'మల్లేశం' మూవీ రివ్యూ

Friday,June 21,2019 - 11:00 by Z_CLU

న‌టీన‌టులు : ప్రియ‌ద‌ర్శి,ఝాన్సీ,అనన్య‌,ఆనంద్ చ‌క్ర‌పాణి,తాగుబోతు ర‌మేష్ త‌దిత‌రులు

సంగీతం : మార్క్ కె.రాబిన్‌

ఛాయాగ్రహణం : బాలు శాండిల్య‌స‌

మాటలు : పెద్దింటి అశోక్ కుమార్‌

నిర్మాత‌లు : రాజ్‌.ఆర్‌, శ్రీఅధికారి

రచన – ద‌ర్శ‌క‌త్వం : రాజ్‌రాచకొండ

విడుదల : 21 జూన్ 2019

 

ప్రియదర్శి హీరోగా ‘చింతకింది మల్లేశం’ కథతో తెరకెక్కిన ‘మల్లేశం’ ఈ రోజే విడుదలైంది. రిలీజ్ కి ముందే పాజిటీవ్ టాక్ సొంతం చేసుకున్న ఈ బయోపిక్ అందరినీ మెప్పించిందా… జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ .


కథ :

చేనేత పేద కుటుంబంలో పుట్టిన మల్లేశం(ప్రియదర్శి) చిన్నతనం నుండే నేత కార్మికుల కష్టాలు చూస్తూ పెరుగుతాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో ఆరవ తరగతితో చదువు ఆపేస్తాడు. అలా స్కూల్ మానేసిన మల్లేశం తన తండ్రి చెప్పడంతో మగ్గం ఎక్కుతాడు. ఈ క్రమంలో తన తల్లి(ఝాన్సీ) ఆసు( మగ్గం నేసేముందు చేసే ప్రక్రియ) పోసేటప్పుడు పడే కష్టాన్ని గమనిస్తాడు. తన తల్లి శ్రమ పడకుండా ఆసు పోసేలా ఓ యంత్రం కనిపెట్టాలని అనుకుంటాడు.

ఆసు యంత్రం తయారు చేసే క్రమంలో మల్లేశం ఊర్లో అప్పులపాలవుతాడు. అదే సమయంలో మావయ్య కూతురు పద్మ(అనన్య) ని పెళ్ళిచేసుకుంటాడు. పెళ్లి తర్వాత కొన్ని కారణాల వాళ్ళ ఊరుని విడిచి పద్మతో కలిసి పట్నం బయలుదేరతాడు. పట్నంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాక ఒక సహాయంతో అబ్దుల్ అనే వ్యక్తిని కలుస్తాడు. అతని దగ్గరున్న పనిముట్లతో చివరికి ఆసు యంత్రాన్ని తయారుచేస్తాడు. అలా ఓ సాధారణ చేనేత కార్మికుడు సాధించిన విజయమే మల్లేశం కథ.

 

నటీ నటుల పనితీరు :

ప్రియదర్శి నటన బాగుంది. వెండితెరపై ‘మల్లేశం’గా మెప్పించాడు. ఈ సినిమాతో ఎలాంటి ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఇచ్చినా చేయగలడని రుజువుచేసుకున్నాడు. కొన్ని సందర్భాల్లో వచ్చే ఎమోషనల్ సీన్స్ లో మంచి నటన కనబరిచాడు. మొదటి సినిమా అయినప్పటికీ అనన్య.. పద్మ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ అనిపించుకుంది. కొన్ని సందర్భాల్లో ప్రియదర్శి ని డామినేట్ చేసింది కూడా. మల్లేశం తల్లిగా ఝాన్సీ ఒదిగిపోయింది. ఆసు పోసే సన్నివేశాల్లో ఆమె నటన అందరినీ ఆకట్టుకుంటుంది. ఆనంద్ చక్రపాణి నటనతో సినిమాకు ప్లస్ అయ్యాడు.

