ఫస్ట్ ర్యాంక్ రాజు మూవీ రివ్యూ

Friday,June 21,2019 - 02:38 by Z_CLU

నటీనటులు: చేత‌న్‌ మ‌ద్దినేని, కాశిష్‌ వోరా, వి.కె.న‌రేష్, ప్ర‌కాష్‌రాజ్‌, బ్ర‌హ్మానంద‌ం‌, రావుర‌మేష్‌, పోసానికృష్ణ‌ముర‌ళి, త‌నికెళ్ళ‌భ‌ర‌ణి, వెన్నెల కిషోర్‌, ప్ర‌య‌ద‌ర్శి తదితరులు
డైలాగ్స్ః అయ్యాన్ శ్ర‌వ‌న్‌
లిరిక్స్ః వ‌న‌మాలి
ఆర్ట్ః స‌త్య‌సాయి
మ్యూజిక్ః కిర‌ణ్‌ ర‌వీంద్ర‌నాధ్
ప్రొడ్యూస‌ర్ః మంజునాధ్ వి కందుకూర్
డైరెక్ట‌ర్ః న‌రేష్‌ కుమార్‌
సెన్సార్ : U/A
నిడివి : 2 గంటల 8 నిమిషాలు
రిలీజ్ డేట్ : జూన్ 21, 2019

ఫస్ట్ ర్యాంక్ రాజు.. టైటిల్ లోనే హీరో క్యారెక్టర్ కనిపిస్తోంది. కానీ అసలు కథ వేరే ఉంది. ఇప్పుడున్న విద్యా వ్యవస్థపై సెటైరిక్ గా తీసిన సినిమా ఇది. కన్నడ సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ మూవీ ఇంతకీ తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుందా? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ


కథ

క్లాస్ లో ఎప్పుడూ ఫస్ట్ ఉంటాడు రాజు. ఏ క్లాస్ కెళ్లినా అక్కడ ఫస్ట్. అందుకే అతడ్ని అంతా ఫస్ట్ ర్యాంక్ రాజు అంటారు. కేవలం పుస్తకాలే అతడి లోకం. అలా ఫస్ట్ ర్యాంక్ తో పాసై ఉద్యోగ ప్రయత్నం చేసిన రాజుకు ఎక్కడా ఉద్యోగం దొరకదు. చివరికి ఆత్మహత్యకు కూడా ప్రయత్నిస్తాడు రాజు. దీనికి కారణం అతడికి లోకజ్ఞానం లేకపోవడమే.

ఎలాగైనా రాజును సమాజంలో కలపాలని ప్రయత్నిస్తుంటారు వాళ్ల తల్లిదండ్రులు. ఈ క్రమంలో రాజు తల్లిదండ్రులు ఏం చేశారు? వాళ్లు రాజును మార్చగలిగారా? ఫస్ట్ ర్యాంక్ రాజు సొసైటీలో కూడా ఫస్ట్ ర్యాంక్ తో నిలబడగలిగాడా అనేది ఈ సినిమా స్టోరీ.

నటీనటుల పనితీరు

హీరో చేతన్ నటించడానికి చాలా కష్టపడ్డాడు. ఉన్నంతలో ఓకే అనిపించాడు. ఫస్ట్ ర్యాంక్ రాజుగా, రోమియోగా మెప్పించే ప్రయత్నం చేశాడు. కానీ కన్నడ వెర్షన్ తో పోల్చి చూసుకుంటే చేతన్ యాక్టింగ్ తేలిపోతుంది. హీరోయిన్ కశిష్ ఓరా గ్లామరస్ గా ఉంది తప్ప పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. హీరోహీరోయిన్లు తప్ప సినిమాలో మిగతావాళ్లంతా బాగా నటించారు.

హీరో తండ్రిగా నరేష్, ఫ్రెండ్ గా ప్రియదర్శితో పాటు ప్రకాష్ రాజ్, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, పోసాని, వెన్నెల కిషోర్.. ఇలా చాలామంది ఆర్టిస్టులున్నారు ఈ సినిమాలో. పేరున్న నటీనటులంతా ఉన్నప్పటికీ వాళ్లకు దొరికిన స్కోప్ మాత్రం చాలా తక్కువ. మరీ ముఖ్యంగా బ్రహ్మానందం లాంటి సీనియర్ కమెడియన్ ను సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారు.

టెక్నీషియన్స్ పనితీరు

ఈ సినిమాకు టెక్నీషియన్స్ నుంచి పెద్దగా సపోర్ట్ అందలేదు. ఒరిజినల్ వెర్షన్ కు పనిచేసిన కిరణ్ రవీంద్రనాధ్ ఈ సినిమాకు కూడా మ్యూజిక్ ఇచ్చాడు. ఇతడిచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఒక్క పాట మాత్రం ఆకట్టుకుంటుంది. డైలాగ్స్ ఇంకాస్త బెటర్ గా ఉంటే బాగుండేది.

