మరో ప్రముఖ పాత్రలో అనుష్క

Saturday,April 22,2017 - 10:03 by Z_CLU

క్యారెక్టర్ కు వెయిట్ ఉండే పాత్రలు చేయాలంటే ప్రస్తుతం మేకర్స్ అంతా అనుష్క వైపే చూస్తున్నారు. అరుంధతి, రుద్రమదేవి,బాహుబలి లాంటి సినిమాల్లో లీడ్ రోల్స్ పోషించిన అనుష్క.. తాజాగా మరో ప్రతిష్టాత్మక పాత్రను దక్కించుకున్నట్టు తెలుస్తోంది. సావిత్రి బయోపిక్ గా త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న మహానటి ప్రాజెక్టులో అనుష్క ఓ కీలక పాత్ర పోషించనుందట.

మహానటి పాత్ర కోసం ఇప్పటికే కీర్తి సురేష్, సమంతను తీసుకున్నారు. సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తిసురేష్ కనిపించనుంది. ఇక జర్నలిస్ట్ పాత్రలో సమంత కనిపిస్తుందట. సమంత కోణంలోనే సినిమా సాగుతుందని తెలుస్తోంది. ఇప్పుడీ ఇద్దరు కాకుండా అనుష్కను కూడా తీసుకున్నారట. సినిమాలో కీలకమైన జమున పాత్ర కోసం అనుష్క ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో త్వరలోనే సెట్స్ పైకి రానుంది మహానటి సినిమా. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రీసెర్చ్ పూర్తిచేసిన నాగ్ అశ్విన్.. స్క్రీన్ ప్లే పనుల్ని కూడా ఫైనల్ స్టేజ్ కు తీసుకొచ్చాడు. అశ్వనీదత్ నిర్మాతగా వైజయంతీ మూవీస్ బ్యానర్ పై రానున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించబోతున్నాడు.