Ustad Bhagat Singh - హరీశ్ శంకర్ సినిమా స్టార్ట్ చేసిన పవన్

Thursday,April 06,2023 - 02:45 by Z_CLU

Pawan Kalyan Harish Shankar’s Ustaad Bhagat Singh goes on floors

గబ్బర్ సింగ్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ ద్వయం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం రెండోసారి చేతులు కలిపారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్నారు. సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడీగా మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తోంది.

‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం గత డిసెంబర్ లో గ్రాండ్ గా లాంఛ్ అయింది. నిన్నట్నుంచి రెగ్యులర్ షూట్ మొదలైంది. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి రూపొందించిన అద్భుతమైన పోలీస్ స్టేషన్ సెట్ లో మొదటి షెడ్యూల్ మొదలైంది. కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్న ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ తో పాటు మరికొంతమంది ఆర్టిస్టులు పాల్గొన్నారు.

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కలయికలో ఇప్పటిదాకా వచ్చింది ఒక్క ‘గబ్బర్ సింగ్’ సినిమానే అయినప్పటికీ.. ఆ సినిమా సృష్టించిన ప్రభంజనం కారణంగా వీరి కాంబోలో వస్తున్న రెండో సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉస్తాద్ ను తీస్తానంటున్నాడు హరీష్ శంకర్.

ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ‘గబ్బర్ సింగ్’ కు కూడా ఇతడే మ్యూజిక్ డైరక్టర్. ప్రొడక్షన్ డిజైనర్ గా ఆనంద్ సాయి, ఎడిటర్ గా ఛోటా కె.ప్రసాద్ పని చేస్తున్నారు. అయానంక బోస్ సినిమాటోగ్రాఫర్. ఈ సినిమాలో అశుతోష్ రాణా, నవాబ్ షా, కేజీఎఫ్ అవినాష్, గౌతమి, నర్రా శ్రీను, నాగ మహేష్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.