3 రోజులు.. 500 కోట్లు..

Monday,May 01,2017 - 03:19 by Z_CLU

బాహుబలి-2 సృష్టిస్తున్న ప్రభంజనానికి నిలువెత్తు సాక్ష్యం ఇది. బాహుబలి పార్ట్-1 కంప్లీట్ రన్ లో 6వందల కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధిస్తే.. పార్ట్-2 మాత్రం విడుదలైన 3 రోజుల్లోనే 5వందల కోట్ల రూపాయల గ్రాస్ కొల్లగొట్టి భారతీయ సినీచరిత్రలోనే తిరుగులేని రికార్డును సొంతం చేసుకుంది. బాహుబలి-1 వచ్చినప్పుడు తెలుగు సినిమా జాతీయ స్థాయికి వెళ్లిందని అంతా పొంగిపోయారు. కానీ తాజాగా విడుదలైన బాహుబలి-2 బాలీవుడ్ ను మించిపోయి.. అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది.

ఒక్క హిందీ వెర్షన్ కే ఈ 3 రోజుల్లో 122 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. తమిళ వెర్షన్ కు పాతిక కోట్లు, మలయాళ వెర్షన్ కు 11 కోట్ల రూపాయలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో 74 కోట్ల రూపాయల షేర్ రాబట్టిన ఈ సినిమా.. మిగతా అన్ని రాష్ట్రాల్లో వసూళ్ల వర్షం కురిపిస్తోంది.

అటు అమెరికా, కెనడాల్లో ఈ సినిమాకు అడ్డులేకుండా పోయింది. హాలీవుడ్ లో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్-8తో పోటీగా వసూళ్లు రాబడుతోంది బాహుబలి – ది కంక్లూజన్. ఇప్పటికే 10 మిలియన్ మార్క్ క్రాస్ చేసిన ఈ సినిమా, త్వరలోనే మరిన్ని రికార్డులు సృష్టించనుంది. మిగతా దేశాల్లో కూడా బాహుబలి-2 మేనియా కొనసాగుతోంది.