోకం ఒకటే, సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమాలొచ్చాయి. వీటిలో మత్తు వదలరా సినిమా రెవెన్యూ పరంగా, కంటెంట్ పరంగా హిట్ అనిపించుకుంది. కీరవాణి కొడుకు సింహా హీరోగా నటించిన ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంటోంది. అటు రాజ్ తరుణ్ నటించిన ఇద్దరిలోకం ఒకటే, సుడిగాలి సుధీర్ హీరోగా మారి చేసిన సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమాలు డిసప్పాయింట్ చేశాయి.