జయమ్ము నిశ్చయమ్మురా రివ్యూ

Friday,November 25,2016 - 12:35 by Z_CLU

విడుదల : నవంబర్ 25, 2016

నటీనటులు : శ్రీనివాస్ రెడ్డి , పూర్ణ

ఇతర నటీనటులు : పోసాని, కృష్ణభగవాన్, జీవా, శ్రీవిష్ణు, రవి వర్మ, ప్రవీణ్, జోగి బ్రదర్స్, తాగుబోతు రమేష్ తదితరులు

సంగీతం : రవిచంద్ర

సినిమాటోగ్రఫీ : నగేష్ బెనెల్

ఎడిటర్ : వెంకట్

సమర్పణ : ఏ వి యస్ రాజు

నిర్మాతలు : సతీష్ కనుమూరి-శివరాజ్ కనుమూరి

కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం : శివరాజ్ కనుమూరి

“సమైక్యంగా నవ్వుకుందాం” అనే ట్యాగ్ లైన్ తో “దేశవాళి వినోదం” అనే సరికొత్త నినాదంతో శ్రీనివాస్ రెడ్డి-పూర్ణ జంటగా శివరాజ్ ఫిల్మ్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో శివరాజ్ కనుమూరి నిర్మించిన చిత్రం “జయమ్ము నిశ్చయమ్మురా” విడుదలకి ముందే త్రివిక్రమ్, కొరటాల శివ, సుకుమార్ వంటి ప్రముఖ స్టార్ దర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం…. థియేటర్లలోకి వచ్చిన తర్వాత ప్రేక్షకులను మెప్పించిందా…?

కథ :

కరీంనగర్ లో చేనేత కుటుంబంలో పుట్టిన సర్వమంగళం అలియాస్ సర్వేశ్ (శ్రీనివాస్ రెడ్డి) అనే అమాయకపు వ్యక్తి ఆత్మ విశ్వాసం లేకపోవడం వల్ల జాతకాలను నమ్ముతూ గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎదురు చూస్తాడు. అలా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న సర్వేశ్.. పితా(జీవ) అనే ఓ జ్యోతిష్కుడు చెప్పడం వల్ల తనకు ఉద్యోగం వచ్చిందని భావిస్తాడు. అలా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న సర్వేశ్ కు కాకినాడ జి.ఎహ్.ఎం.సి లో ఉద్యోగం వస్తుంది. ఈ క్రమంలో తనకు రాణి (పూర్ణ) అనే అమ్మాయి అదృష్టవంతురాలు అని భావించి తనను ప్రేమిస్తాడు. ఆత్మవిశ్వాసం లేని సర్వేశ్ చివరికి కాకినాడలో ప్రభుత్వ ఉద్యోగిగా తన జీవనాన్ని ఎలా కొనసాగించాడు? చివరికి తను ప్రేమించిన రాణి ను పెళ్లిచేసుకున్నాడా? లేదా? అనేది సినిమా కథాంశం.

నటీ నటుల పనితీరు :

ఆత్మవిశ్వాసం లేని అమాయకుడు సర్వేశ్ పాత్ర కు పూర్తి న్యాయం చేసాడు శ్రీనివాస్ రెడ్డి. కొన్ని సన్నివేశాల్లో తన నటనతో హైలైట్ గా నిలిచాడు. రాణి గా పూర్ణ తన పాత్రలో ఇమిడిపోయింది. పోసాని, కృష్ణభగవాన్ తమ కామెడీ తో అలరించారు. శ్రీనివాస్ రెడ్డి తల్లి పాత్రలో చేనేత కుటుంబీకురాలిగా డబ్బింగ్ జానకి ఆకట్టుకుంది. పితా పాత్రలో జీవ, తత్కాల్ పాత్రలో ప్రవీణ్, జోగి బ్రదర్స్, ప్రభాస్ శ్రీను, రవి వర్మ, కృష్ణుడు, రోలర్ రఘు, మీనా, తాగుబోతు రమేష్, హేమంత్ తదితరులు తమ పాత్రాలకు న్యాయం చేశారు.

