'ఎక్కడికి పోతావు చిన్నవాడా' రివ్యూ

Friday,November 18,2016 - 03:25 by Z_CLU

విడుదల : నవంబర్ 18

నటీనటులు : నిఖిల్, హెబ్బా పటేల్, నందిత శ్వేత

ఇతర నటీనటులు : తనికెళ్ళ భరణి, వెన్నెల కిషోర్, జోష్ రవి, తదితరులు

సంగీతం : శేఖర్ చంద్ర

సినిమాటోగ్రఫీ : సాయి శ్రీరామ్

ఎడిటర్ : ఛోటా కె ప్రసాద్

డైలాగ్స్ : అబ్బూరి రవి

నిర్మాణం : మేఘన ఆర్ట్స్

నిర్మాత : పి. వెంకటేశ్వరావు

రచన- దర్శకత్వం : వి.ఐ ఆనంద్

‘స్వామిరారా’,’కార్తికేయ’, ‘సూర్య వర్సెస్ సూర్య’ వంటి ప్రయోగాత్మక చిత్రాలతో కథానాయకుడిగా విజయాలు అందుకున్న నిఖిల్ నటించిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఈ శుక్రవారం థియేటర్స్ లోకి వచ్చింది. హెబ్బా పటేల్, నందిత శ్వేతా హీరోయిన్లుగా దర్శకుడు వి.ఐ. ఆనంద్ తెరకెక్కించిన ఈ చిత్రం ఎలా వుందో? చూద్దాం

cxdz9ztwgaaori0

కథ :-

ఒక అమ్మాయిని ప్రేమించి మోసపోయిన అర్జున్(నిఖిల్) తన స్నేహితుడి అన్నయ్య కు దెయ్యం వదిలించడానికి అనుకోకుండా ఆత్మలను వదిలించే కేరళ లోని మహిశాసుర మర్దిని గుడికి వెళ్లాల్సి వస్తుంది. అలా కిషోర్(వెన్నెల కిషోర్) తో కేరళ వెళ్లిన అర్జున్ కి అమల(హెబ్బా పటేల్) అనే అమ్మాయి పరిచయం అవుతుంది. అలా పరిచయమైన అమల తన యాటిట్యూడ్ తో అర్జున్ కు దగ్గరవుతుంది. ఇంతకీ అమల అక్కడికి ఎందుకొచ్చింది? అర్జున్ కి కావాలనే ఎందుకు దగ్గరైంది? అసలు అమల ఎవరు? కేరళ వెళ్లిన అర్జున్ హైదరాబాద్ తిరిగొచ్చాక అమల గురించి ఏం తెలుసుకున్నాడు? అనేది చిత్ర కధాంశం…

నటీనటుల పనితీరు :-

అర్జున్ పాత్రలో నిఖిల్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇప్పటికే స్వామిరారా, కార్తికేయ లాంటి సినిమాల్లో నటించిన అనుభవం నిఖిల్ కు ఇక్కడ బాగా పనికొచ్చింది. మరీ ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్ లో నటుడిగా మరింత బెటర్ ఔట్ పుట్ ను ఇవ్వగలిగాడు నిఖిల్. ఇక కథానాయికగా హెబ్బా మరోసారి గ్లామర్ రోల్ లో అలరించింది. మరో కథానాయిక నందిత శ్వేతా కూడా నటిగా ఫర్వాలేదనిపించుకుంది. వీళ్లందరికంటే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పాత్ర అవికా గౌర్ ది. స్పెషల్ రోల్ లో అవికా గోర్ తన యాక్టింగ్ తో ఆకట్టుకుంది. వెన్నెల కిషోర్, సత్య కామెడీ పాత్రలతో కొన్ని సన్నివేశాల్లో బాగా అలరించారు. తనికెళ్ళ భరణి, పృద్వి, ప్రవీణ్, అన్నపూర్ణ, రాజా రవీంద్ర, సుదర్శన్, చమ్మక్ చంద్ర, భద్రం తదితరులు తమ పాత్రలకు న్యాయం చేసారు.

