Movie Review - గాడ్ ఫాదర్

Wednesday,October 05,2022 - 01:42 by Z_CLU

నటీ నటులు : చిరంజీవి, సల్మాన్ ఖాన్ , నయనతార , సత్య దేవ్ , మురళి శర్మ , సునీల్ , అనసూయ , దివిఫాదర్, తాన్య రవిచంద్రన్ తదితరులు

సినిమాటోగ్రఫర్  : నీరవ్ షా

సంగీతం  : ఎస్ఎస్ తమన్

మాటలు : లక్ష్మి భూపాల

సమర్ఫణ : కొణిదెల సురేఖ

నిర్మాణం : కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్

నిర్మాతలు: ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్

స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మోహన్ రాజా

విడుదల తేది : 5 అక్టోబర్ 2022

నిడివి : 157 నిమిషాలు

మెగా స్టార్ చిరంజీవి హీరోగా సల్మాన్ ఖాన్ ప్రత్యేక పాత్రలో నటించిన ‘గాడ్ ఫాదర్‘ భారీ అంచనాలతో థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫర్ కి రీమేక్ గా తెరకెక్కిన గాడ్ ఫాదర్ తఆడియన్స్ ను మెస్మరైజ్ చేసిందా ? ఆచార్య తో అపజయం అందుకున్న చిరంజీవి గాడ్ ఫాదర్ గా మెప్పించి విజయం అందుకున్నాడా ? జీ సినిమాకు ఎక్స్ క్లూసివ్ రివ్యూ. 

 godfather

కథ : 

ముఖ్యమంత్రి పీకేఆర్ హఠాన్మరణంతో ఉన్నపళంగా రాష్ట్ర రాజకీయాల్లో మార్పు వస్తుంది.  ఖాళీ అయిన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునేందుకు పీకేఆర్ అల్లుడు జయ్దేవ్ (సత్యదేవ్) తెరవెనుక ఎవరికీ తెలియకుండా రాజకీయం నడిపిస్తుంటాడు. మరో వైపు పదవి కాంక్షతో ఉన్న వర్మ అతనికి సపోర్ట్ అందిస్తూ పార్టీ పెద్దగా ఉంటాడు.

ఈ క్రమంలో పీకేఆర్ పెద్ద కొడుకు బ్రహ్మ(చిరంజీవి) కథలోకి ఎంటరై సర్వాంతర్యామిలా చక్రం తిప్పుతుంటాడు. జై దేవ్ వేసే ప్రతీ ఎత్తుకి పై ఎత్తు వేస్తూ అతనికి ఎప్పటికప్పుడు చెక్ పెడుతుంటాడు. చివరికి తన తండ్రి స్థానంలో చెల్లెలు సత్యప్రియ (నయనతార)ను ముఖ్యమంత్రి హోదాలో కూర్చోబెట్టేందుకు బ్రహ్మ ఏం చేశాడనేది మిగతా కథ.

నటీ నటుల పనితీరు : 

 బ్రహ్మ అనే కింగ్ మేకర్ పాత్రలో మెగాస్టార్ మెరుపులు సృష్టించాడు. తన వయసుకి తగిన పెద్దరికం ఉన్న పాత్రతో ఆకట్టుకున్నారు. కారులో నుండి ఎంట్రీ ఇచ్చే మొదటి షాట్ నుండి క్లైమాక్స్ వరకూ అదే ఎనర్జీ చూపించి మెస్మరైజ్ చేశాడు. ముఖ్యంగా సినిమాలో చిరు స్వాగ్ అదిరింది. చిరంజీవి కి చెల్లెలు పాత్రలో కనిపించిన నయనతార సత్య ప్రియ కేరెక్టర్ కి పర్ఫెక్ట్ అనిపించుకుంది. ఇక చిరంజీవి నటన తర్వాత చెప్పుకోవాల్సింది సత్య దేవ్ గురించి. ఇలాంటి పాత్రలకు ఇతర భాష నటులను తీసుకోకుండా తెలుగులో తను ఉన్నాడని రుజువు చేసుకున్నాడు సత్యదేవ్. ఒరిజినల్ లో వివేక్ ఒబెరాయ్ కి ఏ మాత్రం తీసిపోని విధంగా ఆ పాత్రను రక్తి కట్టించి నటుడిగా మరో మెట్టు ఎక్కాడు సత్యదేవ్. స్పెషల్ రోల్ లో కనిపించిన సల్మాన్ ఖాన్ సినిమాకు ప్లస్ అయ్యాడు. కాకపోతే ఆ కేరెక్టర్ డిజైనింగ్ ప్రాపర్ గా కుదరలేదు. క్యామియో రోల్ చేసిన పూరి  మంచి నటన కనబరిచాడు. తన డైలాగ్ డెలివరీతో సన్నివేశాలకు బలం చేకూర్చాడు. మురళి శర్మ కి కథలో చాలా ముఖ్యమైన పాత్ర దక్కడంతో నటనతో ఆకట్టుకున్నాడు. కానీ ఆయన పాత్ర అల వైకుంఠపురములో పాత్రను పోలినట్టు అనిపిస్తుంది. సునీల్ , దివి ఇద్దరూ ఆకట్టుకున్నారు. తాన్య రవిచంద్రన్ నయనతార చెల్లెలి పాత్రకు సూటయింది. హీరో పాత్రకు సపోర్టింగ్ గా నిలిచే కేరెక్టర్ ఆర్టిస్ట్ లుగా బ్రహ్మాజీ , షఫీ , సమ్మెట గాంధి , నాగ మహేష్ , పవన్ కొణిదెల , గెటప్ శ్రీను న్యాయం చేశారు. పోలీస్ పాత్రలో  సముత్రఖని మిగతా పాత్రల్లో ప్రగతి , సాయాజీ షిండే మిగతా నటీ నటులంతా తమ పాత్రలకు న్యాయం చేసి సన్నివేశాలు బాగా రావడానికి కారణం అయ్యారు.

