ప్రభాస్ బర్త్ డే స్పెషల్

Monday,October 23,2017 - 10:06 by Z_CLU

బాహుబలి.. ప్రభాస్ కెరీర్ ను ఈ సిరీస్ కు ముందు, దీని తర్వాత అని చెప్పుకోవాలి. బాహుబలి రాకముందు ప్రభాస్ టాలీవుడ్ స్టార్ మాత్రమే.. కానీ బాహుబలి-2 రిలీజ్ తర్వాత నేషనల్ స్టార్ అయ్యాడు. అందుకే ఈ పుట్టినరోజు ప్రభాస్ కు వెరీ వెరీ స్పెషల్. రెండేళ్ల కిందటి వరకు ప్రభాస్ పుట్టినరోజును టాలీవుడ్ మాత్రమే సెలబ్రేట్ చేసేది. కానీ ఇప్పుడు ఇండియా మొత్తం ప్రభాస్ పుట్టినరోజు హాట్ టాపిక్ గా మారింది.

ఈశ్వర్ తో కెరీర్ ప్రారంభించిన యంగ్ రెబల్ స్టార్.. కెరీర్ లో చేసిన మూడో సినిమాకే ఇండస్ట్రీని ఆకర్షించాడు. వర్షం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అప్పట్నుంటి మినిమం గ్యాప్ లో హిట్స్ ఇస్తూనే ఉన్నాడు. సినిమా, సినిమాకు తన క్రేజ్ పెంచుకుంటూనే ఉన్నాడు.

ప్రభాస్ కెరీర్ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లిన సినిమా ఛత్రపతి. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అయితే ప్రభాస్ జీవితంలోకి, అతడి కెరీర్ లోకి బాహుబలి వచ్చిన తర్వాత ఈ హీరో గ్రాఫ్ పూర్తిగా మారిపోయింది. బాహుబలి-1తో జాతీయస్థాయిలో మీడియాను ఎట్రాక్ట్ చేసిన ప్రభాస్.. బాహుబలి-2తో నేషనల్ లెవెల్లో స్టార్ అయిపోయాడు.

ప్రస్తుతం సాహో సినిమా చేస్తున్న ఈ హీరో.. త్వరలోనే బాలీవుడ్ మూవీలో కూడా నటిస్తానని ప్రకటించాడు. మరి ఈ పుట్టినరోజు సందర్భంగా ఆ బాలీవుడ్ మూవీని ఎనౌన్స్ చేస్తారేమో చూడాలి. హ్యాపీ బర్త్ డే టు ప్రభాస్.