మహేష్ ప్రభాస్, అఖిల్ సినిమాల టైటిల్స్

Monday,April 03,2017 - 01:26 by Z_CLU

హై ఎండ్ సస్పెన్స్… అదే రేంజులో ఎగ్జైట్ మెంట్ క్రియేట్ చేస్తున్నాయి మూడు సినిమాలు. ప్రభాస్ సుజిత్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాతో పాటు, ఇవాళే సెట్స్ పైకి వచ్చిన అఖిల్ సినిమా, ఎప్పుడెప్పుడా అని ఇంకా ఊరిస్తూనే ఉన్న మహేష్-మురుగదాస్ సినిమా… ఈ 3 సినిమాలకు సంబంధించి టైటిల్స్ పై దాదాపు క్లారిటీ వచ్చేసింది.

ప్రభాస్ కొత్త సినిమాకు సాహో అనే టైటిల్ అనుకుంటున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ టైటిల్ రిజిస్టర్ అయింది. బాహుబలి సినిమాతో పాపులర్ అయిన ఈ పేరును ప్రభాస్ కొత్త సినిమాకు పెడుతున్నారన్నమాట. ఇక మహేష్ బాబు సినిమాకు స్పైడర్ అనే టైటిల్ అనుకుంటున్నారు. NVS బ్యానర్ పై ఈ పేరు ఫిలింఛాంబర్ లో రిజిస్టర్ అయింది. నిర్మాతలు ఎన్ వీ ప్రసాద్, ఠాగూర్ మధు సంయుక్తంగా పెట్టిన బ్యానర్ ఇది. ఈ బ్యానర్ పైనే మహేష్-మురుగదాస్ సినిమా తెరకెక్కుతోంది.

ఇక ఇవాళ్టి నుంచి సెట్స్ పైకి వచ్చిన అఖిల్-విక్రమ్ కుమార్ సినిమా కోసం జున్ను అనే టైటిల్ రిజిస్టర్ అయింది. అయితే అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై ఈ టైటిల్ రిజిస్టర్ కాలేదు. సుమంత్ స్థాపించిన కొత్త బ్యానర్ పై ఇది రిజిస్టర్ అయింది. అయితే అది కూడా అక్కినేని కాంపౌండ్ బ్యానరే కావడంతో అఖిల్ సినిమాకు దాదాపు జున్ను అనే టైటిల్ ఫిక్స్ అయినట్టే.