'నిర్మలా కాన్వెంట్' రివ్యూ

Friday,September 16,2016 - 01:39 by Z_CLU

              ‘నిర్మలా కాన్వెంట్’ రివ్యూ

చిత్రం          : నిర్మలా కాన్వెంట్

నటీనటులు : నాగార్జున, రోషన్, శ్రియా శర్మ తదితరులు.

మ్యూజిక్       : రోషన్ సాలూరి

సినిమాటో గ్రఫీ : ఎస్.వి.విశ్వేశ్వర్

నిర్మాణం      : అన్నపూర్ణ స్టూడియోస్, మాట్రిక్స్ టీం వర్క్

నిర్మాతలు    : నాగార్జున అక్కినేని, నిమ్మగడ్డ ప్రసాద్

దర్శకత్వం   : జి.నాగ కోటేశ్వరారావు

విడుదల తేదీ : 16-09-2016

కథ :-

భూపతి నగరం అనే ఊరిలో భూపతి రాజు అనే ఓ జమిందారGకి  99 ఎకరాల పంట భూమి ఉంటుంది. ఇదే ఊరిలో వీరి గాడు(ఎల్.బి.శ్రీరామ్) అనే ఓ నిరుపేదకి ఆ 99 ఎకరాల ఎగువన ఒక్క ఎకరం పంట భూమి ఉంటుంది. ఇక భూపతి రాజు 99 ఎకరాల కు వీరి గాడి ఒక్క ఎకరం నుండే నీళ్లు రావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో భూపతి రాజు ఆ ఒక్క ఎకరాన్ని దక్కించుకోవాలని ఎన్నో సార్లు ప్రయత్నాలు చేస్తాడు. ఆ ప్రయత్నాలను ఎప్పటికప్పుడూ తిరస్కరిస్తాడు వీరి గాడు. ఇక ఎప్పటికైనా ఆ ఒక్క ఎకరాన్ని తమ సొంతం చేసుకోవాలని చూసే జమిందారు  వీరిగాడిని చంపిస్తాడు. ఇక చివరి మాటగా ఆ ఒక్క ఎకరాన్ని ప్రాణం పోయిన ఎవ్వరికి అమ్మొద్దని తన కొడుకు డేవిడ్ తో చెప్పి చనిపోతాడు వీరి గాడు. కొన్నేళ్ళకు  భూపతి రాజు కూడా చనిపోతాడు. ఆయన చనిపోయాక ఆ స్థానాన్ని దక్కించుకుంటాడు భూపతి రాజు కొడుకు(ఆదిత్య మీనన్). ఇక తండ్రి చనిపోయాక ఆ ఒక్క ఎకారాన్నే నమ్ముకొని దాని పై శ్రమిస్తూ తన కొడుకు శామ్యూల్( రోషన్ మేక) ను ఊరిలో ఉండే ఒకే ఒక్క ‘నిర్మల కాన్వెంట్’ స్కూల్ లో చదివిస్తుంటాడు డేవిడ్.  ఇక ఇదే కాన్వెంట్ లో జమిందారు కూతురు శాంతి(శ్రియ శర్మ) కూడా చదువుతుంటుంది. 13 ఏళ్లుగా ఒకే కాన్వెంట్ లో చదువుతున్న వీరిద్దరూ ఒకానొక సందర్భంలో ప్రేమలో పడతారు. ఈ విషయం తెలుసుకున్న శాంతి తండ్రి శామ్యూల్ ను తన కూతురి ప్రేమ కు దూరం చెయ్యాలన్న ఉద్దేశ్యం తో శామ్యూల్ పై దాడి చేయిస్తాడు. ఈ క్రమం లో తీవ్రంగా గాయపడిన శామ్యూల్ ను చూసి శాంతి తండ్రి దగ్గరకు వెళ్లి తన కొడుకు ప్రేమ ను అంగీకరించమని వారిద్దరికీ పెళ్లి చేయమని కోరతాడు డేవిడ్. ఇదే అవకాశం గా భావించిన శాంతి తండ్రి జమిందారీ తన 99 ఎకరాల పై ఉండే  ఎకారాన్ని  ఇచ్చేయాలని డేవిడ్ ను కోరతాడు. తన కొడుకు కోసం ఆ ఒక్క ఎకరం ఇచ్చేస్తాడు  డేవిడ్. ఇక డేవిడ్ దగ్గర  నుండి  డాక్యుమెంట్స్ అందుకున్న జమిందారు శామ్యూల్ శాంతి ప్రేమ ను అంగీకరించాడా? చివరికి శామ్యూల్ తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడు?అసలు ఈ కథ కు నాగార్జున కి సంబంధం ఏమిటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీ నటుల పని తీరు :

