Movie Review - ది ఘోస్ట్

Wednesday,October 05,2022 - 06:45 by Z_CLU

నటీనటులు: నాగార్జున, సోనాల్ చౌహాన్, గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు
దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు
నిర్మాతలు: నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మారర్
బ్యానర్లు: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్
సినిమాటోగ్రఫీ: ముఖేష్ జి.
సంగీతం: మార్క్ కె రాబిన్, (పాటలు భరత్ – సౌరబ్)
యాక్షన్: దినేష్ సుబ్బరాయన్, కేచ్
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
రన్ టైమ్: 140 నిమిషాలు
సెన్సార్: U/A
రిలీజ్ డేట్: అక్టోబర్ 5, 2022

నాగార్జున నటించిన యాక్షన్ అడ్వెంచరస్ మూవీ ది ఘోస్ట్. హాలీవుడ్ స్టయిల్ లో తెరకెక్కిన ఈ సినిమాతో నాగ్ హిట్ కొట్టాడా? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ

THE GHOST Nagarjuna

కథ
విక్రమ్ (నాగార్జున) ఇంటర్ పోల్ ఆఫీసర్. గర్ల్ ఫ్రెండ్ ప్రియ (సోనాల్ చౌహన్)తో కలిసి సీక్రెట్ ఆపరేషన్స్ చేస్తుంటాడు. అలాంటి ఓ ఆపరేషన్ లో తన కారణంగా ఓ పిల్లాడు చనిపోయాడని మానసికంగా ఫీల్ అవుతుంటాడు నాగ్. మరోవైపు నాగార్జునకు ఓ ఫ్యామిలీ లైఫ్ కూడా ఉంటుంది. అది కూడా డిస్టర్బ్ అవుతుంది. 20 ఏళ్లుగా అక్క అను (గుల్ పనాగ్) నాగార్జునతో మాట్లాడదు. ఓ రోజు ఉన్నట్టుండి అను నుంచి కాల్ వస్తుంది. తనకు ఓ సమస్య వచ్చిందని చెబుతుందామె. దాన్ని నాగార్జున ఎలా సాల్వ్ చేశాడు.. అసలు అనుకు ఎదురైన సమస్య ఏంటి.. అండర్ వరల్డ్ కు అను ఫ్యామిలీకి లింక్ ఏంటి.. అనేది గాడ్ ఫాదర్ స్టోరీ.

నటీనటుల పనితీరు
నాగ్ యాక్షన్ విశ్వరూపం ది ఘోస్ట్ లో కనిపిస్తుంది. మన్మధుడు లాంటి సాఫ్ట్ మూవీస్, అన్నమయ్య లాంటి డివోషనల్ మూవీస్ చేసిన నాగార్జునేనా ఈ యాక్షన్ చేసింది అని ఆశ్చర్యపోయేలా నాగార్జున నటించాడు. అతడి స్టయిలిష్ లుక్, యాక్షన్ సినిమాకు బ్యాక్ బోన్. సోనాల్ చౌహాన్ గ్లామర్ తో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ తో కూడా ఆకట్టుకుంది. గుల్ పనాగ్ తన పాత్రకు తగ్గట్టు హుందాగా నటించగా, నాగ్ మేనకోడలు పాత్రలో అనిఖా సురేంద్రన్ చాలా బాగా చేసింది. ఇక రవివర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ తమ పాత్రలకు తగ్గట్టు నటించారు.

