అప్పటి వరకూ నటిస్తూనే ఉంటానేమో -వెంకటేష్

Monday,July 25,2016 - 12:55 by Z_CLU

తన కెరీర్ కు సంబంధించి విక్టరీ వెంకటేష్ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. మరో 10-15 ఏళ్ల వరకు నటిస్తూనే ఉంటానని ప్రకటించారు. తన కొడుకు అర్జున్ హీరోగా మారేంతవరకు నటిస్తూనే ఉంటానేమో అంటూ మనసులో మాట బయటపెట్టారు. బాబు బంగారం ఆడియో వేడుకలో పలు అంశాలపై తన మనసులో మాట బయటపెట్టారు వెంకీ. నిజానికి ప్రసంగాన్ని తయారుచేసుకొని వేదికపైకి రావడం తనకు ఇష్టం ఉందని… అందుకే నటుడిగా 30ఏళ్లు పూర్తిచేసుకుంటున్న ఈ తరుణంలో కూడా ఎలాంటి ప్రసంగ పాఠం లేకుండానే అభిమానుల ముందుకొచ్చానని చెప్పుకొచ్చారు. మారుతి తెరకెక్కించిన బాబు బంగారం సినిమా చూస్తుంటే… మరో పదేళ్లు నటించడానికి సరిపడా ఉత్సాహం వచ్చేసిందని వెంకీ చెప్పుకొచ్చారు. 30ఏళ్ల కెరీర్ లో తను సాధించింది చాలా తక్కువని, ఇంకా సాధించాల్సింది చాలా ఉందని వెంకీ చెప్పుకొచ్చారు. మారుతి దర్శకత్వంలో వెంకటేశ్-నయనతార హీరోహీరోయిన్లుగా నటించిన బాబు బంగారం సినిమా వచ్చేనెల 12న విడుదల కాబోతోంది. ఈ సినిమా ఆడియోను దర్శకరత్న దాసరి నారాయణరావు విడుదల చేశారు.