'డోర' రివ్యూ

Friday,March 31,2017 - 05:22 by Z_CLU

రిలీజ్ డేట్ : 31 మార్చ్ 2017

నటీనటులు : నయనతార

కెమెరా: దినేష్ కృష్ణన్

సంగీతం: వివేక్ , మెర్విన్ సోలో మాన్

నిర్మాత: మల్కాపురం శివకుమార్

దర్శకత్వం : దాస్ రామస్వామి

మయూరి సినిమాతో ఫిమేల్ ఓరియంటెడ్ మూవీస్ కు నయా కేరాఫ్ గా మారింది నయనతార. ఈమె నుంచి ఓ సినిమా వస్తుందంటే అది కచ్చితంగా కొత్తగా ఉంటుంది. గ్యారెంటీగా ఎంటర్ టైన్ చేస్తుంది. డోర సినిమాపై అంచనాలు పెరగడానికి ఇదే మెయిన్ రీజన్. మరి ఈరోజు థియేటర్లలోకొచ్చిన డోర సినిమాతో నయన్ అంచనాల్ని అందుకుందా..?

కథ:

అమాయకురాలైన పారిజాతం(నయనతార) తన తండ్రి రామయ్య(తంబీ రామయ్య) తో కలిసి కాల్ టాక్సీ బిజినెస్ రన్ చేస్తుంటుంది. ఈ క్రమంలో పారిజాతం ఓ వింటేజ్ కార్ ను బిజినెస్ కోసం కొంటుంది. ఆ కారు వల్ల పారిజాతం జీవితంలో ఊహించని ఘటనలు వరుసగా జరుగుతుంటాయి. అసలు ఆ కారుకి పారిజాతానికి ఉన్న సంబంధం ఏంటి? చివరికి ఏమైంది..? ఇలాంటి కథలకు ఇంతకంటే ఎక్కువ రివీల్ చేస్తే సస్పెన్స్ ఉండదు. వెండితెర పై చూడాల్సిందే…

సాంకేతిక నిపుణులు పనితీరు :

ఇలాంటి సినిమాలకు సినిమాటోగ్రఫీనే కీలకం. ఈ విషయంలో డోర సినిమా ఫుల్ మార్కులు కొట్టేసింది.
దినేష్ కృష్ణన్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలకు కెమెరామెన్ గా తన బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చాడు దినేష్. సినిమాలో ఆర్ట్ వర్క్ బాగుంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కొన్ని సన్నివేశాలను బ్రహ్మాండంగా ఎలివేట్ చేసింది. ఇక ఇలాంటి సినిమాలకు అత్యంత కీలకమైన ఎడిటింగ్ కూడా డోరకు కలిసొచ్చింది. దర్శకుడు చెప్పాలనుకున్న అంశాన్ని తనదైన స్క్రీన్ ప్లే తో కన్ఫ్యూజన్ లేకుండా చక్కగా చెప్పాడు.

జీ సినిమాలు సమీక్ష :

డోర.. టైటిల్ తోనే ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేసిన సినిమా ఇది. అసలు డోర అంటే ఏంటో తెలుసుకుందామని చాలామంది ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లారు. అలా వెళ్లిన వాళ్లంతా ఈ సినిమా చూసి సంతృప్తి చెందుతారు. ఈ తరహా కథలు గతంలో అడపాదడపా వచ్చినప్పటికీ.. డోర మాత్రం గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, స్టన్నింగ్ విజువల్స్ తో ఎక్కడా పాత కథల్ని గుర్తుకురానీయదు. గతంలో పలు లేడీ ఓరియంటెడ్ సినిమాలతో తమిళ – తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న నయనతార… మరోసారి ‘డోర’ రూపంలో తన మేజిక్ చూపించింది. ఒకప్పుడు గ్లామర్ పాత్రలకు కేరాఫ్ గా నిలిచిన ఈ బ్యూటీ.. ఇప్పుడు తన యాక్టింగ్ టాలెంట్ చూపిస్తోంది. కొన్ని సన్నివేశాల్లో అమాయకంగా కనిపిస్తూనే మరోవైపు తనదైన ఎమోషనల్ యాక్టింగ్ తో సినిమాకు హైలైట్ గా నిలిచింది నయనతార. ఎంచుకున్న వైవిధ్యమైన పాయింట్ ను అంతే వైవిధ్యంగా తెరపై ఆవిష్కరించి దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు రామస్వామి. నయనతార క్యారెక్టర్, థ్రిల్లింగ్ సీన్స్, కెమెరావర్క్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు బలం చేకూర్చాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే, సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడే ప్రతి ఒక్కరు కచ్చితంగా చూడాల్సిన సినిమా డోర.