6 గంట‌ల వ‌ర‌కే నేను స్టార్‌ని:  స‌మంత

Monday,April 10,2023 - 12:34 by Z_CLU

శ‌కుంత‌ల దుష్యంతుల అమ‌ర‌ప్రేమ‌గాథ ‘శాకుంత‌లం’ ఈ నెల 14న విడుద‌ల కానుంది. గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా గురించి ముంబై మీడియాతో ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన అంశాల‌ను పంచుకున్నారు స‌మంత రూత్ ప్ర‌భు. ఆ విశేషాలు  స‌మంత మాట‌ల్లోనే…

 

కాస్త భ‌య‌ప‌డ్డాను

నేను చిన్న‌ప్ప‌టి నుంచీ డిస్నీ జోన‌ర్ సినిమాల‌ను చాలా ఇష్ట‌ప‌డేదాన్ని. నేను ఆనందంగా ఉన్నా వాటిని చూసేదాన్ని. బాధ‌లో ఉన్నా వాటినే చూసేదాన్ని. శాకుంత‌లం సినిమాలో యువ‌రాణిగా న‌టించ‌డం చాలా ఆనందంగా, ప్ర‌త్యేకంగా అనిపించింది. ఆ పాత్ర‌లో అంత ప‌ర్ఫెక్ట్ గా చేయ‌డం చాలా సంతోషంగా ఉంది. శాకుంత‌లం క‌థ నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన‌ప్పుడు చాలా ఆలోచించాను. కాస్త భ‌య‌ప‌డ్డాను. కానీ, కొన్నేళ్లుగా సవాళ్ల‌ను స్వీక‌రించ‌డం నాకు అల‌వాటైపోయింది. నిర్మాత దిల్‌రాజుగారికి స్క్రిప్ట్ మీద చాలా న‌మ్మ‌కం ఉంది. నా చిన్న‌త‌నంలో శ‌కుంత‌ల పాత్ర గురించి చాలా క‌ల‌లు క‌నేదాన్ని. అమ్మాయిలు, మ‌హిళ‌లు, ఫ్యామిలీలు త‌ప్ప‌కుండా ఎంజాయ్ చేస్తారు. ఈ పాత్ర‌లో న‌టిస్తున్నంత సేపు ఓ ప్రేక్ష‌కురాలిగా నేను సినిమాను ఆస్వాదించాను. ఇది సింపుల్‌గా చెప్పేసే క‌థ కాదు. ఇందులో ప్రేమ ఉంది. మోసం ఉంది. అంతకు మించిన భావోద్వేగాలు చాలానే ఉన్నాయి. ఎన్నో శ‌తాబ్దాల‌కు పూర్వం రాసిన క్లిష్ట‌మైన క‌థ ఇది.

 

డిస్నిఫైడ్‌కి సిద్ధంగా ఉండండి

స‌కుటుంబ‌స‌ప‌రివార స‌మేతంగా చూడ‌ద‌గ్గ సినిమా ఇది. మండు వేస‌విలో కుటుంబ‌మంతా కూర్చుని చూడాల్సిన సినిమా. డిస్నిఫైడ్‌కి సిద్ధంగా ఉండండి.

 

గుణ‌శేఖ‌ర్ ఫెమినిస్ట్

నా దృష్టిలో ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ ఫెమినిస్ట్. ఆయ‌న ఫీమేల్ ఓరియంటెడ్ క‌థ‌లు రాస్తారు. రిస్క్ తీసుకోవ‌డానికి భ‌య‌ప‌డ‌రు. గొప్ప గొప్ప క‌థ‌ల‌ను మహిళ‌ల చుట్టూ ఆస‌క్తిక‌రంగా న‌డ‌పాల‌ని ప్ర‌య‌త్నిస్తారు.

 

కేర‌క్ట‌ర్ల‌న్నీ ఒక ఎత్తు, అర్హ రోల్ మ‌రో ఎత్తు

నా దృష్టిలో అల్లు అర్హ స్వ‌యంస్వ‌తంత్రురాలు. త‌నకు కావాల్సిన నిర్ణ‌యాలు తానే తీసుకోగ‌ల‌దు. ఆమె తండ్రి (అల్లు అర్జున్‌) ఆమె విష‌యాల్లో క‌ల‌గ‌జేసుకోవాల్సిన అవ‌స‌రం లేదు. ఆమె కెరీర్ విష‌యంలోనూ అత‌ని జోక్యం అవ‌స‌రం లేదు. ఆమె కెరీర్‌లో ఇది అద్భుత‌మైన చిత్రం. అర్హ రోల్ చాలా అద్భుతంగా వ‌చ్చింది. లీడ్ కేర‌క్ట‌ర్ల‌న్నీ ఒక ఎత్తు, అర్హ రోల్ మ‌రో ఎత్తు. అంత బాగా వ‌చ్చింది. అందుకే పిల్ల‌లు, ఫ్యామిలీస్ ఈ క‌థ‌ను ఆస్వాదిస్తారని న‌మ్ముతున్నా.

 

ఆరు గంట‌ల వరకే  స్టార్‌ని

ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాక జీవితం ఎలా మారింది? అని అడిగితే, స‌మంత స‌ర‌దాగా స్పందించారు. తాను ప్యాన్ ఇండియా స్టార్‌న‌నే విష‌యాన్ని త‌న పెంపుడు జంతువుల‌కి ఎవ‌రైనా చెబితే బావుంటుంద‌ని అన్నారు. నేనింకా వాటి మ‌లాన్ని ఎత్తిపోస్తున్నాను.  అంటూ న‌వ్వేశారు. నా జీవితం మారింద‌ని నేను అనుకోలేదు. నేను ఆరు గంట‌ల దాకానే స్టార్‌ని. ఆ త‌ర్వాత నా జీవితం చాలా సాదాసీదాగా ఉంటుంది“ అని అన్నారు.

 

యాక్ష‌న్ పాత్ర‌లు కూడా చేస్తున్నాను

నేను ఇక్క‌డిదాకా వ‌స్తాన‌ని ఎప్పుడూ ఊహించ‌లేదు. నేను చేస్తున్న పాత్ర‌ల విష‌యంలో చాలా ఆనందంగా ఉన్నాను. గ‌ర్వ‌ప‌డుతున్నాను. నేను చేస్తున్న ప‌ని క‌ష్ట‌త‌ర‌మైన‌దే. యాక్ష‌న్ పాత్ర‌లు కూడా చేస్తున్నాను. ‘ఫ్యామిలీమేన్‌2’ లో నేను చేసిన కేర‌క్ట‌ర్ అలాంటిదే. ఎప్పుడూ స్క్రీన్ మీద ఎవ‌రో ఒక హీరో వ‌చ్చి కాపాడుతుంటే, బేల‌గా ఉండే పాత్ర‌లే చేయ‌క్క‌ర్లేదు. స‌బ‌ల‌గా కూడా న‌టించాలి. అలా న‌టించ‌డం కొత్త‌గా ఉంది. దాన్ని ఆస్వాదిస్తున్నాను. చాలా ఆనందంగా అనిపిస్తోంది.

 

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics