టాలీవుడ్ టు బాలీవుడ్

Friday,April 14,2017 - 02:36 by Z_CLU

టాలీవుడ్ హీరోలు బాలీవుడ్ కు వెళ్లడం దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాం. కుదిరితే స్ట్రయిట్ మూవీ, లేకుంటే డబ్బింగ్ వెర్షన్ తో హిందీ తెరపై చాలామంది తెలుగు హీరోలు మెరిశారు. కానీ తెలుగు పరిశ్రమకు చెందిన దర్శకులు, బాలీవుడ్ లో సినిమాలు చేయడం మాత్రం చాలా తక్కువ.  కమ్యూనికేషన్ గ్యాప్, నార్త్ ఆడియన్స్ పల్స్ పట్టుకోలేకపోవడం, వర్కింగ్ స్టయిల్ లో తేడాలు… ఇలా కొన్ని టెక్నికల్-లాజికల్ రీజన్స్ తో తెలుగు దర్శకులు ఇక్కడికే పరిమితమైపోయారు. అయితే ఇప్పుడిప్పుడే ఈ పరిస్థితులు మారుతున్నాయి. టాలీవుడ్ డైరక్టర్లు కూడా బాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటున్నారు.

తెలుగులో సందేశాత్మక, విలక్షణ చిత్రాలతో పేరుతెచ్చుకున్న క్రిష్.. బాలీవుడ్ లో కూడా లక్ చెక్ చేసుకున్నాడు. అక్షయ్ కుమార్ హీరోగా గబ్బర్ ఈజ్ బ్యాక్ అనే సినిమాను తెరకెక్కించాడు. రీసెంట్ గా బాలయ్య వందో సినిమాకు దర్శకత్వం వహించిన ఈ డైరక్టర్.. ప్రస్తుతం హిందీలో కంగనా రనౌత్ లీడ్ క్యారెక్టర్ లో ఝాన్సీ లక్ష్మీబాయ్ జీవిత చరిత్రను తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నాడు.

 

క్రిష్ రూట్లోనే ఇప్పుడు దేవ కట్టా కూడా నడుస్తున్నాడు. ప్రస్థానం సినిమాతో టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్న ఈ దర్శకుడు త్వరలోనే ఓ హిందీ సినిమా చేస్తానని ప్రకటించాడు. అయితే ఆ వివరాల్ని మాత్రం వెల్లడించలేదు. తెలుగులో ప్రస్థానం సినిమా దేవ కట్టాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. మరి, హిందీలో కూడా అదే సినిమాను రీమేక్ చేస్తాడేమో చూడాలి.

టాలీవుడ్ టు బాలీవుడ్ దర్శకుల లిస్ట్ లో పూరి జగన్నాధ్, రామ్ గోపాల్ వర్మ కూడా ఉన్నారు. అమితాబ్ బచ్చన్ తో బుడ్డా హోగా తేరా బాప్ సినిమా తెరకెక్కించిన పూరి జగన్నాధ్… కుదిరితే మరోసారి బాలీవుడ్ లో మెగాఫోన్ పట్టుకునే ఆలోచనలో ఉన్నాడు. రీసెంట్ గా అభిషేక్ బచ్చన్ కు టెంపర్ కథ వినిపించినప్పటికీ.. ఆ ప్రాజెక్టు వర్కవుట్ కాలేదు. ప్రస్తుతం బాలయ్య 101వ సినిమాను డైరక్ట్ చేస్తున్న పూరి, ఆ సినిమా కంప్లీట్ అయిన తర్వాత బాలీవుడ్ మూవీస్ గురించి ఆలోచించే అవకాశముంది. ఇక రామ్ గోపాల్ వర్మ అయితే సత్య, సర్కార్, కంపెనీ లాంటి సినిమాలతో ఏకంగా బాలీవుడ్ లోనే పాతుకుపోయాడు.

దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా బాలీవుడ్ లో సినిమా చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు. కుదిరితే హ్యాపీ డేస్ లేదా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాల్లో ఒకదాన్ని హిందీలో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు కమ్ముల. వరుణ్ తేజ్ హీరోగా ఫిదా అనే సినిమాను తీస్తున్న కమ్ముల, ఆ ప్రాజెక్టు కంప్లీట్ అయిన తర్వాత బాలీవుడ్ మూవీ గురించి ఆలోచిస్తాడు.