అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ ఇంటర్వ్యూ

Wednesday,August 23,2017 - 07:25 by Z_CLU

దర్శకత్వం వహించిన మొదటి సినిమా రిలీజ్ కాకముందే టాలీవుడ్ లో ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడిగా హాట్ టాపిక్ అయ్యాడు సందీప్ రెడ్డి వంగ.. మొదటి సినిమా టీజర్ తోనే తానేంటో..ఆడియన్స్ కు దర్శకుడిగా ఎలాంటి సినిమా చూపించబోతున్నాడో క్లూ ఇచ్చి ఎక్కడలేని అంచనాలు పెంచాడు. విజయ్ దేవర కొండ హీరోగా నటించిన ‘అర్జున్ రెడ్డి’ వినాయకచవితి కానుకగా ఈ 25న థియేటర్స్ లోకి రానున్న సందర్భంగా ఈ యంగ్ డైరెక్టర్ మీడియా ముచ్చటించాడు.. ఆ విశేషాలు సందీప్ మాటల్లోనే…

 

రెండు సినిమాలకు పని చేశాను

వరంగల్ లో పుట్టి పెరిగాను.. సినిమా మీద ఉన్న ప్యాషన్ తో ఆస్ట్రేలియాలో ఫిలిం మేకింగ్ కోర్స్ చేసి ఇండస్ట్రీకి వచ్చాను.. నాగార్జున గారు నటించిన ‘కేడి’ సినిమాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పని చేశాను. ఆ తర్వాత ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ సినిమాకు స్రిప్ట్ వర్క్ చేశాను. దర్శకుడిగా ‘అర్జున్ రెడ్డి’ నా మొదటి సినిమా.

టైటిల్ ఇంగ్లీష్ లో పెట్టడానికి రీజన్ అదే

ఈ సినిమా టైటిల్ అనుకున్న వెంటనే ఇంగ్లీష్ లో టైటిల్ డిజైన్ చేశాం.. ఇక తెలుగులో టైటిల్ పెట్టకపోవడానికి రీజన్ తెలుగులో అర్జున్ పదంలో ‘జ’ ఒత్తు రావడం టైటిల్ కొంచెం పెద్దగా అనిపిస్తుండడంతో ఇక ఓన్లీ ఇంగ్లీష్ కే ఫిక్స్ అయ్యాం.. పెట్టేటప్పుడు తెలుగు ఆడియన్స్ కొంత మందికి అర్ధం కాదు అని కొందరు అన్నారు. కానీ అర్జున్ రెడ్డి అనే టైటిల్ అర్ధం కానీ వారెవరుంటారు..అన్న ఉద్దేశ్యంతోనే ఇలా ఫిక్స్ అయ్యాం.

ఎమోషనల్ రివేంజ్ స్టోరీ

నిజానికి అర్జున్ రెడ్డి కంప్లీట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ అనే టాక్ ఉంది.. కానీ ఇదొక ఎమోషనల్ రివేంజ్ స్టోరీ… డార్క్ మూడ్ లో సాగే సాడ్ సెలెబ్రేషన్ సినిమా ఇది. ఎమోషనల్ పెర్ఫార్మెన్సెస్ హైలైట్ గా నిలుస్తాయి..

 

ముందు శర్వా కె వినిపించాను 

ఇండస్ట్రీ లో శర్వా నాకు కొంచెం క్లోజ్.. ఈ స్క్రిప్ట్ రెడీ అవ్వగానే ముందు శర్వానంద్ కి చెప్పాను…కానీ అనుకోని కారణాల వల్ల ఫైనల్ గా విజయ్ దేవరకొండతో తెరకెక్కించాను. అందుకే శర్వా మొన్న ఈవెంట్ లో అలా అన్నాడు. త్వరలోనే శర్వా తో ఓ సినిమా చేస్తా.

 

అప్పుడే ఫిక్స్ అయ్యా

విజయ్ కథలోకొచ్చాక ఒక పది రోజులు వర్క్ చేశాం. ఆ పది రోజుల్లో నటుడిగా విజయ్ స్టామినా ఏంటో తెలిసింది. అర్జున్ రెడ్డి రోల్ కి  విజయ్ పర్ఫెక్ట్ అనిపించే సినిమా మొదలు పెట్టాను.. ఇప్పుడు సినిమా చూస్తే విజయ్ రేపు థియేటర్స్ లలో  అదరగొట్టేస్తాడనిపించింది.

 

అస్సలు ఊహించలేదు

సినిమా షూటింగ్ జరిగేటప్పుడు.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నప్పుడు ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తుందనుకున్నాం. కానీ టీజర్ కి  రేంజ్ లో రియాక్ట్  అవుతారని, ఆ డైలాగ్ అంత బజ్ క్రియేట్ చేస్తుందని అస్సలు ఊహించలేదు.. ఆ విషయంలో మా ఊహలు తారుమారయ్యాయి.

 

ఎమోషన్ మాత్రమే చూడాలి

ఈ సినిమాలో ఓ సన్నివేశం లో వచ్చే డైలాగ్ కి  చాలా మంది వ్యతిరేకిస్తున్నారు.. కానీ ఆ సందర్భంలో ఎవరి ఎమోషన్ అయినా అంతే.. అక్కడ చూడాల్సింది ఎమోషన్ మాత్రమే డైలాగ్ కాదు.

