జెర్సీ మూవీ రివ్యూ

Friday,April 19,2019 - 01:26 by Z_CLU

నటీనటులు: నాని, శ్రద్ధ శ్రీనాధ్, సత్యరాజ్, రోనిత్ కమ్ర, రావు రమేష్, ప్రవీణ్
సంగీతం: అనిరుద్
కెమెరా: సాను జాన్
ఆర్ట్: అవినాష్ కొల్ల
ఎడిటర్: నవీన్ నూలి
సమర్పణ: పి.డి.వి.ప్రసాద్
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
కధ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి
నిడివి: 2 గంటల 30 నిమిషాలు
సెన్సార్ : క్లీన్ U
రిలీజ్ డేట్: ఏప్రిల్ 19, 2019

నాని ఎప్పుడూ రిలీజ్ కు ముందు ఇలా మాట్లాడలేదు. సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పలేదు. జెర్సీ సినిమాపై నానికి ఎందుకు అంత నమ్మకం? ఈరోజు థియేటర్లలోకొచ్చింది జెర్సీ. మరి నాని నమ్మకం నిజమైందా? సినిమా హిట్టయిందా?

కథ

అర్జున్ (నాని).. క్రికెట్ అతడి ప్రపంచం. హైదరాబాద్ ప్లేయర్ గా ది బెస్ట్ అనిపించుకుంటాడు. రంజీల్లో కూడా సత్తా చాటుతాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో క్రికెట్ ను వదిలేస్తాడు. ప్రేమించిన సారా (శ్రద్ధ శ్రీనాధ్)ను పెళ్లి చేసుకుంటాడు. వాళ్లకు ఓ కొడుకు కూడా పుడతాడు. కానీ క్రికెట్ ను వదిలేసి పదేళ్లయినా జీవితంలో సెటిల్ అవ్వడు అర్జున్. భార్య సంపాదన మీద బతుకుతుంటాడు. ప్రభుత్వ ఉద్యోగం కూడా పోగొట్టుకుంటాడు.

అనుకోని సంఘటనల మధ్య మరోసారి క్రీజ్ లోకి అడుగుపెడతాడు అర్జున్. ఊహించని విధంగా క్రికెట్ బ్యాట్ పట్టుకుంటాడు. 36 ఏళ్ల లేటు వయసులో అర్జున్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంటాడు? అసలు అర్థాంతరంగా అర్జున్ క్రికెట్ ను వదిలేయడానికి కారణం ఏంటి? క్లయిమాక్స్ లో అర్జున్ ఏం సాధించాడు? అనేది బ్యాలెన్స్ కథ.

 

నటీనటుల పనితీరు

నాని… నాని.. నాని.. జెర్సీ గురించి మాట్లాడితే నాని గురించి తప్ప ఇక ఎవ్వరి గురించి మాట్లాడనక్కర్లేదు. నేచురల్ స్టార్ కు సాలిడ్ క్యారెక్టర్ పడితే ఎలా ఉంటుందో జెర్సీ చూస్తే తెలుస్తుంది. సినిమాలో కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు నాని. కొన్ని సందర్భాల్లో నాని ఇచ్చిన చిన్న చిన్న ఎక్స్ ప్రెషన్స్ కూడా ఎంతో చెబుతాయి. సినిమాకు అదే ప్లస్ అయింది.

హీరోయిన్ శ్రద్ధా శ్రీనాధ్ కు ఇది పెర్ఫెక్ట్ డెబ్యూ. దాదాపు 3 ఆఫర్లు వదులుకొని మరీ ఆమె ఎందుకు జెర్సీనే ఎంచుకుందో సినిమా చూస్తే తెలుస్తోంది. లవర్ గా, భార్యగా, ఓ బిడ్డకు తల్లిగా శ్రద్ధ అద్భుతంగా నటించింది. హీరోహీరోయిన్ల తర్వాత చెప్పుకోదగ్గ పాత్ర సత్యరాజ్. కోచ్ పాత్రలో సత్యరాజ్ బాగా నటించాడు. ఇంకా చెప్పాలంటే తెలుగులో బాహుబలి తర్వాత సత్యరాజ్ చేసిన బెస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్ ఇదే. నాని ఫ్రెండ్ గా ప్రవీణ్, లాయర్ గా రావు రమేష్ తమ పాత్రలకు న్యాయం చేశారు.

 

టెక్నీషియన్స్ పనితీరు

ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చారు. ఎవర్నీ తక్కువ చేయడానికి వీల్లేదు. ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది సాను గురించే. ఇతడి సినిమాటోగ్రఫీ అద్భుతం. దీనికి అనిరుధ్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ యాడ్ అయింది. తెరవెనక ఈ రెండు ఎలిమెంట్స్ జెర్సీకి బ్యాక్ బోన్ గా నిలిచాయి. అవినాష్ ఆర్ట్ వర్క్ బాగుంది. నవీన్ నూలి ఇంకొన్ని సీన్స్ ఎడిట్ చేసి ఉంటే బాగుండేది. ఫస్టాఫ్ లో కాస్త స్లో అనిపిస్తుంది.