టెక్నీషియన్స్ పనితీరు

ఈ చిత్రానికి పనిచేసిన టెక్నీషియన్స్ గురించి చెప్పాలంటే ముందుగా మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గురించి చెప్పాల్సిందే. సిచ్యుయేషన్స్ కు తగిన పాటలు అందించాడు. ముఖ్యంగా ‘వంద స్పీడు లో’,’ చిరునామ తన చిరునామా’,’నీతో ఉంటె చాలు’ పాటలు వినసొంపుగా వున్నాయి. అలాగే బ్యాగ్రౌండ్ స్కోర్ తో సినిమాకు ప్రాణం పోశాడు. ముఖ్యంగా కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ లో ఆర్.ఆర్ బాగుంది. సినిమాటోగ్రఫీ మరో ప్లస్ పాయింట్. కేరళ లొకేషన్స్ ను తన కెమెరాతో అందంగా చూపించాడు సాయి శ్రీరామ్. అబ్బూరి రవి మాటలు ఆకట్టుకున్నాయి. కొన్ని సీన్స్ లో ఎమోషనల్ డైలాగ్స్ , అలాగే పంచ్ డైలాగ్స్ అలరించాయి. చోటా కె. ప్రసాద్ ఎడిటింగ్ బాగుంది. ఇక దర్శకుడు వి.ఐ. ఆనంద్ర… అందర్నీ కో-ఆర్డినేట్ చేసుకుంటూ ప్రతి ఒక్కరి నుంచి ఔట్ స్టాండింగ్ ఔట్ పుట్ రాబట్టుకున్నాడు. తన డైన స్క్రీన్ ప్లే తో సినిమాను ముందుకు నడిపించాడు. మేఘన ఆర్ట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

cxdz9znw8aat5c4
జీ సినిమాలు సమీక్ష

విభిన్న కథలను ఎంచుకుంటూ కథానాయకుడిగా పలు విజయాలు అందుకున్న నిఖిల్ మరోసారి అలాంటి ఇంట్రెస్టింగ్ ప్లాట్ నే సెలక్ట్ చేసుకున్నాడు. అర్జున్ పాత్రతో హీరోగా మంచి మార్కులు కొట్టేశాడు. ఇక టైటిల్స్ నుంచి ఎండ్ కార్డు వరకూ దర్శకుడు వి.ఐ.ఆనంద్ చాలా జాగ్రత్త వహిస్తూ సినిమాను తెరకెక్కించాడు. మొదటిభాగంలో కామెడీతో కథను నడిపించి ఇంటర్వెల్ లో సరికొత్త ట్విస్ట్ ఇచ్చి సినిమాపై ఆసక్తి పెంచిన విధానం, స్క్రీన్ ప్లే బాగుంది. ఒక థ్రిల్లింగ్ ఎంటర్టైన్ మెంట్ కు సరిపడే కథను ఎంచుకోవడమే కాక దానికి ఉహించని ట్విస్టులు, కామెడీని యాడ్ చేసి..చక్కగా ప్రజెంట్ చేశాడు. కథానాయిక నందిత శ్వేత నిఖిల్ కు మధ్య వచ్చే సీన్స్, అవికా గోర్, నిఖిల్ మధ్య లవ్ సీన్స్, వెన్నెల కిషోర్, సత్య కామెడీ… కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, పాటలు, ఆర్.ఆర్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. ఓ ఆత్మకు సంబంధించిన కథతో థ్రిల్లర్, హారర్ సినిమాలు తెలుగులో చాలానే వచ్చినప్పటికీ… ఎక్కడికి పోతావ్ చిన్నవాడా మాత్రం బోర్ కొట్టించదు. ట్విస్టులు, కామెడీతో సినిమా చక్కగా సాగిపోతుంది.

 

రేటింగ్ : 3 .5 /5