దర్శకుడు నరేష్ కుమార్ ఈ రీమేక్ కు పెద్దగా మార్పులు చేయడానికి ఇష్టపడలేదు. అది కొన్ని చోట్ల ప్లస్ అయింది, మరికొన్ని చోట్ల మైనస్ అయింది. ప్రకాష్ రాజ్, నరేష్ లాంటి సీనియర్ల వల్ల ఎమోషన్ యాంగిల్ లో చేసిన చిన్నచిన్న మార్పులు పండాయి. నిర్మాతలు మాత్రం ఖర్చుకు వెనకాడకుండా సినిమా నిర్మించారు. వాళ్ల ప్రొడక్షన్ వాల్యూస్ సినిమా మొత్తం ఆకట్టుకుంటాయి.


జీ సినిమాలు రివ్యూ

చాలా రీమేక్స్ కు జరిగినట్టుగానే ఫస్ట్ ర్యాంక్ రాజు రీమేక్ కు కూడా జరిగింది. కన్నడలో ఈ సినిమా హిట్. తెలుగులో సేమ్ టైటిల్ తో రిలీజ్ చేసి ఇక్కడ కూడా హిట్ కొడదామనకున్నారు. కానీ ఆ ప్రయత్నంలో సగమే సక్సెస్ అయ్యారు. ఎందుకంటే ఒరిజినల్ లో ఉన్న ఎమోషన్, ఫన్ తెలుగు వెర్షన్ లో మిస్ అయింది.

ఫస్ట్ ర్యాంక్ రాజులో చాలా ఫన్ ఉంది. కానీ అలాంటి కామెడీని ఎంజాయ్ చేసే స్థాయిని ఎప్పుడో తెలుగు ప్రేక్షకుడు దాటేశాడు. ఈ విషయంలో మేకర్స్ కాస్త క్రియేటివ్ గా ఆలోచించాల్సింది. రీమేక్ ను ఎందుకు కెలకడం అనుకున్నారేమో, కామెడీని కూడా నాలుగేళ్ల కిందటి ఒరిజినల్ నుంచే తీసుకున్నారు. ఈ విషయంలో దర్శకుడు నరేష్ కుమార్ కాస్త అప్ డేట్ అయితే బాగుండేది. అక్కడక్కడ నవ్వు తెప్పించినా, తెలుగు ఆడియన్స్ కు మాత్రం ఈ కామెడీ కిక్ ఇవ్వదు.

చిక్కంతా ఎక్కడొచ్చిందంటే కామెడీలో చేయాల్సిన మార్పుల్ని ఎమోషన్ లో చేయడం. రావురమేష్, సీనియర్ నరేష్, ప్రకాష్ రాజ్ లాంటి ఆర్టిస్టులు ఉన్నారని.. ఈ యాంగిల్ లో ఎక్కువ మార్పుచేర్పులు చేసినట్టున్నారు. ఫలితంగా కామెడీ పండిస్తాడనుకున్న రాజు, సెకండాఫ్ లో చాలా సీరియస్ అయిపోతాడు. అలా అని ఇది సినిమాకు ఏమైనా కలిసొస్తుందా అదే అది కూడా డౌటే.

పుస్తకాల పురుగు పాత్రలో చేతన్ బాగానే చేశాడు. కానీ అతడి యాక్టింగ్ లో లోపాలు కనిపిస్తూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా రొమాంటిక్ యాంగిల్ లో చేతన్ ఇంకాస్త బెటర్ గా చేయాల్సింది. ఇక హీరో ముద్దపప్పు అని తెలిసినా అతడి కోసం హీరోయిన్ చేస్తున్న ప్రయత్నాలు క్లిక్ అవ్వలేదు. మేకర్స్ ఫన్ అనుకున్నారు, ఆడియన్స్ ఇబ్బందిపడ్డారు.

ఒక్కోసారి రీమేక్ కు ఎలాంటి మార్పులు చేయకూడదని భావించినా కూడా తప్పే అవుతుందని ఫస్ట్ ర్యాంక్ రాజు నిరూపించింది. కన్నడ ప్రేక్షకులకు ఇది నచ్చింది కానీ తెలుగు ప్రేక్షకులు ఇలాంటి క్యారెక్టరైజేషన్లు చాలా చూశారు. అయితే ఎంటర్ టైన్ మెంట్ ను మిక్స్ చేస్తూ ఎడ్యుకేషన్ సిస్టమ్ పై ఇచ్చిన సందేశం విషయంలో మాత్రం ఫస్ట్ ర్యాంక్ రాజు పాసయ్యాడు. కన్నడ వెర్షన్ లో ఎలాగైతే స్మూత్ గా సందేశాన్ని అందించారో.. ఆ ఫీల్ ను తెలుగు వెర్షన్ లో కూడా తీసుకురాగలిగారు. చదువంటే కేవలం పుస్తకాలు కాదు, లోకజ్ఞానం కూడా అవసరమే అనే విషయాన్ని రాజు అనే పాత్ర ద్వారా అంతర్లీనంగా చెప్పారు.

ఓవరాల్ గా ఫస్ట్ ర్యాంక్ రాజు ఈ వీకెండ్ ఓ మోస్తరుగా మాత్రమే నవ్విస్తాడు

రేటింగ్2/5