BROTeaser అంచనాలు డబుల్

Thursday,June 29,2023 - 07:26 by Z_CLU

Power-packed, energetic teaser of Pawan Kalyan, Sai Dharam Tej starrer Bro, directed by Samuthirakani, launched

  జీ స్టూడియోస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలిసి నిర్మిస్తున్న బ్రో సినిమాకు సంబంధించి స్పెషల్ టీజర్ విడుదలైంది.   పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. జూలై 28న విడుదల కానున్న ఈ సినిమా పవర్ ప్యాక్డ్ టీజర్‌ను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు.

చీకటిలో చిక్కుకొని ఒకరి సహాయం కోరుతున్న సాయి ధరమ్ తేజ్ వాయిస్‌తో టీజర్ మొదలైంది. తేజ్  ‘మాస్టర్’, ‘గురు’, ‘తమ్ముడు’ అని రకరకాలుగా సంబోధిస్తాడు. చివరకు ‘బ్రో’ అని పిలుస్తాడు. ఆ తర్వాత పెద్ద ఉరుము పవన్‌ కళ్యాణ్ రాకకు స్వాగతం పలికింది. ‘తమ్ముడు’ సహా పవన్ హిట్ చిత్రాలను గుర్తు చేస్తూ, టీ గ్లాస్ పట్టుకుని, పవర్ స్టార్ అనేక రకాల లుక్స్ లో కనిపిస్తూ ఎట్రాక్ట్ చేశారు.

పవన్ కళ్యాణ్ ఓం లాకెట్ ధరించి,  చిరునవ్వుతో కనిపించారు. ఆ తర్వాత కూలీ దుస్తులు ధరించి ‘కాలం మీకు అంతు పట్టని ముడి జాలం’ అంటూ సాయి ధరమ్ తేజ్‌కి స్వాగతం పలకడం ఆకట్టుకుంది. అల్లరిగా కనిపించే సాయి ధరమ్ తేజ్‌తో ఆయన సరదాగా ఆడుకోవడం టీజర్ లో హైలైట్ గా నిలిచింది. గిటార్ పట్టుకుని పార్టీలో డ్యాన్స్ చేయడం నుండి వారి మధ్య వచ్చే సంభాషణల వరకు అభిమానుల చేత విజిల్ వేయించే  మూమెంట్స్ టీజర్ లో చాలానే ఉన్నాయి.

‘సినిమాలు ఎక్కువ చూస్తావేంట్రా నువ్వు’ అంటూ కారులో పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగ్‌తో టీజర్‌ ని ముగించిన తీరు బాగుంది. సినిమాలో వినోదానికి కొదవ లేదని  టీజర్ చూస్తే అర్థమవుతుంది. అసలు కథ రివీల్ చేయకుండా, టీజర్ ని ఇంట్రెస్టింగ్ గా కట్ చేశారు.

ఎస్ థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , విజువల్స్ , పవన్ కళ్యాణ్  కామెడీ టైమింగ్‌తో బ్రో టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. జూలైలో ప్రేక్షకులకు ఈ సినిమా ద్వారా విందు భోజనం అందడం ఖాయమనిపిస్తుంది. ఇందులో టైటిల్ పాత్రధారి ‘బ్రో’గా పవన్ కళ్యాణ్ నటిస్తుండగా, మార్క్ అకా మార్కండేయులుగా సాయి ధరమ్ నటిస్తున్నారు.