ఇయర్ ఎండ్ స్పెషల్: కొత్తకథలు

Wednesday,December 18,2019 - 10:11 by Z_CLU

ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకుంటారు ప్రేక్షకులు. అలాంటి సినిమాలోచ్చినప్పుడు కచ్చితంగా ఆదరించి హిట్ చేస్తుంటారు. అయితే ఈ ఏడాది కూడా అలాంటి కొన్ని కొత్త కథలు హల్చల్ చేసి ప్రేక్షకులను ఆకర్షించి నిర్మాతలకు కలెక్షన్స్ తెచ్చిపెట్టాయి. ఈ ఏడాది కొత్తదనంతో వచ్చిన సినిమాలేంటి ? అవి ఆడియన్స్ ను ఎలా ఎట్రాక్ట్ చేసాయి ‘జీ సినిమాలు’ ఎక్స్ క్లూజీవ్ స్టోరీ.

సమంత ఈ ఏడాది ఓ కొత్త కథతో ‘ఓ బేబీ’ అంటూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఓ వృద్దాప్యంలో ఉన్న మహిళ యవ్వనం పొందితే ఎలా ఉంటుంది..? అనే కథతో కొరియన్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. కథతో పాటు కథనం కూడా కొత్తగా అనిపించడంతో ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మరథం పట్టారు.

అప్పటి వరకూ హీరోయిజంతో మెప్పించిన హీరో నెగిటీవ్ క్యారెక్టర్ తో సినిమా చేస్తే ఆటోమేటిక్ గా సినిమాలో కొత్తదనం కనిపిస్తుంది.  సరిగ్గా ‘గద్దల కొండ గణేష్’ విషయంలో అదే జరిగింది. పైగా రౌడీని హీరోగా పెట్టి అతని ఆత్మ కథతో  సినిమా తీయడం అనే కాన్సెప్ట్  అందరినీ ఎట్రాక్ట్ చేసి సినిమా కాసుల వర్షం కురిపించింది.

ఇప్పటి వరకూ నాని చేసిన సినిమాలు ఒకెత్తు… ‘జెర్సీ’ మరో ఎత్తు. కొడుకు ముందు ఎప్పటికి హీరోలా ఉండాలనుకునే ఓ తండ్రి కథను కొత్తగా తెరకెక్కించి స్ట్రాంగ్ ఎమోషన్ తో అందరినీ మెప్పించాడు గౌతం తిన్ననూరి. కథ,తండ్రి పాత్రలో నాని నటన , తండ్రి కొడుకుల ఎమోషన్ అన్నీ కొత్తగా అనిపించడంతో ప్రేక్షకుల మెప్పు పొందింది ‘జెర్సీ’.

తన ప్రతీ సినిమాలో ఏదో కొత్తదనం ఉండేలా చూసుకునే కళ్యాణ్ రామ్ ఈ ఏడాది కొత్త కాన్సెప్ట్ తో ‘118’ అనే సినిమా చేసి ప్రేక్షకులను కొత్తగా ఎంటర్టైన్ చేసాడు. అప్పటి వరకూ క్రైం థ్రిల్లర్ లా సాగిన కథకి దర్శకుడు డ్రీం అనే సైన్స్ ఎలిమెంట్ ను యాడ్ చేసి రాసుకున్న క్లైమాక్స్ కొత్తగా అనిపించింది. అందుకే మూడు రోజులకే సినిమా బ్రేక్ ఈవెన్ దాటి వసూళ్లు తెచ్చిపెట్టింది.

కొందరు హీరోలని బట్టి సినిమాలో కొత్తదనం ఉంటుందని ఫిక్స్ అయిపోతారు ప్రేక్షకులు. అలాంటి హీరోల్లో అడివి శేష్ ఒకడు.  ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ‘ఎవరు’ అనే కొత్త కథతో ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో వచ్చాడు శేష్. అందుకే ఆ కొత్తదనానికి ఫిదా అయిన ప్రేక్షకులు సినిమాను హిట్ చేసేసి శేష్ కి మరో హిట్ అందించేసారు.