వీళ్లందర్నీ నడిపించిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కేవలం కథను నమ్మి ఎలాంటి డీవియేషన్స్ లేకుండా సినిమా తీశాడు. కావాలనుకుంటే ఇందులో చిన్న కామెడీ ట్రాక్ పెట్టొచ్చు. లవ్ ట్రాక్ ను ఇంకాస్త పెంచొచ్చు. చివరికి క్రికెట్ సన్నివేశాల్ని కూడా కావాలంటే ఇంకాస్త పెంచుకోవచ్చు. కానీ కథకు ఎంత అవసరమో అంతే చూపించాడు. ఏది అవసరమో అదే ఉంచాడు. చేసింది రెండో సినిమానే అయినప్పటికీ స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరక్షన్ చూస్తే ఇది గౌతమ్ రెండో సినిమా అనిపించదు. అంత డీటెయిలింగ్ వర్క్ చేశాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఇలాంటి స్టోరీని ఎంచుకోవడంలోనే వాళ్ల టేస్ట్ తెలుస్తుంది.


జీ సినిమాలు సమీక్ష

క్రికెట్ అనేదే అతిపెద్ద ఎమోషన్. ఆ ఎమోషన్ కు తండ్రి-కొడుకు అనే మరో పెద్ద ఎమోషన్ ను.. భార్య అనే ఇంకో పెద్ద ఎమోషన్ ను కూడా యాడ్ చేశారు. దీనికితోడు సినిమాలో నాని యాక్టింగ్. ఇవన్నీ కలిసి జెర్సీ సినిమాను హార్ట్ టచింగ్ గా మార్చేశాయి. నిజంగా ఈ సినిమా గుండెలు పిండేస్తుంది.

నాని స్పోర్ట్స్ బేస్డ్ సినిమా చేస్తున్నాడని అంతా అనుకున్నారు. కానీ ఇది కేవలం స్టోర్ట్స్ బేస్డ్ సినిమా కాదని ప్రమోషన్స్ లో పదేపదే చెబుతూ వచ్చాడు నాని. అది నిజమే. ఇది ఓన్లీ స్పోర్ట్స్ డ్రామా కాదు. లార్జర్ దేన్ లైఫ్ సినిమా. అర్జున్ అనే ఓ క్రికెటర్ జీవితం ఇది. ఫ్యామిలీ లైఫ్ లో ఇమడలేక, క్రికెట్ ను వదులుకోలేక మధనపడే ఓ క్రికెటర్ స్ట్రగుల్ ఇది.

ఇది కచ్చితంగా నాని సినిమా. నాని మాత్రమే చేయగల సినిమా. ప్రతి ఎమోషన్ ను అద్భుతంగా పండించాడు నాని. లవర్ గా, క్రికెటర్ గా, తండ్రిగా.. ఇలా ప్రతి షేడ్ లో నాని ది బెస్ట్ అనిపించుకున్నాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే నేచురల్ స్టార్ అనే బిరుదుకు మరోసారి న్యాయం చేశాడు. ఇక హీరోయిన్ శ్రద్ధా శ్రీనాధ్ ను ఈ సినిమా కోసం ఎందుకు తీసుకున్నారో, ఆమె ఎందుకు ఈ సినిమా ఒప్పుకుందో సినిమా చూసిన ప్రేక్షకులకు అర్థమైపోతుంది.

డైరక్టర్-హీరో మధ్య కో-ఆర్డినేషన్ కు జెర్సీ పెర్ ఫెక్ట్ ఎగ్జాంపుల్. డైరక్టర్ గౌతమ్ రైటింగ్ చాలా బాగుంది. ఎక్కడైతే ప్రేక్షకుడు బోర్ ఫీలవుతాడో, రొటీన్ అని ఇబ్బంది పడతాడో అలాంటి స్టఫ్ ను చాలా చాకచక్యంగా పక్కకు తప్పించాడు. ఏదైతే హృదయానికి హత్తుకుంటుందో అలాంటి సన్నివేశాల్నే పెట్టాడు. క్లైమాక్స్ లో దర్శకుడి వర్క్ స్పష్టంగా కనిపిస్తుంది. ఒకే ఒక్క సింగిల్ డైలాగ్ తో సినిమాను ముగించిన విధానం చాలా బాగుంది.

అర్జున్ అనే క్రికెటర్ ఎందుకు క్రికెట్ వదులుకోవాల్సి వచ్చింది? క్రికెట్ వదులుకున్న తర్వాత ప్రభుత్వ ఉద్యోగాన్ని ఎందుకు పోగొట్టుకోవాల్సి వచ్చింది? అతడు తిరిగి క్రికెటర్ గా మారడానికి కారణం ఏంటి? 36 ఏళ్ల లేటు వయసులో క్రికెటర్ గా అర్జున్ ఏం సాధించాడు? లాంటి ఎలిమెంట్స్ ను ఇందులో హార్ట్ టచింగ్ గా చూపించారు.

మరీ ముఖ్యంగా క్రికెట్ ఎపిసోడ్స్ ను రియలిస్టిక్ గా చూపించడంలో యూనిట్ అంతా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది. ఈ విషయంలో ఏ ఒక్కరికో క్రెడిట్ ఇవ్వలేం. దర్శకుడు, హీరో, కెమెరామెన్, సంగీత దర్శకుడు, ఆర్ట్ డైరక్టర్… ఇలా ప్రతి ఒక్కరికి ఆ క్రెడిట్ దక్కుతుంది. అంత నేచురల్ గా వచ్చాయి ఆ సీన్స్.

ఓవరాల్ గా జెర్సీ సినిమా ఈమధ్య కాలంలో వచ్చిన మోస్ట్ ఎమోషనల్ మూవీగా నిలిచిపోతుంది. ఒకట్రెండు చోట్ల సినిమా కాస్త స్లో అనిపించినప్పటికీ.. ఆ ఎమోషన్ కు కనెక్ట్ అయిపోతాం. ప్రతి ఒక్కరు తప్పకుండా చూడాల్సిన మూవీ ఇది.

రేటింగ్3.5/5