ఊహించని ఇండస్ట్రీ హిట్స్

Sunday,February 16,2020 - 01:02 by Z_CLU

చరిత్ర జరిగే ముందు ఎవ్వరూ గుర్తించరు, అది చరిత్రగా మారిన తర్వాత ఎవ్వరూ గుర్తించాల్సిన అవసరం లేదు. అలా కొన్ని సినిమాలు ఊహించని విధంగా ఇండస్ట్రీ హిట్స్ గా నిలుస్తాయి. అవి ఆ స్థాయిలో హిట్టవుతాయని, ఆ టైమ్ లో మేకర్స్ కూడా అనుకోరు. తమ సినిమా హిట్ అవుతుందని మేకర్స్ నమ్మకంతో ఉంటారు కానీ ఇండస్ట్రీ హిట్ అవుతుందని ఎవ్వరూ ఊహించలేరు.

 

‘అల వైకుంఠపురములో’ సినిమా విషయంలో ఇదే జరిగింది. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అవుతుందని ఆ యూనిట్ ఊహించలేదు. కేవలం ఓ క్లీన్ హిట్ అయితే చాలనుకున్నారు. ప్రమోషన్ టైమ్ లో, రిలీజైన తర్వాత కూడా అదే చెప్పారు. తమ సినిమా ఇండస్ట్రీ హిట్ అవుతుందని అస్సలు ఊహించలేదన్నారు. కానీ మేజిక్ జరిగిపోయింది. “అలా” ఇండస్ట్రీ హిట్ వచ్చేసింది.

 

‘అత్తారింటికి దారేది’ కూడా ఇలాంటి సినిమానే. రిలీజ్ కు ముందు ఏకంగా పైరసీకి గురైంది ఈ సినిమా. ఇలాంటి సినిమా ఇండస్ట్రీ హిట్ అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ఇప్పటికీ త్రివిక్రమ్ ను కదిపితే ఈ విషయంలో ఆశ్చర్య పడుతుంటాడు. అదంతా ఓ మేజిక్ లా జరిగిపోయిందంటుంటాడు.

 

సరిగ్గా ‘రంగస్థలం’ కూడా ఇలాంటిదే. నిజాయితీగా ఓ ప్రయత్నం చేద్దామని మాత్రమే అనుకున్నారు. ప్రేక్షకులకు ఓ కొత్త ఎక్స్ పీరియన్స్ ఇద్దామని మాత్రమే భావించారు. కానీ మేకర్స్ అనుకున్న దానికంటే చాలా ఎత్తున సినిమాను నిలబెట్టారు ప్రేక్షకులు. రామ్ చరణ్-సుకుమార్ కాంబోలో వచ్చిన రంగస్థలానికి బ్రహ్మరథం పట్టారు.

 

ఇక ‘బాహుబలి-1’ది కూడా ఇదే దారి. ఈ సినిమాతో భారీ విజయం ఆశించిన మేకర్స్ కు ఏకంగా ఇండస్ట్రీ హిట్ దక్కింది. ఈ సినిమా సక్సెస్ వల్ల ‘బాహుబలి-2’ మరింత పెద్ద విజయం సాధిస్తుందని ఊహించారు కానీ.. ‘బాహుబలి-1’ మాత్రం ఇండస్ట్రీ హిట్ అవుతుందని ఊహించలేదు నిర్మాతలు.

ఇలా టాలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన చిత్రాలన్నీ.. ఆ మేకర్స్ ఊహలకు అందని విధంగా రిజల్ట్ సాధించినవే.

చరిత్ర జరిగే ముందు ఎవ్వరూ గుర్తించరు, అది చరిత్రగా మారిన తర్వాత ఎవ్వరూ గుర్తించాల్సిన అవసరం లేదు.