ఇప్పటి వరకూ టచ్ చేయని క్రైం థ్రిల్లర్ జోనర్ లో సినిమా చేసి ఆడియన్స్ కి ఓ కొత్త అనుభూతి కలిగించాడు బెల్లంకొండ శ్రీనివాస్. రమేష్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన ‘రాక్షసుడు’ తో మంచి విజయం అందుకున్నాడు. చిన్నపిలల్లను హత్య చేసే సైకో..అతన్ని పట్టుకునేందుకు ప్రత్నించే హీరో.. చివరికి అతన్ని పట్టుకోగలిగాడా లేదా అనే కథనంతో సాగే స్క్రీన్ ప్లే అందరినీ కట్టిపడేసింది. అందుకే సినిమా ఈ ఏడాది సూపర్ హిట్స్ లో ప్లేస్ అందుకుంది.

వీడియో గేమ్స్ కి  బాగా  అడిక్ట్ అయిన ఓ అమ్మాయి కథతో, హారర్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ‘గేమ్ ఓవర్’ సినిమా కూడా ఈ ఏడాది అందరినీ ఎట్రాక్ట్ చేసి హిట్ అనిపించుకుంది. ముఖ్యంగా సినిమాలో తాప్సీ నటనకు మంచి మార్కులు పడ్డాయి.

ఈ ఏడాది నిర్మాతగా మారి ‘నిను వీడని నీడను నేనే’ అనే సినిమా చేసాడు సందీప్ కిషన్. అయితే తన స్వీయ నిర్మాణంలో సినిమా ఎందుకు చేసాడన్నది సినిమా చూడగానే ప్రేక్షకులకు అర్థమైపోయింది. అద్దంలో చూసుకున్నప్పుడు తన మొఖానికి బదులు మరో వ్యక్తి మొఖం కనిపించడం అనే కొత్త కథతో ఆసక్తికరమైన కథనంతో ప్రేక్షకులను థ్రిల్ చేసి 2019 హిట్ లిస్టులో చేరింది ‘నిను వీడని నీడను నేనే’. కార్తిక్ రాజు రాసుకున్న కథ -కథనంతో పాటు వెన్నెల కిషోర్ కామెడీ సినిమాకు హైలైట్ గా నిలిచింది.

‘బ్రోచేవారెవరురా’ అనే థ్రిల్లర్ సినిమాతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు శ్రీ విష్ణు. మొదటి సినిమాతో పూర్తిగా ఎంటర్టైన్ చేయలేకపోయిన వివేక్ ఆత్రేయ రెండో సినిమాకు పకడ్బందీగా కథనం రాసుకొని ఆసక్తికరంగా తెరకెక్కించి సూపర్ హిట్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. ఒక ప్రేమ కథతో సినిమాను స్టార్ట్ చేసి ఆ తర్వాత  క్రైం థ్రిల్లర్ లా సాగిన కథనం సినిమాకు హైలైట్ నిలిచి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.


‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ అనే ఓ చిన్న సినిమా కొత్త కథతో ఈ ఏడాది పెద్ద విజయం సాదించి ఔరా అనేలా చేసింది. ఓ మర్డర్ ఇన్వెస్టిగేషన్ తో మొదలై తర్వాత ఓ పెద్ద స్కామ్ బయటపడేలా ఆసక్తికరమైన కథ -కథనం రాసుకొని మెస్మరైజ్ చేసాడు స్వరూప్. నవీన్ పోలిశెట్టిను హీరోగా పరిచయం చేస్తూ స్వరూప్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా అందరి మన్ననలు పొంది ఈ ఇయర్ చిన్న సినిమాల్లో బెస్ట్ సినిమా అనిపించుకుంది.

నిఖిల్ కూడా ఈ ఏడాది ఓ కొత్త కథతో ప్రేక్షకులను మెప్పించాడు.  ఎడ్యూకేషన్ లోన్ , సర్టిఫికెట్స్ స్కామ్ కథతో రీమేక్ గా తెరకెక్కిన ‘అర్జున్ సురవరం’  సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకొని విజయం అందుకుంది.