'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' రివ్యూ

Friday,June 21,2019 - 02:17 by Z_CLU

న‌టీన‌టులు: న‌వీన్ పొలిశెట్టి, శృతి శ‌ర్మ, త‌దిత‌రులు

సంగీతం : మార్క్ కె.రాబిన్‌

ఛాయాగ్రహణం: స‌న్నీ కూర‌పాటి

నిర్మాణం : స‌్వ‌ధ‌ర్మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌

నిర్మాత‌ : రాహుల్ యాద‌వ్ న‌క్కా

రచన దర్శకత్వం : స్వ‌రూప్ ఆర్‌.ఎస్‌.జె

విడుదల తేది : 21 జూన్ 2019

 

‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ గా థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు నవీన్ పొలిశెట్టి. ట్రైలర్ తో ఎట్రాక్ట్ చేసిన ఈ డిటెక్టివ్ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందా..? జీ సినిమాలు ఎక్స్
క్లూజీవ్ రివ్యూ


కథ :

నెల్లూరులో ఎఫ్‌బీఐ (ఫాతిమా బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌) పేరుతో ప్రైవేట్‌ డిటెక్టివ్‌ ఏజెన్సీ నడుపుతుంటాడు ఏజెంట్‌ సాయి శ్రీనివాస్ ఆత్రేయ (నవీన్‌ పొలిశెట్టి). పెద్దగా కేసులు లేక పోలీసులకు చిన్న చిన్న కేసుల్లో సాయం చేస్తుంటాడు. ఒక పెద్ద కేసు కోసం ఎదురుచూస్తున్న సమయంలో తన ఫ్రెండ్‌ క్రైమ్‌ రిపోర్టర్‌ శిరీష్‌ భారీగా దొరుకుతున్న అనాథ శవాల గురించి చెప్తాడు. తన టాలెంట్ ఏంటో రుజువుచేసుకోవాలని చూసే సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఆ కేసును టేకప్ చేయాలనుకుంటాడు. ఆ కేసును ఛాలెంజింగ్ గా తీసుకొని తన అసిస్టెంట్ స్నేహ(శృతి శ‌ర్మ) తో కలిసి ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు. ఆత్రేయ ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా ఆ మర్డర్ కేసులో ఆత్రేయనే అనుమానితుడిగా అరెస్ట్ చేస్తారు పోలీసులు.

జైల్‌లో ఉండగా తన కూతురిని ఘోరంగా మానభంగం చేసిన హత్య చేశారని మారుతీ రావు అనే వ్యక్తి ఆత్రేయకు చెపుతాడు. తన కూతురికి చనిపోయే ముందు ఫోన్‌ చేసిన ముగ్గురి ఫోన్‌ నంబర్లు ఇస్తాడు. బెయిల్‌పై రిలీజ్‌ అయిన ఆత్రేయ ఆ కేసు ఇన్వెస్టిగేషన్‌ ప్రారంభిస్తాడు. ఆ మూడు నంబర్లలో ఆత్రేయ కి ఓ ఇద్దరి డీటెయిల్స్‌ మాత్రమే దొరుకుతాయి. ఆ డిటైల్స్ తో వారిని ఫాలో అవుతాడు. అలా ఆత్రేయ ఇన్వెస్టిగేట్‌ చేస్తుండగానే ఆ ఇద్దరు వ్యక్తులు హత్యకు గురవుతారు. ఆ హత్య కేసుల్లో కూడా ఆత్రేయనే అనుమానించి ముద్దాయిగా భావిస్తారు పోలీసులు.

ఆ కేసులో మరోసారి ఆత్రేయను అరెస్ట్ చేస్తారు. అతి కష్టం మీద మళ్ళీ బెయిల్‌తో బయటకు వచ్చిన ఆత్రేయ ఈ కేసుల నుంచి ఎలా బయటపడ్డాడు? ఆ అసలు ఆ హత్యలు చేసింది ఎవరు..? వీటన్నిటినీ డిటెక్టివ్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఎలా ఛేదించాడన్నదే మిగతా కథ.

నటీ నటుల పనితీరు :

యూ ట్యూబ్ లో హిందీ వీడియోల ద్వారా పాపులర్ అయిన నవీన్ పోలిశెట్టి డిటెక్టివ్ క్యారెక్టర్ లో ఒదిగిపోయాడు. సినిమా ప్రారంభం నుండి చివరి వరకూ తన కామెడీ టైమింగ్ , ఎమోషన్ త సినిమాకు హైలైట్ గా నిలిచాడు. శృతి శ‌ర్మ హీరోయిన్ గా ఆకట్టుకుంది. డిటెక్టివ్ ఆత్రేయ అసిస్టెంట్ గా మంచి నటన కనబరిచింది.

కథను మలుపుతిప్పే పాత్రలో క్రిశ్నేశ్వరావు బాగా నటించాడు. వసుధ పాత్రలో శ్రద్దా రాజ్ గోపాల్ పరవాలేదు అనిపించుకుంది. ఆత్రేయకి సహాయం చేసే పోలిస్ పాత్రలో రామ్ దత్ , ఎస్.ఐ గా విశ్వనాధ్ , ఆత్రేయ స్నేహితుడిగా ప్రశాంత్ అలాగే సందీప్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసారు. సుహాస్ కామెడీ టైమింగ్ తో ఎంటర్టైన్ చేసాడు. మిగతా నటీ నటులంతా పరవాలేదనిపించుకున్నారు.

 

సాంకేతిక వర్గం పనితీరు :

మార్క్ కె.రాబిన్‌ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. షెర్లాక్ హోమ్స్ పాట పరవాలేదు. స‌న్నీ కూర‌పాటి కెమెరా వర్క్ ప్లస్ అయ్యింది. ఎడిటింగ్ లో ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేసుంటే బాగుండేది. ఆర్ట్ వర్క్ బాగుంది. కొన్ని సన్నివేశాలకు సౌండింగ్ బాగా కుదిరింది. స్వరూప్ కథ-కథనం
ఆకట్టుకున్నాయి. స‌్వ‌ధ‌ర్మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ ప్రొడక్షన్ వాల్యూస్ కథకు తగ్గట్టుగా ఉన్నాయి.


జీ సినిమాలు సమీక్ష :

తెలుగులో డిటెక్టివ్ సినిమా వచ్చి చాలా కాలమైంది. ఈ సినిమా మీద హైప్ రావడానికి అదే ముఖ్య కారణం. ఆ హైప్ తో విడుదలైన ఈ సినిమా ఆసక్తికరమైన కథ- కథనంతో ఆకట్టుకుంటుంది. సినిమాలో ఉన్న స్ట్రాంగ్ పాయింట్ రివిల్ చేయకుండా ట్రైలర్ తో ఎట్రాక్ట్ చేసిన దర్శకుడు సినిమా కథాంశంతో మెస్మరైజ్ చేసాడు. సినిమాను కామెడీగా స్టార్ట్ చేసి తర్వాత కాస్త ఆసక్తికరంగా నడిపించి చివరికి మెప్పించాడు దర్శకుడు.

తను చెప్పాలనుకున్న పాయింట్ కి ఎంటర్టైన్ మెంట్ యాడ్ చేసి డిటెక్టివ్ సినిమాగా మలిచిన తీరు ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుంది. ఆ విషయంలో దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు స్వరూప్. తొలి సినిమాకే మంచి మంచి కథ, ఆసక్తికరమైన కథనం రాసుకున్నాడు. మొదటి భాగంలో ఓ మర్డర్ మిస్టరీ ని హైలైట్ చేస్తూ కథను ముందుకు నడిపించిన దర్శకుడు క్లైమాక్స్ కి వచ్చే సరికి ఎవరూ ఊహించని విధంగా సినిమాను ముగించాడు.

శవాలను మాయం చేసి వాటితో వ్యాపారం చేసే ఓ ముఠా, ఆ ముఠాను పట్టుకోవడం కోసం హీరో చేసే ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు ప్రేక్షకుడిని థ్రిల్ చేస్తాయి. ఇక కథకి పర్ఫెక్ట్ అనిపించే హీరోని ఎంచుకొని ఆత్రేయ క్యారెక్టర్ తో ఎంటర్టైన్ చేసాడు స్వరూప్. కాకపోతే రెండో భాగంలో హీరో క్యారెక్టర్ తో పాటు క్రైంని కూడా హైలైట్ చేసే విషయంలో తడబడ్డాడని అనిపిస్తుంది. అందువల్లే సినిమా కాస్త డ్రాగ్ అనిపిస్తూ కొన్ని సన్నివేశాలు అనవసరం అనిపిస్తాయి. సినిమాలో నెగిటీవ్ క్యారెక్టర్స్ ని ఎస్టాబిలిష్ చేయడంలో కూడా విఫలమయ్యాడు స్వరూప్. క్లైమాక్స్ కూడా ఊహించిన రీతిలో లేదు. ఏదో సదా సీదాగానే ముగించిన ఫీలింగ్ కలుగుతుంది. రెండో భాగంలో వచ్చే క్రైం సన్నివేశాలు మాత్రం బాగా ఆకట్టుకుంటాయి. ఆ సీక్వెన్సెస్ సినిమాకే హైలైట్. ఆ సన్నివేశాలకు నేపథ్య సంగీతం , సౌండింగ్ బాగా కుదిరాయి.

నవీన్ పొలిశెట్టి నటన , కథ -కథానం , నేపథ్య సంగీతం , రెండో భాగంలో వచ్చే క్రైం సన్నివేశాలు , కామెడీ , ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్స్ సినిమాకు హైలైట్స్ కాగా ఎడిటింగ్ , రెండో భాగంలో సాగదీసినట్టుగా అనిపించే సన్నివేశాలు, క్లైమాక్స్ సినిమాకు మైనస్.

ఓవరాల్ ఆల్ గా డిటెక్టివ్ సినిమాగా వచ్చిన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఊహించని కథనంతో ఆకట్టుకుంటుంది.

రేటింగ్ : 3 /5