ప్రభాస్ బర్త్ డే స్పెషల్

Wednesday,October 23,2019 - 12:06 by Z_CLU

ప్రభాస్…. ఇప్పుడిది టాలీవుడ్ స్టార్ పేరు కాదు. పాన్-ఇండియా స్టార్ పేరు. 2002లో ఈశ్వర్ సినిమాతో కృష్ణంరాజు వారసుడుగా సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ ఆజానుబాహుడు.. 2004లో వచ్చిన వర్షం సినిమాతో కమర్షియల్ హిట్ అందుకున్నాడు.

ఇక 2005లో వచ్చిన ఛత్రపతి సినిమా ప్రభాస్ కెరీర్ ను మార్చేసింది. మాస్ హీరోగా ప్రభాస్ ను నిలబెట్టింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో అనేక రికార్డులు సాధించింది. ఆ తరువాత పౌర్ణమి, యోగి, మున్నా ఈ మూడు ఫెయిల్ కాగా, పూరి దర్శకత్వంలో వచ్చిన బుజ్జిగాడు సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

భిల్లాతో మరోసారి కమర్షియల్ గా సక్సెస్ అందుకున్న ప్రభాస్.. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి సినిమాలతో స్టార్ అయిపోయాడు. అయితే ఇప్పటివరకు ప్రభాస్ కెరీర్ ఒకెత్తు. బాహుబలి నుంచి ప్రభాస్ రేంజ్ మరో ఎత్తు. బాహుబలి- ది బిగినింగ్, బాహుబలి 2 సినిమాలతో దేశవ్యాప్తంగా ప్రభాస్ పేరు మారుమోగిపోయింది. ఈ సినిమాలతో ప్రభాస్ పాన్-ఇండియన్ స్టార్ అయిపోయాడు.

సుజిత్ దర్శకత్వంలో చేసిన సాహో సినిమాతో మరోసారి బాలీవుడ్ లో స్టార్ అనిపించుకున్నాడు ప్రభాస్. ఈ సినిమా అక్కడ ఏకంగా వంద కోట్ల రూపాయల మార్క్ అందుకుంది. ప్రస్తుతం ఈ స్టార్, జాన్ అనే సినిమా చేస్తున్నాడు.

ఈరోజు ప్రభాస్ పుట్టినరోజు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటోంది జీ సినిమాలు.