ఇయర్ ఎండ్ స్పెషల్ : సైలెంట్ హిట్స్-2019

Saturday,December 28,2019 - 10:03 by Z_CLU

చిరంజీవి సినిమా భారీ అంచనాలతో వచ్చింది. అందుకు తగ్గట్టుగానే హిట్ అయింది. మహేష్ సినిమా కూడా హెవీ ఎక్స్ పెక్టేషన్స్ మధ్య వచ్చింది. ఆ అంచనాల్ని అందుకుంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయేవి సైలెంట్ హిట్స్. ఎలాంటి అంచనాల్లేకుండా వచ్చి సంచలనాలు సృష్టించిన సినిమాలివి. ఓ మోస్తరు అంచనాలతో వచ్చి బాక్సాఫీస్ ను షేక్ చేసిన మూవీస్ ఇవి. ఆ లిస్ట్ పై ఓ లుక్కేద్దాం

‘ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ’.. పేరే చాంతాడంత ఉంది. ఇక సినిమాలో ఏముంటుందిలే అనుకున్నారంతా. విడుదలై మొదటి ఆట పడింది. షాకవ్వడం ప్రేక్షకుల వంతయింది. నిజంగా ఆత్రేయ మేజిక్ చేశాడు. చిన్న బడ్జెట్, తక్కువ వనరులు.. అయితేనేం కథ-స్క్రీన్ ప్లేపై నమ్మకం పెట్టుకుంది యూనిట్. అదే నిజమైంది. ఈ ఒక్క సినిమాతో నవీన్ పొలిశెట్టి ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు.

‘ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ’లో ఆత్రేయ హీరో. ‘బ్రోచేవారెవరురా’ కూడా దాదాపు ఇలాంటి సినిమానే. ఇందులో కూడా ఆత్రేయనే హీరో. అవును.. ఈ సినిమాను డైరక్ట్ చేసిన వివేక్ ఆత్రేయకే క్రెడిట్ మొత్తం ఇవ్వాలి. కథ, స్క్రీన్ ప్లేతో మెస్మరైజ్ చేశాడు ఈ కుర్ర డైరక్టర్. శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, నివేత లాంటి తెలిసిన ముఖాలు ఉన్నప్పటికీ.. మూవీ ఇంత వండర్ క్రియేట్ చేయడానికి కారణం కేవలం డైరక్టర్ మాత్రమే.

ఈ ఏడాది సైలెంట్ హిట్స్ టాప్-5 లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా  ‘మత్తు వదలరా’ సినిమా ఉంటుంది. రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ 2019కి సిసలైన ఫినిషింగ్ టచ్ ఇచ్చింది. కీరవాణి చిన్న కొడుకు శ్రీసింహా హీరోగా నటిస్తే, పెద్దకొడుకు కాలభైరవ మ్యూజిక్ ఇచ్చాడు. వీళ్లిద్దరితో పాటు దర్శకుడు రితేష్ రానా కలిసి టాలీవుడ్ లో వస్తున్న మూస సినిమాల మత్తు వదిలించారు. మంచి కథ అనుకొని, పక్కాగా స్క్రీన్ ప్లే రాసుకుంటే బడ్జెట్ తో పనిలేదని నిరూపించింది ఈ మూవీ.

‘మత్తు వదలరా’ సినిమా కంటే ముందే టాలీవుడ్ కు చిన్నపాటి జర్క్ ఇచ్చిన మూవీ ‘ఫలక్ నుమా దాస్’. ఈ సినిమాలో హీరో విశ్వక్ సేన్, ఈ సినిమాకు దర్శకుడు కూడా విశ్వక్ సేన్. అంతేకాదు, తన సొంత డబ్బులు పెట్టి తీసిన సినిమా ఇది. దీంతో విశ్వక్ కు డబ్బులు ఎక్కువై సినిమా తీస్తున్నాడని వెక్కిరించే వాళ్లు ఎక్కువయ్యారు. ఇలా ఎన్ని అవమానాలు ఎదురైనా తన స్టోరీపై, మేకింగ్ పై నమ్మకంతో ముందుకుసాగిన విశ్వక్ సేన్ అనుకున్నది సాధించాడు. లో-బడ్జెట్ లో వచ్చిన ‘ఫలక్ నుమా దాస్’ సంచలన విజయం సాధించింది. తెలంగాణ యాస, హైదరాబాద్ కథతో తీసిన ఈ సినిమా ఉత్తరాంధ్రలో కూడా హిట్ అయిందంటే అది ఈ సినిమా గొప్పదనం.

కొన్నాళ్లుగా సక్సెస్ లేక ఇబ్బంది పడిన సందీప్ కిషన్ కూడా ఈ ఏడాది సైలెంట్ హిట్ అందుకున్నాడు. ఎలాంటి అంచనాల్లేకుండా వచ్చిన ‘నిను వీడని నీడను నేనే’ సినిమా మంచి విజయం సాధించింది. డైరక్టర్ కార్తీక్ రాజు సినిమాలో ఇచ్చిన ట్విస్టులు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఈ సినిమాతో హీరోగానే కాకుండా, నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యాడు సందీప్ కిషన్.

