హరీష్ శంకర్ ఇంటర్వ్యూ

Thursday,June 22,2017 - 07:06 by Z_CLU

షాక్ సినిమాతో దర్శకుడిగా పరిచయమై మిరపకాయ్ సినిమాతో గుర్తింపు అందుకొని గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ఇమేజ్ సొంతం చేసుకున్న హరీష్ శంకర్ లేటెస్ట్ మూవీ ‘దువ్వాడ జగన్నాథం’. ఈ మూవీ రిలీజ్ సందర్భంగా డైరెక్టర్ హరీష్ శంకర్ మీడియాతో మాట్లాడాడు.

ఇప్పటికి కుదిరింది

నిజానికి సంకల్పం అనేది ఎంత గొప్పదో ఈ సినిమాతో బాగా తెలిసింది. అప్పుడెప్పుడో నా ఆటోగ్రాఫ్ సినిమా షూటింగ్ జరుగుతుండగా రాజమండ్రిలో ఆర్య సినిమా చూసి ఎప్పటికైనా ఈ హీరోతో పనిచేస్తానా.. ఇలాంటి ప్రొడ్యూసర్ తో సినిమా చేస్తానా.. అసలు ఈ మ్యూజిక్ డైరెక్టర్ నా సినిమా కి పనిచేస్తాడా.. అని ఆ రోజంతా ఆలోచిస్తూనే ఉన్నా.. అప్పుడు ఈ ముగ్గురితో పనిచేయాలని మనసులో సంకల్పించుకున్నాను. అదిలా డీజేతో కుదిరింది.

 

ఇప్పటి వరకూ టచ్ చేయనిది ‘డీజే’ లో చేశా

డీజే కథలో ఎంటర్టైన్మెంట్ తో పాటు ఇప్పటివరకూ నేను టచ్ చేయని ఇంటెన్సిటీ టచ్ చేశాను. ఎంత వినోదం ఉంటుందో అంతే ఎమోషన్ కూడా ఉంటుంది. రెండింటినీ బ్యాలెన్స్ చేస్తాడు మా డీజే. ఆడియన్స్ చాలా కొత్తగా ఫీలవుతారని నా నమ్మకం.

అది ఆయన గొప్పతనం

డీజేలో డాన్స్ లకు సంబంధించి బన్నీ నాకు క్రెడిట్ ఇవ్వడం అతని గొప్పతనం. ఆ విషయంలో ప్రత్యేకంగా నేను చేసిందేం లేదు. నాకు డాన్సులంటే చాలా ఇష్టం. నా సినిమాల్లో హీరో ఫైట్స్, డాన్సులు బాగా చేయాలని అనుకుంటాను. అస్మైక సాంగ్ లో హీరో చెమట పట్టకుండా స్పెప్పులు వేయాలని కొరియోగ్రాఫర్ కు చెప్పాను. రిఫరెన్స్ గా చిరంజీవి గారి చమకు చమకు అనే సాంగ్ వీడియో పంపించాను. ఫైనల్ గా ఆ సాంగ్ లో బన్నీ కూల్ గా వేసిన స్టెప్స్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది.

అలా ఎప్పుడూ అనుకోను

ట్రైలర్ చూసాక అందరు ఈ సినిమాతో సమాజానికి ఏం సందేశం ఇవ్వబోతున్నారు అని అడుగుతున్నారు. నిజానికి ఆడియన్స్ కి సందేశం ఇవ్వడానికి నేను సినిమాలు చేయను. జస్ట్ వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే సినిమాలు తీస్తా. సందేశం ఇవ్వడం కోసమో, ఎవర్నో కించపరచడం కోసమో కోట్లు పెట్టి సినిమాలు తీయం. ప్రేక్షకుడు సినిమాను మహా అయితే 3 గంటలు గుర్తుంచుకుంటాడు, లేదంటే 3 రోజులు, ఇంకా గొప్పగా ఉంటే 3 నెలలు గుర్తుంచుకుంటాడు. అందులో సందేశాలెందుకు.