సాంకేతిక వర్గం పనితీరు : 

సినిమాకు తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బిగ్ ప్లస్ పాయింట్. పొలిటికల్ సన్నివేశాలకు , హీరోయిజం ఎలివేట్ అయ్యే సీన్స్ కి అలాగే యాక్షన్ బ్లాక్స్ కి తమన్ ఇచ్చిన నేపథ్య సంగీతం బాగుంది. తన మ్యూజిక్ తో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్ళాడు తమన్. నీరవ్ షా సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని సన్నివేశాలను తన కెమెరాతో హ్యాండిల్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటింగ్ డ్రాగ్ లేకుండా క్రిస్ప్ గా ఉంది. సురేష్ సెల్వరాఘవన్ ఆర్ట్ వర్క్ బాగుంది.

లక్ష్మి భూపాల అందించిన కొన్ని పవర్ ఫుల్ డైలాగ్స్ ఫ్యాన్స్ చేత క్లాప్స్ కొట్టించేలా ఉన్నాయి. మోహన్ రాజా స్క్రీన్ ప్లే -డైరెక్షన్ బాగుంది. ఈ రీమేక్ ను హ్యాండిల్ చేసిన విధానం దర్శకుడిగా మోహన్ రాజాకు తెలుగులో మరిన్ని అవకాశాలు తెచ్చిపెట్టడం ఖాయం. ప్రొడక్షన్ వేల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

 godfather

జీ సినిమాలు సమీక్ష : 

మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన లూసిఫర్ ను తెలుగులో చిరంజీవి రీమేక్ చేయబోతున్నారనే వార్త వచ్చినప్పటి నుండి ప్రేక్షకుల్లో పలు సందేహాలు కలిగాయి. అందుకే ఈ కథను తెలుగులో పర్ఫెక్ట్ గా తీసి మెప్పించగలిగే దర్శకుడి కోసం చిరు కొన్ని నెలలు ఎదురుచూశారు. ఇద్దరు ముగ్గురు దర్శకుల పేర్లు వినిపించినప్పటికీ ఫైనల్ గా రీమేక్ రాజా అనిపించుకున్న మోహన్ రాజా చేతిలో ఈ ప్రాజెక్ట్ పెట్టారు మెగా స్టార్. అయితే చిరు , చరణ్ ఇద్దరు తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకొని తెలుగులో కొన్ని మార్పులతో లూసిఫర్ ని ‘గాడ్ ఫాదర్’ గా తెరకెక్కించి మెప్పించాడు మోహన్ రాజా.