 

ఆ డైలాగ్ అందుకే పెట్టాం

షూటింగ్ జరిగేటప్పుడు స్క్రిప్ట్ లో ఆ డైలాగ్ లేదు.. అప్పటికప్పుడు ఇంకా ఎమోషన్ ని బాగా పండించే డైలాగ్ ఉంటే బాగుంటుందని అనుకుని అది పెట్టాం. హీరోయిన్ కి ఓ అనుకోని సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఓ జూనియర్, అర్జున్ రెడ్డి కి ఫోన్ చేసినప్పుడు వచ్చే సీన్ అది… రేపు ఆ సీన్ లో ఆ డైలాగ్ కరెక్ట్ అని అందరూ ఫీల్ అవుతారు.

 

అది పెద్దగా పట్టించుకోరు

లేటెస్ట్ గా ఈ సినిమా డ్యూరేషన్ 3 గంటల 10 నిమిషాలని అందరూ సోషల్ మీడియాలో పెట్టారు. సినిమా డ్యూరేషన్ 3 గంటల 2  నిమిషాలు మాత్రమే. 8 నిముషాలు ఎక్కువ చెప్పడంతో సోషల్ మీడియాలో కరెక్ట్ డ్యూరేషన్ అనౌన్స్ చేశాను. నిజానికి రేపు ఈ సినిమా రిలీజ్ అయ్యాక డ్యూరేషన్ ని ఆడియన్స్ పెద్దగా పట్టించుకోరని నా నమ్మకం. ఒక క్రికెట్ మ్యాచ్ ని ఎంత ఓన్ చేసుకొని గంటలు పట్టించుకోకుండా చూస్తామో.. అర్జున్ రెడ్డి కూడా అలాగే చూస్తారు. ఒకప్పుడు అన్ని సినిమాలు మూడు గంటలుండేవి కదా..ప్రేక్షకులు చూడలేదా.. అవి హిట్స్ అవ్వలేదా. కంటెంట్ బాగుంటే, కనెక్ట్ అయితే టైం అనేది పట్టించుకోరు.

అందుకే అంత కాన్ఫిడెన్స్ 

స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నప్పుడే ఈ సినిమాపై ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది.. సినిమా చూసాక ఆ కాన్ఫిడెన్స్ మరింత రెట్టింపు అయ్యింది. స్క్రిప్ట్ , ఎమోషన్ , మ్యూజిక్ ,పెర్ఫార్మెన్స్ ఇలా అన్ని కలగలిపి ఈ సినిమా ఆడియన్స్ ను బాగా కనెక్ట్ చేస్తుంది.

 

తీసేయ్యడానికి నెల పట్టింది

షూటింగ్ అయిపోయాక సినిమా మొత్తం కలిపి 3 గంటల 40 నిముషాలు వచ్చింది.. డబ్బింగ్ జరిగేటప్పుడే అందరూ ఇంతా సినిమానా.. కష్టం అన్నారు..కొందరైతే రెండు ఇంటెర్వెల్స్ పెడతారా..అంటూ నవ్వుతూ అన్నారు. అవన్నీ దృష్టిలో పెట్టుకొనే 40 నిముషాలు తీసేశాం. కానీ అన్ని చంపుకొని ఆ నలభై నిముషాలు తీసెయ్యడానికి మాకు ఓ నెల పట్టింది.

 

అవన్నీ చెప్పలేదు

ఈ సినిమాకి ఓ కొత్త అమ్మాయి అయితే బాగుంటుందని అనుకున్నా.. అప్పుడే షాలిని పాండే ని సెలెక్ట్ చేశాం. అందరూ ఆ అమ్మాయిని రొమాంటిక్ సీన్స్ కి ఎలా ఒప్పించావని అడుగుతున్నారు. బేసిక్ గా షాలిని థియేటర్ ఆర్టిస్ట్.. నిజానికి థియేటర్ ఆర్టిస్ట్ లు వారి పెర్ఫార్మెన్స్ గురించి మాత్రమే ఆలోచిస్తారు.. మిగతా వాటిపై ఫోకస్ పెట్టారు. స్క్రిప్ట్ చెప్తూ వెళ్ళిపోయాను కానీ పర్టికులర్  గా ఈ సీన్ లో లిప్ కిస్ ఉంటుంది ఇక్కడ రొమాన్స్ ఉంటుంది అంటూ చెప్పలేదు. ఆ అమ్మాయి థియేటర్ ఆర్టిస్ట్ అవ్వడం వల్ల సినిమాకు బాగా కలిసొచ్చింది.

 

టైం పడుతుంది

ఈ సినిమా టీజర్, ట్రైలర్ చూసి చాలా మంది కాల్స్ చేశారు. ఓ పెద్ద స్టార్ హీరో నుంచి కూడా ఆఫర్ వచ్చింది.. తనెవరనేది త్వరలోనే చెప్తాను. శర్వానంద్ తో కూడా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నా. అవన్నీ సెట్ అవ్వాలంటే ఈ సినిమా హిట్ అవ్వాలి..అన్ని కలిసి రావాలి.. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ కి టైం పడుతుంది.