అందుకే అలా ఊహించుకుంటున్నారు

నిజానికి ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ నుంచే అదుర్స్ లా ఉంటుందని, జెంటిల్మెన్ లా ఉంటుందని ముగ్గురు మొనగాళ్లు సినిమాల్లో చిరంజీవి గారి క్యారెక్టర్ లా ఉంటుందని ఏదేదో ఊహించుకుంటున్నారు. అందులో తప్పు లేదు. ఒక హీరో ఓ వెరైటీ క్యారెక్టర్ చేసినప్పుడు మరో హీరో అలాంటి క్యారెక్టర్ చేస్తే కంపారిజన్స్ కామనే. బ్రాహ్మణ క్యారెక్టర్స్ తో సినిమాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఈసారి కంపేరిజన్ కాస్త ఎక్కువైందంతే.

ఈ సారి అది బ్రేక్ చెయ్యాలని ఫిక్స్ అయ్యాను

డీజే క్లైమాక్స్ చాలా కొత్తగా ఉంటూ అందరినీ ఎట్రాక్ట్ చేస్తుందని నా నమ్మకం. ఇలాంటి క్లైమాక్స్ పెట్టడానికి కారణం.. ప్రతీ కథలో బలమైన విలన్ క్యారెక్టర్స్ అన్నీ అల్యూమినియం ఫ్యాక్టరీ లో ఎండ్ అయిపోవడమే. ఫైట్ తో సినిమాకు ఎండ్ ఇచ్చే ధోరణి నుంచి బయటికొచ్చి ఓ డిఫరెంట్ క్లైమాక్స్ రాసి బన్నీ గారికి దిల్ రాజు గారికి చెప్పాను. వాళ్ళకి కూడా బాగా నచ్చడంతో ఈ క్లైమాక్స్ కే ఫిక్స్ అయిపోయాం. క్లైమాక్స్ చూసి ప్రేక్షకులు కూడా ఫ్రెష్ గా ఫీలవుతారు.

ఆ క్యారెక్టర్ కి ఆదర్శం అదే

అప్పట్లో రావుగోపాలరావు గారు చేసిన రొయ్యల నాయుడు అనే క్యారెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ సినిమాలో ఆయన గెటప్, మాటతీరు ఆదర్శంగా తీసుకొని రావు రమేష్ గారితో ఆ క్యారెక్టర్ చేశాను. పేరు కూడా రొయ్యల నాయుడు అనే పెట్టాను. ఇప్పటి జనరేషన్ కి కూడా అలాంటి క్యారెక్టర్స్ తెలియాలనే ఉద్దేశ్యంతోనే ఈ క్యారెక్టర్ పెట్టడం జరిగింది.


నా కెరీర్ లో బెస్ట్ ఫైట్, సాంగ్

ఈ సినిమాలో క్లైమాక్స్ లో ఫైట్ లేదు. ప్రీ-క్లైమాక్స్ లో ఫైట్ మాత్రం బాగా వచ్చింది. నా కెరీర్ లో ది బెస్ట్ ఫైట్ అదే. ఇక సీటీ మార్ సాంగ్ అయితే అద్భుతంగా వచ్చింది. నేను చేసిన 6 సినిమాల్లో ది బెస్ట్ సాంగ్ అదే.

 

హీరోయిన్ కి చాలా వెయిట్ ఉంటుంది

ఈ సినిమాలో హీరోయిన్ రోల్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అందుకే డీజే కోసం మొదట పూజానే సంప్రదించాను. సీతారామశాస్త్రి గారు రాసిన పాటను ముకుంద ఆడియో రిలీజ్ లో పూజ పాడినప్పుడే తన డెడికేషన్ చూసి ఓ సినిమా చేయాలనుకున్నాను. సుబ్రహ్మణ్యం లో పూజానే హీరోయిన్ అనుకున్నాను. కానీ అప్పుడు తను హిందీ సినిమాతో బిజీగా ఉండడం డేట్స్ కుదరక పోవడంతో చేయలేకపోయా. డీజే తో మా కాంబినేషన్ కుదిరింది.

