జీ స్పెషల్: 'జయం'గా సాగిపోతున్న భీష్మ'

Sunday,June 14,2020 - 10:24 by Z_CLU

ఏ హీరో కెరీర్ లో అయిన జయాపజయాలు సహజం. కానీ హీరోగా కెరీర్ ఆరంభించిన మొదట్లో బ్యాక్ టు బ్యాక్ రెండు విజయాలు అందుకొని అక్కడి నుండి మళ్లీ పడుతూ లేస్తూ కెరీర్ ని కొనసాగించి ఫైనల్ గా 18 ఏళ్ల కెరీర్ లో కమర్షియల్ హీరోగా ఎదిగిన ఓ హీరో జర్నీపై ఓ లుక్కేద్దాం. అతడే నితిన్. ఈరోజుతో నితిన్ ఇండస్ట్రీకొచ్చి 18 ఏళ్లు. ‘జయం’తో ముందుకు సాగి ‘భీష్మ’గా ఎదిగిన నితిన్ 18 ఏళ్ల కెరీర్ పై ‘జీ సినిమాలు’ స్పెషల్.

ఏ హీరో అయినా తన ఎంట్రీ మంచి విజయంతో మొదలవ్వాలనే కోరుకుంటాడు. నితిన్ కూడా అంతే. ‘జయం’తో విజయం అందుకొని హీరోగా పైకెదగాలనుకొని తేజ చేతిలో పడ్డాడు. ఇంకేముంది మొదటి సినిమాతోనే నటుడిగా మంచి పేరుతో పాటు బ్లాక్ బస్టర్ హిట్ సొంతమైంది. నితిన్ కెరీర్ లో బెస్ట్ క్యారెక్టర్స్ లో వెంకట్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఒక డిస్ట్రిబ్యూటర్ కొడుకు హీరోగా మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టాడా అంటూ కలెక్షన్స్ చూసి ఇండస్ట్రీ జనాలు మాట్లాడుకున్నారు. కానీ ఆ విజయానికి నితిన్ పొంగిపోలేదు. తర్వాత వచ్చిన అపజయాలకు కుంగిపోలేదు. అవును కెరీర్ లో ఎన్ని సక్సెస్ లు సాధించాడో, అదే రేంజ్ లో ఫెయిల్యూర్స్ కూడా చూశాడు ఈ హీరో. కానీ హిట్లు , ఫ్లాపులకి అతీతంగా హీరోగా క్రేజ్ సంపాదించుకున్నాడు.

ఇక ‘జయం’ తర్వాత వి.వి.వినాయక్ దర్శకత్వంలో నితిన్ రెండో సినిమాగా చేసిన ‘దిల్’ కూడా సూపర్ హిట్. సినిమాలో శ్రీను అనే లవర్ బాయ్ క్యారెక్టర్ లో ఎనర్జిటిక్ యాక్టింగ్ తో రెచ్చిపోయాడు నితిన్. ఈ సినిమా విజయంతో నిర్మాత రాజు పేరుకి ముందు ‘దిల్’ అనే సౌండ్ చేరింది. వరుసగా రెండు విజయాలు అందుకునే సరికి హీరోగా ఇక నితిన్ కి తిరుగులేదని అంతా అనుకున్నారు. కానీ తర్వాత రెండు అపజయాలు చవిచూశాడు నితిన్. ఆ అపజయాలతో ఎన్నో నేర్చుకున్నాడు.

తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో ‘సై’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. రగ్బీ గేమ్ తో సాగే ఈ స్పోర్ట్స్ డ్రామా అందరినీ ఆకట్టుకొని నితిన్ కి మరో విజయం అందించింది. ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేసే లోపే నితిన్ కి మరో ప్లాప్ ఎదురైంది. అక్కడి నుండి వరుస పెట్టి ఏకంగా డజను ప్లాపులు అందుకున్నాడు. ఆ సమయంలో నితిన్ ప్లేస్ లో మరో హీరో ఉంటే నిరుత్సాహంతో వెనకడుగు వేస్తాడేమో కానీ నితిన్ సముద్రపు అలలా వెనక్కి వెళ్లి మళ్లీ ఎగసి పడే కెరటంలా ముందుకొచ్చాడు.

12 ప్లాపుల తర్వాత ‘ఇష్క్’ తో సూపర్ హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఆ తర్వాత ‘గుండెజారి గల్లతయ్యిందే’ తో మరో హిట్ అందుకున్నాడు. మళ్లీ ఓ మూడు ప్లాపుల తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో ‘అ ఆ’ తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆనంద్ విహారి అనే పల్లెటూరి కుర్రాడిగా మెప్పించి నటుడిగా మరో మెట్టు పైకెక్కాడు.

అ ఆ Full Movie కోసం క్లిక్ చేయండి

‘అ ఆ’ తర్వాత నితిన్ కెరీర్ మళ్లీ డల్ అయింది. మరీ ముఖ్యంగా శ్రీనివాసకల్యాణం తర్వాత అతడి కెరీర్ గ్రాఫ్ బాగా పడిపోయింది. అలాంటి సమయంలో వచ్చింది భీష్మ. చిన్న సందేశంతో ఓ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ‘భీష్మ’ నితిన్ కి ఓ సాలిడ్ హిట్ అందించింది. ఈ సినిమాతో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు నితిన్. ఈ ఏడాది ఇప్పటివరకు బిగ్గెస్ట్ హిట్ ఇదే.

భీష్మ ఇచ్చిన ఉత్సాహంతో ఒకేసారి 4 ప్రాజెక్టులు లైన్ లో లెట్టాడు యూత్ స్టార్. త్వరలో వెంకీ అట్లూరి డైరెక్షన్ లో ‘రంగ్ దే’ అనే యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ తో థియేటర్స్ లోకి రాబోతున్న నితిన్ చిన్న గ్యాప్ తో మళ్లీ ‘చెక్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అలాగే మేర్లపాక గాంధీతో ‘అంధాదున్’ రీమేక్ , కృష్ణ చైతన్య డైరెక్షన్ లో ‘పవర్ పేట’ అనే సెంటిఫిక్ థ్రిల్లర్ జోనర్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.

అప్ కమింగ్ మూవీస్ తో నితిన్ తన కెరీర్ లో మరింత ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటోంది ‘జీ సినిమాలు’. ఆల్ ది బెస్ట్ నితిన్.