ఏదైనా సినిమాను రీమేక్ చేసినప్పుడు ఒరిజినల్ లో ఉండే లోపాలు గమనించి అనలైజ్ చేసుకుంటే ఇంకాస్త బెటర్ అవుట్ పుట్ వస్తుంది. దర్శకుడు మోహన్ రాజా ఒరిజినల్ లో కనిపించే లోపాలను కవర్ చేసి ఈ సినిమాను తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంది. ముఖ్యంగా ఒరిజినల్ లో హీరో తమ్ముడి పాత్రతో పొలిటికల్ డ్రామా నడిపిస్తే తెలుగులో ఆ పాత్రను తొలగించి చెల్లెలి పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే కొన్ని పాత్రలను  ఎక్స్ట్రా గా యాడ్ చేసి కథలో జోడించిన తీరు బాగుంది. ఎక్కువ రన్ ఉన్న సినిమాను  నిడివి తగ్గించడం మంచి ఆలోచన. లూసిఫర్ ఎక్కువ రన్ టైం వల్ల మధ్యలో కాస్త బోర్ కొట్టిస్తుంది. గాడ్ ఫాదర్ కి రన్ టైం  మైనస్ అవ్వకుండా చూసుకోవడం ప్లస్ అయ్యింది. చిరంజీవిను అభిమానులు ఎలాంటి పాత్రలో చూడాలని కోరుకుంటారో సరిగ్గా గాడ్ ఫాదర్ లో అలాంటి కింగ్ మేకర్ బ్రహ్మ పాత్రలో కనిపించి మెస్మరైజ్ చేశారు మెగా స్టార్. తన ఇమేజ్ కి పర్ఫెక్ట్ గా సూటయ్యే కథ , పాత్ర ఎంచుకొని చిరు ఈ రీమేక్ సినిమాతో మెప్పించాడు. ఇంటర్వెల్ కి ముందు ఎంట్రీ ఇచ్చే సల్మాన్ ఖాన్ సినిమాకు ప్లస్ అయ్యాడు కానీ ఆ కేరెక్టర్ ని ఇంకా బాగా డిజైన్ చేసి ఉంటే బాగుండేది.

సినిమాకు బిగ్ ప్లస్ పాయింట్ కాస్టింగ్ అని చెప్పొచ్చు. తెలుగులో అందరికీ తెలిసిన నటీ నటులను పెట్టుకోవడం సినిమాకు కలిసొచ్చిన అంశం. అలాగే  కేరెక్టర్స్ కి పర్ఫెక్ట్ అనిపించే యాక్టర్స్ ని తీసుకోవడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. పొలిటికల్ డ్రామా సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా పూరి జగన్నాథ్ పాత్రతో ఓ వీడియో షో వేసే బ్లాక్ ఆడియన్స్ చేత క్లాప్స్ కొట్టించేలా ఉన్నాయి. అలాగే జయ్ దేవ్ పాత్రకి బ్రహ్మ చెక్ పెడుతూ వచ్చే సన్నివేశాలు ఆడియన్స్ కి కిక్ ఇస్తాయి. జైలులో చిరంజీవి చెప్తే లాకర్ ఓపెన్ చేసే సన్నివేశం క్లైమాక్స్ లో చెల్లెలిని బ్రహ్మ కాపాడే సీక్వెన్స్ లాంటి కొన్ని బాగా వర్కౌట్ అయ్యాయి. నిజానికి ఒరిజినల్ సినిమాను మక్కీ కి మక్కీ దించకుండా కొన్ని మార్పులతో దర్శకుడు మోహన్ రాజా ఈ రీమేక్ ను బాగా హ్యాండిల్ చేసి దర్శకుడిగా మంచి మార్కులు అందుకున్నాడు. కాకపోతే క్లైమాక్స్ తర్వాత వచ్చే సాంగ్ అలాగే చిరు -సల్మాన్ ఖాన్ కలిసి పబ్ లో బ్లాస్ట్ చేసే సీన్ మైనస్ అనిపిస్తుంది. అవి ఇరువురి అభిమానులకు నచ్చే అవకాశం ఉంది కానీ సాధారణ ప్రేక్షకుడికి అది ఏదో వెలితిగా ఉంటుంది. ముఖ్యంగా తార్ మార్ తక్కర్ మార్ సాంగ్ ఫ్యాన్స్ కి విజువల్ ట్రీట్ ఇస్తుంది. కానీ ఆ సాంగ్ కి ప్రభుదేవా మాస్టర్ కోరియోగ్రఫీ ఆశించిన స్థాయిలో లేదు. చిరంజీవి నటన  ,స్వాగ్  , తమన్ నేపథ్య సంగీతం , మోహన్ రాజా టేకింగ్ , లక్ష్మి భూపాల్ రాసిన కొన్ని మాటలు , పొలిటికల్  సన్నివేశాలు , కాస్టింగ్ , యాక్షన్ ఎపిసోడ్స్ , ఇంటర్వెల్ బ్లాక్ , ప్రీ క్లైమాక్స్ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ కాగా సెకండాఫ్ స్లో నెరేషన్ , క్లైమాక్స్ ఎపిసోడ్ సినిమాకు మైనస్ అనిపించాయి. ఓవరాల్ గా పొలిటికల్ ఫ్యామిలీ డ్రామా కథతో వచ్చిన ‘గాడ్ ఫాదర్’ మెప్పిస్తాడు.

రేటింగ్ : 3 /5