చిత్రలహరి మూవీ రివ్యూ

Friday,April 12,2019 - 02:11 by Z_CLU

నటీనటులు : సాయి ధరం తేజ్, కల్యాణి ప్రియదర్శన్ , నివేత పేతు రాజ్,పోసాని, సునీల్ , వెన్నెల కిషోర్ తదితరులు

ఛాయాగ్రహణం : కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని

సంగీతం : దేవి శ్రీ ప్రసాద్

నిర్మాణం : మైత్రి మూవీ మేకర్స్

నిర్మాతలు : నవీన్ , రవి , మోహన్

రచన – దర్శకత్వం : కిషోర్ తిరుమల

నిడివి : 130 నిమిషాలు

విడుదల తేది : 12 ఏప్రిల్ 2019

 

వరుసగా ఆరు ఫ్లాపులు అందుకోవడంతో హీరోగా తేజ్ ఓ హిట్టు అందుకోవాలని మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా కోరుకున్నారు. అందరికీ కనెక్ట్ అయ్యే టైటిల్ , టీజర్, ట్రైలర్ ఇంప్రెస్ చేయడంతో సినిమాపై అంచనాలు పెరిగి పాజిటీవ్ వైబ్స్ క్రియేట్ చేసాయి. మరి ‘చిత్రలహరి’ తో తేజ్ హిట్టు కొట్టాడా? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.


కథ :

ఇంజినీరింగ్ పూర్తి చేసి తండ్రి సపోర్ట్ తో తనకొచ్చిన ఆలోచనలతో విజయం కోసం ఎదురుచూస్తూ కొన్ని ప్రయత్నాలు చేస్తుంటాడు విజయ్ కృష్ణ(సాయి తేజ్). సక్సెస్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసిన సక్సెస్ కి… కిలో మీటర్ దూరంలో ఆగిపోతుంటాడు. అదే సమయంలో విజయ్ జీవితంలోకొస్తుంది లహరి(కళ్యాణి ప్రియదర్శన్). ఎప్పుడూ నెగిటీవ్స్ జరిగే తన జీవితంలో లహరి పరిచయం ఓ పాజిటీవ్ విషయం అనుకుంటాడు. కొన్ని రోజులు వెంట తిరుగుతూ లహరి ని ప్రేమలో పడేస్తాడు.

ఇక అబ్బాయిలంతా ఒకటే అనే మెంటాలిటీతో ఉండే ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేసే స్వేచ్చ(నివేత పెతురాజ్) లహరికి చిన్నప్పటి స్నేహితురాలిగా పరిచయం అవుతుంది. ఇక విజయ్ ని కలవకుండానే లహరికి తన లవర్ గురించి నెగిటీవ్ గా చెప్తుంది. దాంతో విజయ్ ని అపార్థం చేసుకొని అతని నుండి విడిపోతుంది లహరి. ఇక ప్రతీ చోట నిరాశే ఎదురవడం, ప్రేమించిన అమ్మాయి కూడా దూరం అవ్వడం, విజయం వైపు పరిగేట్టాలని తండ్రి చెప్పడంతో తను నమ్మిన ప్రాజెక్ట్ పై దృష్టి పెడతాడు. ఈ క్రమంలో స్వేఛ్చ సహకారంతో ఓ కంపెని ద్వారా ప్రాజెక్ట్ ఓకే చేయించుకొని సక్సెస్ బాటలో అడుగులేస్తాడు. ఈ ప్రయాణంలో చివరికి విజయ్ సక్సెస్ అందుకున్నాడా..? విజయ్ కృష్ణ డిజైన్ చేసిన ప్రాజెక్ట్ అతనికి సమాజంలో ఓ గుర్తింపు తీసుకొస్తుందా..? అనేది మిగతా కథ.

 

నటీనటుల పనితీరు:

విజయ్ కృష్ణ క్యారెక్టర్ లో సాయి తేజ్ నటన బాగుంది. కొన్ని ఎమోషనల్ సీన్స్ లో బాగా నటించాడు. రియల్ లైఫ్ లోనూ సక్సెస్ కోసం ఎదురుచూస్తుండటంతో క్యారెక్టర్ ని ఓన్ చేసుకొని నటించాడు. కొన్ని సందర్భాల్లో హీరోగా కాకుండా క్యారెక్టర్ లో కనిపించడానికి ప్రయత్నించాడు. కళ్యాణి ప్రియదర్శన్ పరవాలేదనిపించుకుంది. కథలో స్కోప్ ఉన్న క్యారెక్టరే అయినా సన్నివేశాలు తక్కువ ఉండటంతో హైలైట్ అవ్వలేకపోయింది.

స్వేఛ్చ క్యారెక్టర్ లో నివేత బెస్ట్ అనిపించుకుంది. ఇప్పటికే మంచి పెర్ఫార్మర్ అనిపించుకున్న నివేత మరో సారి నటిగా మంచి మార్కులు అందుకుంది. సునీల్ కామెడీ టైమింగ్ తో కొన్ని సన్నివేశాల్లో నవ్వించాడు. ఉన్నంత సేపు వెన్నెల కిశోర్ తన కామెడీతో ఎంటర్ టైన్ చేసాడు. పోసాని కి మరో సారి మంచి క్యారెక్టర్ దొరకడంతో నటుడిగా మెప్పించాడు. సుదర్శన్ , హైపర్ ఆది రెండు మూడు సన్నివేశాలకే పరిమితం అయ్యారు. బ్రహ్మాజీ,జయ ప్రకాష్ , మిగతా నటీ నటులంతా క్యారెక్టర్స్ కి న్యాయం చేసారు.