చిన్నప్పటి మల్లేశంగా శివ నందు బాగా నటించాడు. గంగవ్వ , తాగుబోతు రమేష్ డైలాగ్ కామెడీ బాగుంది. మల్లేశం స్నేహితులుగా చేసిన నటులతో పాటు మిగతా నటీ నటులంతా వారి పరిధిలో నటించి ఆకట్టుకున్నారు.

సాంకేతికవర్గం పనితీరు :

మల్లేశం సినిమాకు సాంకేతికపరంగా అన్నీ చక్కగా కుదిరాయి. బాలు శాండిల్య‌స‌ ఛాయాగ్రహణం బాగుంది. తెలంగాణా పల్లె వాతావరణాన్ని తన కెమెరా పనితనంతో బాగా చూపించాడు. మార్క్ కె.రాబిన్‌ అందించిన సంగీతం బాగుంది. ‘ధనా ధనా’ , ‘నాకు నువ్వని’ పాటలు పిక్చరైజేషన్ పరంగానూ ఆకట్టుకున్నాయి. నేపథ్య సంగీతం కొన్ని సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. గోరటి వెంకన్న‌, చంద్ర‌బోస్‌, దాశ‌ర‌థి అందించిన సాహిత్యం పాటలకు ప్రాణం పోసింది.  రాఘ‌వేంద్ర‌ సినిమాను పర్ఫెక్ట్ గా ఎడిట్ చేసాడు. సింక్ సౌండ్ చక్కగా కుదిరింది.

అశోక్ పెద్దింటి రాసిన మాటలు సినిమాకు అందం తీసుకొచ్చాయి. తెలంగాణా పదాలతో ఆయన రాసిన సంభాషణలు సినిమాకు హైలైట్ గా నిలిచాయి. లక్ష్మణ్ ఏలే ప్రొడక్షన్ డిజైన్ , పెయింటింగ్స్ బాగున్నాయి. దర్శకుడు రాజ్ రాచకొండ రాసుకున్న కథ -కథనం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ప్రొడక్షన్స్ వాల్యూస్ కథకు తగ్గట్టుగా ఉన్నాయి.

జీ సినిమాలు సమీక్ష :

ప్రస్తుతం బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. కొన్ని బయోపిక్స్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తే కొన్ని మాత్రం నిరాశపరుస్తున్నాయి. ‘మల్లేశం’ మొదటి కోవలోకొచ్చే సినిమా. ఎటువంటి అనుభవం లేకపోయినా ఓ చేనేత కార్మికుడు సాధించిన విజయాన్ని వెండితెరపై స్పూర్తినిచ్చేలా ఆవిష్కరించడంలో దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు రాజ్ రాచకొండ. అమెరికాలో చేస్తున్న ఉద్యోగం వదిలి మరీ ఈ సినిమాను తెరకెక్కించడం సినిమా పట్ల అతనికున్న ప్రేమను తెలియజేస్తుంది. మల్లేశం లాంటి వ్యక్తి జీవితాన్ని సినిమాగా మలచడం గొప్ప విషయం. ఇందుకు దర్శక-నిర్మాత రాజ్ ని ఎన్నిసార్లు మెచ్చుకున్నా తప్పులేదు. తనలో ఉన్న తపన బయటపెట్టి, పెట్టిన రూపాయికి అర్థ రూపాయి అయినా వస్తుందా..? అని ఆలోచించకుండా ఈ ప్రయత్నం చేసినందుకు రాజ్ ను కచ్చితంగా అభినందించాలి.

ఏ బయోపిక్ అయినా… కథలో దమ్ముండాలి, బయోపిక్ తాలూకు వ్యక్తి ఎవరూ సాధించలేనిదేదో చేసుండాలి. మల్లేశం అలాంటి వ్యక్తే. చేనేత పేద కుటుంబంలో పుట్టి తన ఆలోచనతో ఎవరూ చేయలేని ఆసు యంత్రాన్ని తయారుచేసి అందరిచే శెభాష్ అనిపించుకున్నారు. ప్రధాన మంత్రి మోడీ చేతుల మీదుగా అమేజింగ్ ఇండియన్స్ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత పద్మశ్రీ కూడా ఆయనను వరించింది. ఇంటర్నేషనల్ ఫోర్బ్స్ మ్యాగ్జీన్లో రూరల్ ఇన్నోవేటీవ్ గా ఆయన పేరు కూడా నమోదు అయ్యింది. ఇలా ఎన్నో ప్రశంసలు అందుకున్నారు మల్లేశం.