టెక్నీషియన్స్ పనితీరు
టెక్నికల్ గా ముందు చెప్పుకోవాల్సింది యాక్షన్ ఎపిసోడ్స్ గురించే. ప్రతి యాక్షన్ సీక్వెన్స్ ను చక్కగా కంపోజ్ చేశారు. దేనికదే అన్నట్టు డిజైన్ చేశారు. మరీ ముఖ్యంగా నాగ్ కత్తి విన్యాసాలు చూడముచ్చటగా ఉన్నాయి. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ కు మార్క్ కె రాబిన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరింది. అటు సినిమాటోగ్రాఫర్ ముఖేష్ కూడా తన సత్తా చూపించాడు. బ్రహ్మ కడలి ఆర్ట్ వర్క్, ఎడిటింగ్, డీఐ, భారీ నిర్మాణ విలువలు.. ఇలా అన్నీ యాడ్ అవ్వడంతో.. ది ఘోస్ట్ సినిమా ఇంటర్నేషనల్ మూవీ లుక్ అండ్ ఫీల్ అందిస్తుంది. అటు దర్శకుడు ప్రవీణ్ సత్తారు కూడా ఈ కథను తనదైన స్క్రీన్ ప్లేతో చక్కగా నడిపించాడు.

THE-GHOST-nagarjuna

జీ సినిమాలు రివ్యూ

శివ సినిమా నుంచి ఇప్పటివరకు సినిమాల్లో ఏదో ఒక రూపంలో ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు నాగార్జున. తాజాగా వచ్చిన ది ఘోస్ట్ సినిమాలో కూడా నాగార్జున ఓ ప్రయోగం చేశారు. చూడ్డానికి ఇదొక కమర్షియల్ సినిమాలా అనిపించినప్పటికీ, టాలీవుడ్ కు కొత్త రకం ఫైట్స్ ను పరిచయం చేసింది ది ఘోస్ట్.

ఇన్నాళ్లూ హాలీవుడ్ సినిమాలు, కొరియన్ మూవీస్ లో ఫైట్స్ చూసి ముచ్చటపడ్డాం. అలాంటి ఫైట్స్ మన సినిమాల్లో ఎందుకు కనిపించవని బాధపడ్డాం. సరిగ్గా నాగార్జున ఇదే పట్టుకున్నారు. ది ఘోస్ట లో హాలీవుడ్ ఫైటింగ్ స్టయిల్ ను చూపించారు. అటు గన్ తో, ఇటు తమహగామె (కత్తి)తో నాగార్జున చేసిన ఫైట్స్ ది ఘోస్ట్ కు మెయిన్ ఎట్రాక్షన్.

జేమ్స్ బాండ్, మిషన్ ఇంపాజిబుల్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సినిమాల్లో పాటించిన ఎత్తుగడను ది ఘోస్ట్ లో ఫాలో అయ్యారు. సినిమా ప్రారంభమవ్వడమే భారీ యాక్షన్ ఎపిసోడ్ తో మొదలవుతుంది. రిలీజ్ కు ముందు హాట్ టాపిక్ గా మారిన ఎడారిలో తీసిన యాక్షన్ ఎపిసోడ్ తోనే సినిమా స్టార్ట్ అయింది. అది హాలీవుడ్ స్టయిల్, రేంజ్ లో ఉందనుకునేలోపే, మన తెలుగు సినిమా ఫార్ములాను గుర్తుకుతెస్తూ, పాటను కొనసాగించారు. అందులో సోనాల్ తో బికినీ ట్రీట్ కూడా అందించారు.

సాంగ్ తర్వాత ఇక ఎక్కడా ఆలస్యం చేయకుండా నేరుగా కథలోకి వెళ్లిపోయాడు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. నాగార్జునకు ఘోస్ట్ అనే పేరు ఎందుకొచ్చింది, అసలు నాగ్ దుబాయ్ లో ఏం చేశాడనే విషయంపై సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ, ఫస్టాఫ్ ను గ్రిప్పింగ్ గా నడిపించాడు దర్శకుడు.

అయితే ఫస్టాఫ్ లో ఏ ఫ్లాష్ బ్యాక్ పై సస్పెన్స్ పెంచాడో, ఆ ఎపిసోడ్ ను దర్శకుడు సరిగ్గా డీల్ చేసినట్టు అనిపించలేదు. సెకండాఫ్ లో ఓ షిప్ లో వచ్చే ఆ సన్నివేశం మరింత బలంగా ఉంటే బాగుండేది. ఇక క్లయిమాక్స్ లో కూడా యాక్షన్ ఫుల్ గా ఉందికానీ, లాజిక్ మిస్సయింది. ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని పక్కనపెడితే, ఓ సరికొత్త యాక్షన్ ను టాలీవుడ్ కు పరిచయం చేయడంలో నాగార్జున, ప్రవీణ్ సత్తారు సక్సెస్ అయ్యారు.