ఇప్పటివరకు చెప్పుకున్న సినిమాలన్నీ సైలెంట్ హిట్స్ అయితే, ఓ మోస్తరు అంచనాలతో వచ్చి హిట్ అయిన సినిమాగా నిలిచింది ‘ఓ బేబీ’. సమంత లీడ్ రోల్ పోషించడంతో విడుదలకు ముందు ఈ సినిమాపై కాస్త బజ్ క్రియేట్ అయింది. ట్రయిలర్ కూడా హిట్ అయింది. అలా ఓ మోస్తరు అంచనాలతో వచ్చిన ‘ఓ బేబి’ సినిమా థియేటర్లలో సక్సెస్ అయింది. ఓవర్సీస్ లో అయితే ఈ సినిమా ఏకంగా మిలియన్ డాలర్ క్లబ్ లో చేరింది.

‘118’ కూడా ఇలాంటి విజయమే. కొత్త దర్శకుడితో కల్యాణ్ రామ్ చేసిన ఈ సినిమాపై పెద్దగా ఎవ్వరికీ అంచనాల్లేవ్. అలా ఓ మోస్తరు అంచనాలతో వచ్చిన ఈ సినిమా కల్యాణ్ రామ్ కెరీర్ లో హిట్ మూవీగా నిలిచింది. కేవీ గుహన్ ఈ సినిమాకు దర్శకుడు.

సాయితేజ్ కెరీర్ కు బూస్టప్ ఇచ్చిన సినిమా ‘చిత్రలహరి’. అప్పటివరకు సరైన సక్సెస్ లేక ఇబ్బందిపడుతున్న సాయితేజ్ ఈ సినిమాతో మంచి విజయాన్నందుకున్నాడు. గమ్మత్తైన విషయం ఏంటంటే.. ఈ సినిమాకు వర్క్ చేసిన హీరోహీరోయిన్లతో పాటు దర్శకుడు, నిర్మాత ఇలా అంతా అప్పటివరకు ఫ్లాపులు చూసినవాళ్లే. వాళ్లందరికీ ‘చిత్రలహరి’ కలిసొచ్చింది.

అసలు ఎప్పుడు రిలీజ్ అయిందో కూడా తెలియకుండా వచ్చి సైలెంట్ హిట్టయిన మూవీ ‘గేమ్ ఓవర్’. తాప్సి నటించిన ఈ సినిమాను రిలీజైనంతవరకు ఎవ్వరూ పట్టించుకోలేదు. తీరా థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఈ మూవీ కట్టిపడేసింది. థ్రిల్లర్ జానర్ ఇష్టపడే ప్రేక్షకులు ఇప్పటికీ ఈ సినిమాను రిపీట్ మోడ్ లో చూస్తున్నారంటే, గేమ్ ఓవర్ ఏ రేంజ్ లో కనెక్ట్ అయిందో అర్థం చేసుకోవచ్చు.

ప్యూర్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా కేవలం ఓ వర్గానికి మాత్రమే నచ్చుతుందనుకున్నారు. ఓ రాజకీయ వర్గం దీన్ని విమర్శిస్తుందని అనుకున్నారు. కానీ రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రేక్షకుల్ని ఎమోషనల్ గా హత్తుకుంది ‘యాత్ర’ సినిమా. పొలిటికల్ ఎలిమెంట్స్ తో కాకుండా, ఇలా ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా ఎట్రాక్ట్ చేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు.

‘క్షణం’ సినిమా హిట్టయింది కాబట్టి అన్నీతానై అడవి శేష్ తీసిన ఎవరు సినిమాపై ఓ మోస్తరు అంచనాలు పెరిగాయి. అయితే తన సినిమాలపై ఎన్ని అంచనాలైనా పెట్టుకోవచ్చని నిరూపించుకున్నాడు అడవి శేష్. ‘ఎవరు’ సినిమా ఇనిస్టెంట్ హిట్ అయింది. ఇది ఎంతలా ఆడియన్స్ పై ప్రభావం చూపించిందంటే.. ఈ సినిమాను చూసిన కంటితో ఆ తర్వాతొచ్చిన థ్రిల్లర్స్ ను ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఈ కంపారిజన్ వల్లనే ఎవరు తర్వాత వచ్చిన చాలా థ్రిల్లర్స్ ఫెయిల్ అయ్యాయి. అంతలా ప్రేక్షకుల్ని కట్టిపడేసింది ఈ మూవీ.

ఇక ‘అర్జున్ సురవరం’ కూడా ఈ ఏడాది సైలెంట్ హిట్స్ జాబితాలో చేరిపోయింది. వరుసగా వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీ ఎట్టకేలకు విడుదలై సక్సెస్ అందుకుంది. మొదటి రోజు మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ.. రోజులు గడిచేకొద్ది నిఖిల్ కెరీర్ లో ఇది హిట్ మూవీగా నిలిచింది.

లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ‘రాక్షసుడు’ మూవీ. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన ఈ సినిమా కూడా ఎలాంటి అంచనాల్లేకుండా వచ్చి హిట్ అయింది. ఎలాంటి మార్పుచేర్పులు చేయకుండా రీమేక్ ను ఉన్నది ఉన్నట్టుగా తీసి హిట్ కొట్టారు. ఈ మూవీతో చాన్నాళ్ల తర్వాత మెగా ఫోన్ పట్టుకున్న రమేష్ వర్మ కూడా సక్సెస్ ట్రాక్ పైకి వచ్చినట్టయింది.