ఇక సినిమా విషయానికొస్తే చేనేత కుటుంబం ఆత్మ హత్యతో సినిమాను ఎమోషనల్ గా ప్రారంభించిన దర్శకుడు ఆ తర్వాత మల్లేశం బాల్యం , చిన్నతనం నుండి అతను పడిన కష్టాలు, తన తల్లి ఆసు పోసే క్రమంలో పడే బాధను చూడలేక ఆమె కోసం ఏదొకటి చేయాలని అతను పడిన తపన…. వీటన్నిటితో మొదటి భాగాన్ని ఆకట్టుకునేలా నడిపించాడు. మొదటి భాగంలో కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉన్నప్పటికీ చైల్డ్ ఎపిసోడ్స్, కామెడీ  హైలైట్ అయ్యాయి. మొదటి పదిహేను నిమిషాలు ప్రేక్షకుడు తన బాల్యం గుర్తుచేసుకొని గొప్ప అనుభూతి పొందుతాడు. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు చూసి స్ఫూర్తి పొందుతాడు. ఇక  పాత్రలకు న్యాయం చేసే నటీ నటులను ఎంచుకోవడంలో కూడా రాజ్ సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా ప్రియదర్శి ని మల్లెశంగా ఊహించడం మామూలు విషయం కాదు. సినిమా మరీ సీరియస్ గా వెళ్తున్న సందర్భంలో హాస్యాన్ని జోడించి నవ్వించాడు రాజ్. ముఖ్యంగా గంగవ్వ , తాగుబోతు రమేష్ లను కరెక్టు టైమింగ్ లో వాడుకున్నాడు.

మల్లేశం పెద్దయ్యాక అతని ఆలోచనా విధానం , తన తల్లి కోసం అలాగే ఆసు పోసే ప్రతీ ఒక్కరి కోసం ఆసు యంత్రం కనిపెట్టాలనుకోవడం లాంటి విషయాలను సన్నివేశాల పరంగా బాగా రాసుకున్నాడు. కాకపోతే మల్లేశం కొన్ని సందర్భాల్లో ఆర్ట్ ఫిలింని తలపిస్తుంది. ముఖ్యంగా కథనం నెమ్మదిగా సాగడం సినిమాకు మైనస్. క్లైమాక్స్ కూడా ప్రేక్షకుడు ఊహించేలా కాకుండా రియలిస్టిక్ గా తెరకెక్కించారు. క్లైమాక్స్ ను సినిమాటిక్ గా ప్లాన్ చేసి ప్రేక్షకులను మెప్పించేలా రాసుకొనుంటే ఇంకా బాగుండేది. చివర్లో మల్లేశం గారి టెడెక్స్ టాక్ వీడియో వేయడం కొంత వరకూ ప్లస్ అయ్యింది. ఆ వీడియో చూసాక ప్రేక్షకులు మంచి అనుభూతికి లోనవుతారు.

ఏదేమైనా తను చెప్పాలనుకున్న ‘మల్లేశం’ కథను చాలా నిజాయితిగా కమర్షియల్ అంశాల జోలికి వెళ్ళకుండా చూపించాడు రాజ్ రాచకొండ. తెలుగులో ఆదర్శంగా నిలిచే సినిమాల్లో మల్లేశం మంచి స్థానంలో ఉంటుంది. ‘మల్లేశం’ సాధించిన విజయాన్ని థియేటర్స్ లో చూసి అనుభూతి చెందాల్సిందే. సినిమా కమర్షియల్ గా ఎంత విజయం సాధిస్తుందనేది పక్కన పెడితే ఇలాంటి సినిమాలను ప్రోత్సహించాల్సిన భాద్యత మాత్రం మనపై ఉంది.

బాటమ్ లైన్ : స్పూర్తినిచ్చే ‘మల్లేశం

రేటింగ్ : 3 / 5