సినిమాలో యాక్షన్ పార్ట్ పుష్కలంగా ఉంది. అడుగడుగునా ఫైట్స్ కనిపిస్తాయి. అదే సమయంలో మంచి ఎమోషన్, కథ కూడా ఉంటే బాగుండేది. సినిమాలో పాత్రల మధ్య ఎమోషన్ మిస్సయింది. 20 ఏళ్ల తర్వాత అక్కని చూడ్డానికి నాగార్జున వచ్చినప్పుడు, మేనకోడల్ని సరైన మార్గంలో నడిపించినప్పుడు వచ్చే సీన్లు మరింత డెప్త్ గా ఉంటే బాగుండేవి. వీటికి తోడు ఈ సినిమాను ఫుల్ లెంగ్త్ అండర్ వరల్డ్ మాఫియా డ్రామాగా భావించి సినిమాకొచ్చిన వాళ్లకు కూడా నిరాశ తప్పదు. ఒక దశలో మూవీలో అండర్ వరల్డ్ మొత్తం పక్కకెళ్లిపోయి, ఓ కార్పొరేట్ కంపెనీ అందులో రాజకీయాలు తెరపైకొస్తాయి. విలన్ పాత్ర బలంగా లేకపోవడం మరో వెలితి.

ఏ పాత్రనైనా ఓన్ చేసుకునే నాగార్జున ఘోస్ట్ గా సూపర్ గా సెట్ అయ్యారు. విక్రమ్ పాత్రలో నాగ్ యాక్టింగ్ ను సిల్వర్ స్క్రీన్ పై చూసి తీరాల్సిందే. మరీ ముఖ్యంగా బాంబ్ బ్లాస్ట్ ఎపిసోడ్ లో నాగార్జున, శిధిలాల మధ్య నుంచి లేచిన సీన్ లో అతడి ఫ్యాన్స్ కు శివ సినిమా గుర్తుకొస్తుంది. యాక్షన్ సీన్స్ లో నాగార్జున అద్భుతంగా చేశారు. ఇక సోనాల్ చౌహాన్ కూడా తన గ్లామర్, యాక్షన్ తో ఆకట్టుకుంది. కీలక పాత్రలు పోషించిన గుల్ పనాగ్, అనికా సురేంద్రన్, రవివర్మ తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్ గా సినిమా టాలీవుడ్ స్థాయిని ఇంకాస్త పెంచింది. యాక్షన్ సీన్స్ అయితే దేనికదే బెస్ట్ అన్నట్టున్నాయి. ఆర్ట్స్ వర్క్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి. ఇక దర్శకుడు ప్రవీణ్ సత్తారు విషయానికొస్తే.. తనకు ఎంతో ఇష్టమైన యాక్షన్ జానర్ కు ఈసారి కాస్త ఎమోషన్, ఫ్యామిలీ టచ్ ఇవ్వడానికి ప్రయత్నించిన ఈ దర్శకుడు అక్కడక్కడ తడబడ్డాడు. ఓవరాల్ గా మాత్రం తన బెస్ట్ ఇచ్చాడు.

ఓవరాల్ గా, హాలీవుడ్ స్టయిల్ యాక్షన్ ను ఇష్టపడే ఆడియన్స్ కు ది ఘోస్ట్ విపరీతంగా నచ్చుతాడు. ఎమోషనల్ గా సినిమా అంతగా కనెక్ట్ కానప్పటికీ.. నాగ్ యాక్షన్ కోసం ఈ సినిమాను తప్పకుండా ఓసారి చూడొచ్చు.

రేటింగ్ – 2.5/5