Chalapathi Rao: సీనియర్ నటుడు చలపతిరావు కన్నుమూత

Sunday,December 25,2022 - 08:39 by Z_CLU

గంటల వ్యవథిలోనే టాలీవుడ్ మరో సీనియర్ నటుడ్ని కోల్పోయింది. కైకాల సత్యనారాయణ కన్నుమూసిన గంటల వ్యవథిలోనే చలపతిరావు కూడా తుదిశ్వాస విడిచారు. ఈరోజు ఉదయం ఆయన గుండెపోటుతో మరణించారు.

“నువ్వు కూడా వెళ్లిపోయావా సత్యన్నా” అంటూ కైకాల మరణంపై ట్వీట్ చేశారు చలపతిరావు. అదే ఆయన ఆఖరి ట్వీట్.

78 ఏళ్ల చలపతిరావు ఆరోగ్యంగానే ఉన్నారు. వయసురీత్యా వచ్చిన చిన్నచిన్న సమస్యలు తప్ప, ఆయనకు తీవ్రమైన అనారోగ్య సమస్యలేం లేవు. అలాంటి వ్యక్తి ఉన్నఫలంగా గుండెపోటుకు గురయ్యారు.

1944 మే 8న జన్మించారు చలపతిరావు. ఈయన స్వస్థలం కృష్ణా జిల్లా బల్లిపర్రు గ్రామం. చలపతిరావుది భారీ విగ్రహం. అప్పట్లో టాలీవుడ్ నటుల్లో ఆయనే హైట్. హీరో అవుదామని చెన్నై వచ్చిన చలపతిరావు, అనూహ్యంగా విలన్ గా మారారు.

chalapathi rao

కృష్ణ హీరోగా నటించిన గూఢచారి 116 సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టారు చలపతి రావు. ఆ సినిమా నుంచి ఆయన విలన్ పాత్రలకు కేరాఫ్ అయ్యారు. ఒక టైమ్ లో బయట చలపతిరావును చూసి మహిళలు భయపడేవారు, చిన్నపిల్లలు జడుసుకునేవారు. ఆయన విలనిజానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అక్కర్లేదు.

మెల్లగా విలనీ నుంచి క్యారెక్టర్ రోల్స్ కు షిప్ట్ అయ్యారు చలపతిరావు. తండ్రి, తాత, బాబాయ్, పెదనాన్న లాంటి పాత్రలతో మెప్పించారు. ఆ తర్వాత ఆయన కామెడీ పాత్రలకూ షిప్ట్ అయ్యారు. కామెడీ విలనీ కూడా చేశారు.

ఒక టైమ్ లో చలపతిరావుతో కామెడీ చేయించడానికి ఇండస్ట్రీ అంతా ఎగబడింది. అంతలా క్లిక్ అయ్యారు. కరడుగట్టే విలన్ పాత్రలు చేసిన చలపతిరావు, కడుపుబ్బా నవ్వించడం విచిత్రం. పరిపూర్ణ నటుడు అనడానికి ఇదే పెద్ద ఎగ్జాంపుల్.

అలా రకరకాల పాత్రలతో కెరీర్ లో 1200 సినిమాలకుపైగా నటించారు చలపతిరావు. ఏ పాత్ర చేసినా అందులో ఆయన మార్క్ కనిపించేది. విలక్షణమైన ఆయన డైలాగ్ డెలివరీ వినిపించేది.

టాలీవుడ్ లో చాలా ఫ్రెండ్లీగా, నవ్వుతూ, నవ్విస్తూ, సరదాగా ఉండే వ్యక్తుల్లో ముందుంటారు చలపతిరావు. ఆయనకు పరిశ్రమలో శత్రువులే లేరంటే, అది ఆయన గొప్పదనం. ఎన్టీఆర్-ఏఎన్నార్ మధ్య బాక్సాఫీస్ వార్ జరిగిన టైమ్ లో ఇద్దరికీ ఆప్తుడు ఈయన. ఆ తర్వాత చిరంజీవి-బాలకృష్ణ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్న టైమ్ లో కూడా ఆ ఇద్దరికీ ఆప్తుడు ఈయనే.

చలపతిరావుకు ఒక కొడుకు, ఇద్దరు కుమార్తెలు. కొడుకు పేరు రవిబాబు. కుమార్తెల పేర్లు మాలినీదేవి, శ్రీదేవి. కొడుకు రవిబాబు నటుడు, దర్శకుడు, నిర్మాతగా ఇండస్ట్రీలో స్థిరపడ్డాడు. చలపతిరావు నటించిన చివరి చిత్రం బంగార్రాజు.