టెక్నీషియన్స్ పనితీరు :

ఈ సినిమాకు పని చేసిన టెక్నీషియన్స్ గురించి చెప్పాలంటే ముందుగా మ్యూజిక్ డైరెక్టర్ రవిచంద్ర గురించి చెప్పాలి. ముఖ్యంగా ‘ఓ రంగుల చిలక’ పాట సినిమాకు హైలైట్ గా నిలిచింది. అలాగే ఆర్.ఆర్ సినిమాకు ప్రాణం పోసింది. కొన్ని సన్నివేశాలకు తన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో బలం చేకూర్చాడు రవిచంద్ర. నగేష్ బానెల్ సినిమాటోగ్రఫీ మరో ప్లస్. కాకినాడ, వైజాగ్ లొకేషన్స్ ను తన కెమెరాతో మరింత అందంగా చూపించాడు నగేష్. ఎడిటింగ్ కుదరలేదు. దర్శకుడు శివరాజ్, స్క్రీన్ ప్లే , డైలాగ్స్ బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ ఫర్వాలేదు.

జీ సినిమాలు సమీక్ష :

కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి కథానాయకుడిగా నటించిన మొదటి సినిమా ‘గీతాంజలి’ హారర్ కామెడీతో హిట్ అయింది. ఆ సినిమా తరువాత వెంటనే కథానాయకుడిగా తొందరపడకుండా కమెడియన్ గానే కొనసాగుతూ తనకు సూట్ అయ్యే ‘జయమ్ము నిశ్చయమ్ము రా’ కథ తో వినోదాత్మక సినిమాను ఎంచుకున్నందుకు శ్రీనివాసరెడ్డి ను అభినందించాల్సిందే. తన కామెడీ టైమింగ్ తో కమెడియన్ గా మంచి గుర్తింపు అందుకున్న శ్రీనివాసరెడ్డి ఈ సినిమాలో కేవలం హీరోగా మాత్రమే కనిపిస్తాడు. కొత్త దర్శకుడే అయినప్పటికీ…
తను అనుకున్న మలుపు-గెలుపు కాన్సెప్ట్ తో పూర్తి వినోదాత్మకంగా సినిమాను తెరకెక్కించి అలరించాడు దర్శకుడు శివరాజ్. ప్రతి మనిషి విజయం సాధించాడనికి ముఖ్యంగా కావాల్సింది ఆత్మవిశ్వాసం అనే పాయింట్ తో చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. పంతులుగా పోసాని కామెడీ. వాట్సాప్ చాటింగ్ కామెడీ, కృష్ణ భగవాన్ మంగళవారం కామెడీ తో పాటు క్లైమాక్స్ లో బ్రాహ్మణ యాసతో పండించిన కామెడీ సినిమాకు హైలైట్గా నిలిచాయి. అయితే అంతా బాగానే ఉన్నప్పటికీ సినిమా నిడివి మాత్రం మైనస్. స్టార్ హీరోల సినిమాలే రెండున్నర గంటలు దాటితే చూడట్లేదు జనాలు. ఇలాంటి టైమ్ లో శ్రీనివాసరెడ్డిని పెట్టి ఇంత పెద్ద సినిమా తీసి, దాన్ని కట్ చేయకపోవడం నిజంగా సాహసమే. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ లో కొన్ని అనవసర సన్నివేశాలు తొలగించి నిడివి తగ్గిస్తే ఇంకా బాగుండేది. . కాకపోతే… మేకర్స్ ముందే చెప్పినట్టు దేశవాళీ వినోదం కోసం ‘నిశ్చయమ్ము’ గా ఈ సినిమా  చూడొచ్చు.

 

రేటింగ్ :  3/5