10 వేల అడుగుల ఎత్తులో 'రెడ్‌' షూటింగ్

Friday,February 21,2020 - 03:31 by Z_CLU

యూరప్‌లో అత్యంత అందమైన ప్రదేశం ‘డొలమైట్స్’. ఇటలీకి చెందిన ఈ పర్వత తీర ప్రాంతంలో చాలా హాలీవుడ్‌ సినిమాల షూటింగ్‌లు జరిగాయి. లేటెస్ట్ గా ‘రెడ్‌’ సినిమా షూటింగ్‌ ఇక్కడ జరిగింది.

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేని హీరోగా నటిస్తున్న చిత్రం ‘రెడ్’. కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై ‘స్రవంతి’ రవికిశోర్‌ నిర్మిస్తున్న’రెడ్’ చిత్రం కోసం 2 పాటలను ఇటలీలో చిత్రీకరించారు. ఆ రెండు పాటల్లో ఒకదాన్ని డోలమైట్స్ లో షూట్‌ చేయడం విశేషం. ఈ నెల 12 నుంచి 18 వరకూ ఇటలీలోని బ్యూటీఫుల్‌ లొకేషన్స్ లో రామ్‌, మాళవికా శర్మలపై ఈ రెండు పాటలు తీశారు.

ఇటలీలోని టుస్కాన్, ఫ్లారెన్స్, డోలమైట్స్ ప్రాంతాల్లో ఈ సాంగ్స్ షూటింగ్‌ జరిగింది. డోలమైట్స్ అనేది సముద్ర తీర పర్వత ప్రాంతం. సముద్ర తీరానికి 10 వేల అడుగుల ఎత్తులో మైనస్‌ ఐదు డిగ్రీల వాతావరణంలో అక్కడ పాటను షూట్ చేశారు. డోలమైట్స్ లో షూటింగ్ జరుపుకున్న తొలి తెలుగు చిత్రం ఇదే!

షూటింగ్ అప్ డేట్స్ విషయానికొస్తే.. ఒక పాట మినహా ఈ సినిమా షూటింగ్‌ మొత్తం పూర్తయింది. ఈ నెలాఖరున హైదరాబాద్‌లో ఆ పాట చిత్రీకరణ ఉంటుంది. ఏప్రిల్‌ 9న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్‌ అవుతోంది రెడ్.

రామ్‌, నివేదా పేతురాజ్‌, మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.