సాంకేతిక వర్గం పనితీరు:

దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. రిలీజ్ కి ముందే సాంగ్స్ తో ఎట్రాక్ట్ చేసిన దేవి సినిమాకు తగ్గ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. ‘ప్రేమ వెన్నెల’,’గ్లాస్ మేట్స్’,’పరుగు పరుగు’ పాటలు బాగున్నాయి. అన్ని పాటలకు మంచి సాహిత్యం కుదిరింది. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ బాగుంది. ‘గ్లాస్ మేట్స్’ , ‘ప్రేమ వెన్నెల’ పాటలకు కొరియోగ్రఫీ ఆకట్టుకుంది. కిశోర్ తిరుమల డైలాగ్స్ , స్క్రీన్ ప్లే బాగున్నాయి. రచయితగా కిషోర్ తిరుమల మరోసారి తన ప్రతిభ చూపించుకున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వేల్యూస్ బాగున్నాయి.


జీ సినిమాలు సమీక్ష :

కొన్నేళ్లుగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న సాయి ధరం తేజ్ ‘చిత్రలహరి’తో ఆకట్టుకున్నాడు. కాకపోతే ప్రేక్షకుడిని పూర్తి స్థాయిలో అలరించడంలో మాత్రం ‘చిత్రలహరి’ విఫలం అయ్యింది. ఈ సినిమా కోసం దర్శకుడు కిషోర్ మంచి స్టోరీ లైన్ తీసుకున్నప్పటికీ దాన్ని పూర్తి స్థాయిలో మెప్పించే సినిమాగా మలచలేకపోయాడు. అప్పటి ‘చిత్రలహరి’ ఎన్నో సినిమాలు, వివిధ రకాల పాటలను ఒకటి చేసే ప్రోగ్రాం అయితే.. ఈ చిత్రలహరి వివిధ రకాల పాత్రలను ఒకటి చేసే సినిమా అంటూ ప్రారంభంలోనే టైటిల్ కి జస్టిఫికేషన్ ఇచ్చిన కిషోర్ ఆ పాత్రలతో ఎంటర్టైన్ చేయగలిగాడు కానీ… ఆ పాత్రలను ప్రేక్షకులకి కనెక్ట్ చేయలేకపోయాడు.

విజయం కోసం తాపత్రయ పడే విజయ్ గాధను ఎంటర్టైనింగ్ గా చెప్పే ప్రయత్నం చేసాడు దర్శకుడు. అక్కడే రాంగ్ స్టెప్ వేశాడనిపిస్తుంది. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో విజయ్ తాలుకు బాధను ఇంకా ఎమోషనల్ గా చూపించి ఉంటే ఆడియన్స్ కి సినిమా ఇంకా కనెక్ట్ అయ్యేది. కాకపోతే ఓన్లీ ఎంటర్టైన్ మెంట్ అన్నట్టుగా కథను సిద్దం చేసుకున్నాడు కిశోర్. సినిమాలో ఎంటర్టైన్ మెంట్ ఉండాలి కానీ ఎమోషన్ కూడా పండాలి. అప్పుడే సినిమా ప్రేక్షకుడి మనసులో చోటు సంపాదించుకుంటుంది. ఈసారి ఈ లాజిక్ మిస్ అయ్యాడు దర్శకుడు. అదే సినిమాకు మైనస్.

ఫస్ట్ హాఫ్ అంతా సక్సెస్ కోసం విజయ్ చేసే ప్రయత్నాలు, అక్కడ అతనికి ఎదురయ్యే సంఘటనలు తాలుకు సన్నివేశాల మీదే సినిమాను నడిపించి అలరించిన దర్శకుడు రెండో భాగంలో మాత్రం పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయాడు. రెండో భాగంలో వచ్చే వెన్నెల కిషోర్ కామెడీ కొంత వరకూ సినిమాకి బలం అని చెప్పొచ్చు. లవ్ ట్రాక్ ని కూడా ఒకే పాటలో చూపించేశాడు. అలా తన బలాన్ని ఒక పాటకే కుదించుకున్నాడు దర్శకుడు. రెండో భాగంలో పోసాని-తేజ్ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్ బాగుంది. అలాంటివి రెండు మూడు పడితే సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండేది.

కుర్రాళ్ళకి కనెక్ట్ అయ్యే స్టోరీ లైన్, కామిడీ , సాంగ్స్ , కొన్ని సన్నివేశాలు, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ లాంటి అంశాలు ‘చిత్రలహరి’ కి ప్లస్ పాయింట్స్.  రెండో భాగంలో బలమైన సన్నివేశాలు లేకపోవడం, ఎమోషన్ మిస్ అవ్వడం మైనస్.

బాటమ్ లైన్ : విజయ్ విజయ గాధ

రేటింగ్ : 2.75/5