ఈ చిత్రంతో కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చిన శ్రీకాంత్ తనయుడు రోషన్ మంచి నటన కనబరిచాడు. కొన్ని సన్నివేశాలలో నటుడిగా మంచి మార్కులే అందుకున్నాడు. ఇక శ్రియ శర్మ అందం, అభినయంతో సినిమాకు ఆకర్షణగా నిలిచింది. రోషన్-శ్రియ ల మధ్య కెమిస్ట్రీ బాగుంది. ఇక సినిమా రెండో భాగంలో ఎంట్రీ ఇచ్చి సినిమాకు హైలైట్ గా నిలిచాడు కింగ్ నాగార్జున. ప్రారంభంలో కాసేపే ఉండే పాత్రే అయినప్పటికీ ఎల్.బి.శ్రీరామ్ ఆ పాత్రలో ఒదిగిపోయాడనే చెప్పాలి. ఈ సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన రాజీవ్ కనకాల-సుమల తనయుడు రోషన్ కనకాల… పరవాలేదనిపించుకున్నాడు. ఇక ఆదిత్య మీనన్, సమీర్, రవి ప్రకాష్, సత్యకృష్ణన్, అనిత చౌదరి, తాగుబోతు రమేష్ తదితరులంతా తమ పాత్రలను న్యాయం చేసారు.

టెక్నీషియన్స్ పని తీరు :

ఈ సినిమాను తన సినిమాటోగ్రఫీ తో హైలైట్ గా నిలిపాడు ఎస్.వి.విశ్వేశ్వర్. ముఖ్యంగా పల్లెటూరి అందాలను అద్భుతంగా చూపించాడు. కోటి తనయుడు రోషన్ సాలూరి అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా ఏ.ఆర్.రెహ్మాన్ తనయుడు ఏ.ఆర్.అమీన్ తో పాడించిన ‘కొత్త కొత్త భాష’ పాట అలరించింది. కానీ కొన్ని సన్నివేశాలకు ఆర్.ఆర్ తో మెప్పించలేకపోయాడు రోషన్. కొన్ని డైలాగ్స్ బాగున్నాయి. ఎడిటింగ్ వర్క్ పర్వాలేదు కానీ రెండో భాగంలో ఇంకాస్త ఎడిట్ చెయ్యాల్సి ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

జీ సినిమాలు సమీక్ష :

సినిమా ప్రారంభంలో భూపతి నగరంలో భూ- వివాదం గురించి చెప్తూ కథ ను ప్రారంభించిన తీరు బాగున్నా ఆ టెంపోను అలాగే కొనసాగించడంలో దర్శకుడు తడపడ్డాడు. మొదట్లో భూమి గురించి కొన్ని డైలాగ్స్ తో ఆకట్టుకున్నాడు. ఇక ఓ జమిందారు కూతురికి , ఓ నిరుపేద కొడుకుకి మధ్య చిగురించే ప్రేమను కథాంశం గా ఎంచుకున్న దర్శకుడు ఆ ప్రేమాయణాన్ని చివరి వరకూ మరింత ఇంట్రెస్టింగ్ గా చూపించి ఉంటే బాగుండేది. సినిమాలో అక్కినేని నాగార్జున ఎంట్రీ, లుక్, క్యారెక్టర్ అదిరిపోయాయి. అయితే సెకెండాఫ్ లో మన్మధుడిపైనే ఎక్కువ ఫోకస్ చేసిన తీరు.. కథను కాస్త సైడ్ ట్రాక్ లోకి తీసుకెళ్లినట్టు అనిపించింది. ముఖ్యంగా ‘ఛాంపియన్ అఫ్ ది ఛాంపియన్స్’ ఎపిసోడ్ రెండో భాగం లో కొన్ని సన్నివేశాల్ని కుదిస్తే బాగుండేదనే టాక్ వినిపించింది. ఒక టీనేజ్ ప్రేమాయణంతో అలరిస్తుందనుకునే   ‘నిర్మల కాన్వెంట్’ చివరికి ఊహించని ట్విస్టులతో ముగుస్తుంది.. ఓవరాల్ గా సినిమాలో నాగార్జున-రోషన్ కాంబినేషన్, రోషన్-శ్రియ కాంబినేషన్ కు మాత్రం మంచి మార్కులు ఇవ్వొచ్చు.