Movie Review - బింబిసార

Friday,August 05,2022 - 02:05 by Z_CLU

నటీనటులు : కళ్యాణ్ రామ్, క్యాథరిన్, సంయుక్త మీనన్, వరీన్ హుస్సేన్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, శ్రీనివాస రెడ్డి తదితరులు
కెమెరా : ఛోటా కె.నాయుడు
ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు
మ్యూజిక్‌: చిరంత‌న్ భ‌ట్‌
నేప‌థ్య సంగీతం: ఎం.ఎం.కీర‌వాణి
సినిమాటోగ్ర‌ఫీ: ఛోటా కె.నాయుడు
ప్రొడ్యూస‌ర్‌: హ‌రికృష్ణ.కె
రచన – ద‌ర్శ‌క‌త్వం: వ‌శిష్ఠ్

థియేట్రికల్ రిలీజ్ కు సంబంధించి అన్నీ బ్యాడ్ సిగ్నల్సే. టికెట్లు తెగడం లేదు, ఆక్యుపెన్సీ లేదు, బ్రేక్-ఈవెన్ లేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల మధ్య థియేటర్లలోకి వచ్చింది బింబిసార. కల్యాణ్ రామ్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ గతిని మార్చిందా? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ

BIMBISARA Kalyan Ram

కథ

తెలుగులో టైమ్ ట్రావెల్ మూవీస్ అంటే ఎవరికైనా ఫస్ట్ ఆదిత్య-369 గుర్తొస్తుంది. ఆ తర్వాత గుర్తొచ్చే సినిమాగా బింబిసార నిలిచిపోతుంది. ఇదొక ప్రాపర్ టైమ్ ట్రావెల్ మూవీ. క్రీస్తుపూర్వం 500వ శతాబ్దంలో ఉన్న బింబిసారుడు అతిపెద్ద క్రూరుడు. రక్తదాహంతో ‘నేనే దేవుడ్ని’ అనే అహంతో ఉన్న బింబిసారుడి జీవితం ఓ శాపం కారణంగా పూర్తిగా మారిపోతుంది. క్రీస్తుపూర్వంలో తంతే, క్రీస్తుశకంలో ఈ కాలంలోకి వచ్చి పడతాడు. అప్పటి బింబిసారుడికి, ఈ కాలంతో సంబంధం ఏంటి? అతడు దాచిన అనంత గుప్తనిధి ఏమైంది? ఇంతకీ బింబిసారుడి శాపం ఏంటి అనేది మిగతా కథ.

నటీనటుల పనితీరు

కల్యాణ్ రామ్ వన్ మేన్ షో కనిపించింది. క్రూరుడైన బింబిసారుడిగా, మార్పు చెందిన బింబిగా రెండు వేరియేషన్స్ లో కల్యాణ్ రామ్ దుమ్ముదులిపాడు. మరీ ముఖ్యంగా అతడి విలనీ అదిరిపోయింది. ఫైట్స్ లో, సెంటిమెంట్ సీన్స్ లో కల్యాణ్ రామ్ డామినేషన్, అతడి సీనియారిటీ స్పష్టంగా కనిపించింది. యువరాణిగా క్యాథరీన్, పోలీస్ గా సంయుక్త మీనన్ తమ పాత్రలకు న్యాయం చేశారు. బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, వైవా హర్ష ఓకే. ఇక్కడ శ్రీనివాసరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. బింబిసార పక్కన ఉండే ఆ పాత్రలో శ్రీనివాసరెడ్డి మెప్పించాడు. చాన్నాళ్ల తర్వాత అతడికి మంచి క్యారెక్టర్, స్క్రీన్ స్పేస్ రెండూ దొరికాయి.

టెక్నీషియన్స్ పనితీరు

కీరవాణిని తీసుకోవాలనే మేకర్స్ నిర్ణయం ఈ సినిమా ఫలితాన్ని మార్చేసింది. సినిమాలో కల్యాణ్ రామ్ తర్వాత హీరో కీరవాణినే. అతడి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషిస్తుంది. చిరంతన్ భట్ అందించిన పాటల్లో కొన్ని బాగున్నాయి కానీ వాటి ప్లేస్ మెంట్ కుదరలేదు. ఛోటా సినిమాటోగ్రఫీ బాగుంది. ఈశ్వరుడే సాంగ్ సాహిత్యం బాగుంది. యాక్షన్ సన్నివేశాలు మెప్పిస్తాయి. దర్శకుడిగా వశిష్ఠ్, తొలి సినిమాతోనే మంచి మార్కులు అందుకున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. ఎడిటింగ్, ఆర్ట్ వర్క్ ఓకే.

Kalyan-Ram-Bimbisara-movie-first-look-zeecinemalu-11

జీ సినిమాలు సమీక్ష

యాక్షన్ సినిమాలు హిట్టవుతున్నాయి. బయోపిక్స్ కూడా క్లిక్ అవుతున్నాయి. రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్ టైనర్స్ ఎలాగూ ఆడుతున్నాయి. మరి ఫేడవుట్ అయిపోతున్న ఫాంటసీ కథల సంగతేంటి? ఈ కాలం ఓ ఫాంటసీ సబ్జెక్ట్ తో సినిమా వస్తే నడుస్తుందా? చాలామందికి ఇలాంటి అనుమానం కలగడం సహజం. కానీ కల్యాణ్ రామ్ కు మాత్రం అలాంటి డౌట్స్ రాలేదు. అందుకే మూడేళ్లుగా ఒకే కథను నమ్మాడు. కొత్త దర్శకుడిపై నమ్మకం పెట్టుకున్నాడు. ఫైనల్ గా మెప్పించాడు. అదే బింబిసార.

బింబిసారుడి పేరు పాపులర్ కావొచ్చు కానీ ఈ కథ మాత్రం పూర్తిగా ఫిక్షన్. చరిత్రకు, ఈ సినిమాకు సంబంధం లేదు. కానీ ఒకప్పటి చరిత్రకు, ఇప్పటి కాలాన్ని ముడివేసి రాసుకున్న ఈ కథ… ఎమోషన్స్ ను చక్కగా పండించింది. మన సంస్కృతి గొప్పదనాన్ని చాటింది. ఎట్ ది సేమ్ టైమ్ మాస్-యాక్షన్ ఎలిమెంట్స్ మిస్సవ్వకుండా అందించింది. అందుకే మాస్ జనాలతో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులకు కూడా ఈ సినిమా ఎక్కుతుంది.

ఫాంటసీ కథ కాబట్టి థియేటర్లలో చూసి ఎక్స్ పీరియన్స్ చేయాల్సిందే. అందుకే మెయిన్ పాయింట్స్ ను ఇక్కడ డిస్కస్ చేయడం లేదు. సినిమా స్టార్ట్ అవ్వడమే బింబిసార క్రూరమైన రూపంతో మొదలవుతుంది. టైటిల్ కార్డ్ అతడిపైనే పడుతుంది. ఫస్టాఫ్ లో ఎక్కువ భాగం బింబిసార ఎలివేషన్స్ కే కేటాయించారు. అతడు ఎంత క్రూరుడు అనే విషయాన్ని అద్భుతంగా ఎలివేట్ చేశారు. ఈ క్రమంలో వచ్చే కల్యాణ్ రామ్ పెర్ఫార్మెన్స్, గ్రాఫిక్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మెప్పిస్తాయి.

అలా అని ఫస్టాఫ్ ను పూర్తిగా బింబిసారుడికే పరిమితం చేయలేదు దర్శకుడు. చాలామంది ఈ సినిమాలో మొదటి భాగం ఈ కాలంలో, రెండో భాగం చరిత్రలో సాగుతుందని భావించి సినిమాకొస్తారు. సరిగ్గా ఇక్కడే బింబిసార సినిమా స్క్రీన్ ప్లేతో ఆకట్టుకుంటుంది. సినిమా స్టార్ట్ అయిన కొద్దిసేపటికే బింబిసార భూమిపైకొస్తాడు. ఇంటర్వెల్ కార్డ్ పడేసరికే సినిమాలో చాలా ట్విస్టులు వచ్చేస్తాయి. ఈ విషయంలో సెకెండాఫ్ కోసం కీలకమైన ఎపిసోడ్స్ దాచాలనే కక్కుర్తి దర్శకుడిలో కనిపించలేదు. మొత్తమ్మీద ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ తో ఇంటర్వెల్ బ్యాంగ్ వేస్తాడు దర్శకుడు.

ఫస్టాఫ్ లో ఓ ఐటెంసాంగ్ పెట్టి స్క్రీన్ ప్లేను చేజేతులా అడ్డుకున్న దర్శకుడు వశిష్ట, రెండోభాగంలో ఆ తప్పు చేయలేదు. సెకెండాఫ్ అంతా రోలర్ కోస్టర్ రైడ్ లా సాగిపోతుంది. ఎక్కడా గ్రిప్పింగ్ మిస్సవ్వదు. సెకెండాఫ్ బాగుంటే సినిమా హిట్ అనే సెంటిమెంట్ ను బింబిసార అందుకుంది. ఫస్టాఫ్ అంతా బింబిసారుడి అరాచకాలు.. సెకండాఫ్ ఆయనలో మార్పు.. ఈ రెండింటిని బాగా బ్యాలెన్స్ చేశాడు దర్శకుడు.

క్రీస్తుపూర్వం 500వ శతాబ్దానికి చెందిన రాజును, ఈ కాలానికి ఎలా లింక్ పెట్టారనే ఆసక్తి ప్రేక్షకుడికి కలిగించడంలో ఈ సినిమా సక్సెస్ అయింది. కొత్త డైరక్టర్ వశిష్ట ఈ విషయంలో చాలా వరకు సక్సెస్ అయ్యాడు. కాస్త కన్ఫ్యూజన్ ఉన్న ఈ కథను చాలా క్లియర్ గా రాసుకున్నాడు. అందమైన
చందమామ కథలా చెప్పాడు. పైగా ఇది ఫాంటసీ కథ కాబట్టి లాజిక్స్ వెతకాల్సిన పనిలేదు.

ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, భారీ సెట్స్ కూడా కనిపిస్తాయి. అయితే వాటికంటే కథనే ఎక్కువగా నమ్ముకున్నాడు దర్శకుడు. గ్రాఫిక్స్ కంటే ఎమోషన్ ఎలివేట్ అయితే ప్లస్ అవుతుందని నమ్మాడు. అతడి నమ్మకమే నిజమైంది. చాలా చిన్న కథను ఎమోషనల్ గా చెప్పి మెప్పించాడు. అక్కడక్కడ కైకాల సత్యనారాయణ నటించిన ఘటోత్కచుడు.. క్లైమాక్స్‌లో అంజి సినిమా గుర్తుకొచ్చినప్పటికీ.. తెచ్చిపెట్టినట్టు కాకుండా, కథలో మిక్స్ చేయడం బాగుంది. పైగా మాస్ కోరుకునే ఎలిమెంట్స్ కూడా పుష్కలంగా ఇవ్వడంతో బింబిసార మెరిశాడు.

బింబిసారుడిగా కళ్యాణ్ రామ్ తన పాత్రకు ప్రాణం పోశాడు. మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ లో కల్యాణ్ రామ్ ను చూస్తే ముచ్చటేస్తుంది. యాక్టింగ్, డైలాగ్ డెలివరీలో కల్యాణ్ రామ్ కెరీర్ బెస్ట్ గా నిలిచిపోతుంది బింబిసార. ఇక్కడ చెప్పుకోదగ్గ మరో ముఖ్యమైన అంశం ఏంటంటే.. హీరో కల్యాణ్ రామ్ లో మంచి విలన్ కూడా ఉన్నాడు. బింబిసారలో కొన్ని చోట్ల కల్యాణ్ రామ్ నిజంగానే భయపెడతాడు. ఇక్కడే సినిమా సక్సెస్ అయింది.

అయితే హీరో పాత్ర అంత బలంగా మిగతా పాత్రలేవీ కనిపించవు. మరీ ముఖ్యంగా హీరోయిన్లు ఇద్దరూ తేలిపోయారు. సంయుక్త మీనన్, క్యాథరీన్ లో ఎవరు ఫస్ట్ హీరోయిన్, ఎవరు సెకెండ్ హీరోయిన్ అనే చర్చ అనవసరం. ఎందుకంటే, ఇద్దరూ గెస్ట్ రోల్స్ చేశారు. ఇక అత్యంత కీలకమైన విలన్ పాత్రను కాస్త ఫేస్ వాల్యూ ఉన్న మంచి తెలుగు నటుడితో చేయించి ఉంటే బాగుండేది. ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఫస్టాఫ్ లో వచ్చే ఐటెంసాంగ్ స్క్రీన్ టైమ్ పెంచడానికి తప్ప దేనికీ పనికిరాదు. ఎలాగూ పాటల ప్రస్తావన వచ్చింది కాబట్టి, కాలభైరవ పాడిన ఈశ్వరుడే సాంగ్ టోటల్ సినిమాకు హైలెట్. తేనె పలుకుల సాంగ్ ప్లేస్ మెంట్ కూడా కరెక్ట్ గా లేదు.

కీరవాణి ఈ సినిమాకు మెయిన్ హీరో.. అతడి రీ రికార్డింగ్ మామూలుగా లేదు. చాలా సన్నివేశాల్ని కీరవాణి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బ్యాక్ బోన్ గా నిలిచింది. బీజీఎం తర్వాత ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం స్టంట్స్. సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ ను చక్కగా డిజైన్ చేశారు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగున్నాయి. బడ్జెట్ పరిమితుల వల్ల ఆర్ట్ వర్క్ లో క్వాలిటీ తగ్గినట్టు కనిపించింది. దర్శకుడిగా వశిష్ట, మొదటి సినిమాతోనే తనదైన ముద్ర వేశాడు. లాజిక్స్ లేని ఇలాంటి కథల్ని ఎలాగైనా చెప్పొచ్చు కానీ పెర్ ఫెక్ట్ స్క్రీన్ ప్లేతో ఇంట్రెస్టింగ్ గా చెప్పడం చాలా అవసరం. వశిష్ఠ ఇక్కడ సక్సెస్ అయ్యాడు. అయితే స్క్రీన్ ప్లే విషయంలో అతడు ఇంకా గట్టిగా ఫోకస్ చేయాల్సి ఉంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

ఓవరాల్ గా బింబిసార సినిమా ఈతరం ప్రేక్షకులకు ఓ కొత్త కథను పరిచయం చేసిందనడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. ఈమధ్య కాలంలో ఫాంటసీ కథలు రాలేదు కాబట్టి, ఇది కచ్చితంగా ఆడియన్స్ ను, మరీ ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకుల్ని ఆకర్షిస్తుంది.

రేటింగ్ 3/5