అది నాకు బాధ కలిగించింది

అస్మైక పాటలో పదాలు మేం ఒక అర్ధంతో పెడితే, అది కొందరికి మరోలా అర్ధమైంది. ఓ డైరెక్టర్, ప్రొడ్యూసర్ కోట్లు ఖర్చుపెట్టి, ఎవరి మనోభావాలనో దెబ్బతీయడానికి సినిమాలు చేయరు. అది అందరు గమనించాలి. ఫైనల్ గా వారు చెప్పిన దానికి ఏకీభవించి గౌరవం ఇచ్చి ఆ పదాలను తొలగించాం. అయితే అప్పటికే రిలీజ్ అయినా ఆడియో సాంగ్స్ లోంచి ఆ పదాలను తొలగించే టెక్నాలజీ ఇంకా రాలేదు కదా.. తొలగించిన విషయాన్ని వదిలేసి మరికొందరు రిలీజ్ అయిన పాట కోసం మళ్ళీ మాట్లాడటం నాకు కాస్త భాధ కలిగించింది.

పవన్ కళ్యాణ్ గారితో మళ్ళీ చేయాలనే ఉంది

పవన్ కళ్యాణ్ గారి కోసం ఓ కథ రెడీ చేశా. సినిమా సెట్స్ పైకి వెళ్లకముందే ఆయనని కలిశాను. అన్నీ అనుకూలిస్తే ఆయనతో సినిమా చేయడానికి ఎప్పుడు సిద్ధం.

 

చిరంజీవి గారితో అలాంటి సినిమా చేస్తా

మెగాస్టార్ చిరంజీవి గారితో కూడా ఓ సినిమా చేయాలనుంది. ఆయనను చూస్తూ పెరిగాను. అవకాశం వస్తే కచ్చితంగా ఆయనతో దొంగ మొగుడు, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు లాంటి సినిమా చేస్తా. చిరంజీవితో సినిమాకు సంబంధించి ఇప్పటికే నాలో ఆలోచన మొదలైంది.


నెక్స్ట్ సినిమా అదే

నెక్స్ట్ సినిమా కూడా దిల్ రాజు గారి బ్యానర్ లో చేయబోతున్నా. అది ఒక కాన్సెప్ట్ బేస్డ్ ఫిలిం. పూర్తిగా దిల్ రాజు గారి ఆలోచనలకు తగ్గట్టు ఆ సినిమా ఉంటుంది. మిగతా డీటెయిల్స్ త్వరలోనే ప్రకటిస్తా.

నిర్మాతగా మారతా

మూవీస్ ప్రొడ్యూస్ చేస్తా. మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు తీస్తా. మనం చిన్నప్పుడు చదుపుకున్న కథలు, నవలల్ని సినిమాలుగా తీయాలని ఉంటుంది. కానీ హీరో, ప్రొడ్యూసర్ కమిట్ మెంట్స్ తో కొన్ని అడ్డంకులు ఉంటాయి. సో.. నాకు నచ్చిన కాన్సెప్ట్స్ తో ఎవరైనా వస్తే కచ్చితంగా సినిమాలు నిర్మిస్తా. డిజిటల్ టెక్నాలజీ, షార్ట్ ఫిలిమ్స్ వచ్చేశాయి కాబట్టి ఎవరి టాలెంట్ ఏంటనేది ఈజీగా తెలిసిపోతుంది. పెళ్లిచూపులు, ఆనంద్ లాంటి సినిమాలతో పాటు టీవీల్లో అప్పట్లో వచ్చిన మాల్గుడి డేస్ సిరీస్ నాకు బాగా ఇష్టం. నిర్మిస్తే అలాంటి సినిమాలు నిర్మించాలి.