My Dear Markandeya కిక్ ఇచ్చిన ఫస్ట్ సింగిల్

Saturday,July 08,2023 - 05:16 by Z_CLU

First single from Pawan Kalyan, Sai Dharam Tej’s ‘Bro’ out

 పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న ‘బ్రో’ సినిమా రిలీజ్ కి రెడీ అయింది. సముద్రఖని డైరెక్షన్ లో త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన క్యారెక్టర్ పోస్టర్లు, ప్రోమోలు, టీజర్‌కు అద్భుతమైన స్పందన రాగా, తాజగా ‘బ్రో’ నుండి ఫస్ట్ సింగిల్ విడుదలైంది.

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ల కాంబో సాంగ్ కోసం ఎస్ తమన్ కంపోజ్ చేసిన ‘మై డియర్ మార్కండేయ’ సాంగ్ ను ఫస్ట్ సింగిల్ గా రిలీజ్ చేశారు.  రేవంత్, స్నిగ్ధ శర్మఈ సాంగ్ ను పాడారు.  రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటకు గణేష్ స్వామి, భాను నృత్యరీతులు అందించారు. పబ్ సెట్‌లో ఈ సాంగ్ ను ఘాట్ చేశారు. జీవితం , టైమ్ గురించి లోతైన భావంతో నిండిన ఈ పాట, సందేశాన్ని ఇవ్వడంతో పాటు మంచి ఎనర్జీ నింపేలా ఉంది.

మై డియర్ మార్కండేయ పాట “కమాన్ కమాన్ డ్యాన్స్ బ్రో.. యమ్మా యమ్మా బీట్స్ బ్రో.. జిందగీనే జూక్‌బాక్స్ బ్రో” అంటూ ట్రెండీగా ప్రారంభమైన ఈ సాంగ్ లో స్టైలిష్ అవతార్‌లో కనిపించిన సాయి ధరమ్ తేజ్ తనదైన నాట్యంతో ఆకట్టుకున్నాడు. అద్భుతమైన సినిమాటోగ్రఫీ మరియు ప్రొడక్షన్ డిజైన్ తో కన్నుల పండుగలా ఉంది పాట.

తన చరిష్మాతో తెరకు నిండుతనం తీసుకొచ్చే పవన్ కళ్యాణ్ రాకతో పాట ఊపందుకుంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. “మై డియర్ మార్కండేయా.. మంచి మాట చెప్తా రాసుకో.. మళ్లీ పుట్టి భూమికి రానే రావు నిజం తెలుసుకో.. పక్క దిగి నిద్రలేచే ప్రతిరోజు పండగ చేసుకో..” అనే పంక్తులు ఆయన వ్యక్తిత్వానికి, పాత్రకు సరిగ్గా సరిపోయేలా ఉన్నాయి.

ఈ పాటలో ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్న ఊర్వశి రౌతేలా తన గ్లామర్ షో, డాన్స్ తో  మరో హైలైట్ గా నిలిచింది.

ఈ సినిమాలో టైటిల్ పాత్రధారి(బ్రో)గా పవన్ కళ్యాణ్ నటిస్తుండగా, మార్క్ అకా మార్కండేయులుగా సాయి ధరమ్ నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్, సముద్రఖని, రోహిణి, రాజేశ్వరి నాయర్, రాజా, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, పృధ్వీ రాజ్, నర్రా శ్రీను, యువలక్ష్మి, దేవిక, అలీ రెజా, సూర్య శ్రీనివాస్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుజిత్ వాసుదేవ్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.