మాకో మంచి అవకాశం

Monday,April 01,2019 - 01:14 by Z_CLU

రామ్ గోపాల్ వర్మ -అగస్త్య మంజు డైరెక్షన్ లో తెరకెక్కిన ‘లక్ష్మీస్ NTR’ సినిమా ఇటివలే రిలీజై సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా సినిమాలో ఎన్టీఆర్ పాత్ర పోషించిన విజయ్ కుమార్ , సీ.బి.ఎన్ పాత్ర చేసిన శ్రీ తేజ్ , లక్ష్మీ పార్వతి పాత్రలో నటించిన యజ్ఞా శెట్టి మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు వారి మాటల్లోనే…

అనుకోని ఆఫర్ – విజయ్ కుమార్ 

నేనో రంగస్థల నటుడ్ని , మాది ఏలూరు. ఎన్నో నాటకాలు వేసిన అనుభవంతో హైదరాబాద్ వచ్చి సినిమా అవకాశాల కోసం ప్రయత్నించాను. ఏవో చిన్న చిన్న పాత్రలు చేశాను. సరేలే మనకి సెట్ అవ్వదని సినిమాల గురించి పట్టించుకోకుండా నా పని నేను చూసుకుంటున్న సమయంలో వర్మ గారికి నా గురించి ఎవరో చెప్పారట. ఆయన వెంటనే ఫోన్ చేసి ఎన్టీఆర్ గారి డైలాగ్ ఇచ్చి షూట్ చేసి పంపించమన్నారు. ఆ వీడియో చూసే నాకీ అవకాశం కల్పించారు. సినిమాకి ముందు లెజెండ్ ఎన్టీఆర్ లా 50 శాతం చేస్తారేమో అనుకున్నా కానీ మీరు 100 శాతంకి పైగా చేసారు అని వర్మ గారు కాంప్లిమెంట్ ఇచ్చారు. అప్పట్లో ఎన్టీఆర్ గారిని చాలా సందర్భాల్లో చూసాను. అభిమానిగా అప్పుడప్పుడు ఆయన్ను అనుకరించే వాడిని. ఆయన వేసిన పాత్రలతో నాటకాలు కూడా వేసాను. అవన్నీ ఈ సినిమాకు బాగా కలిసొచ్చాయనుకుంటున్నాను.


టైంమిషన్ ఎక్కినట్టుంది – శ్రీ తేజ్

ఆదిత్య 369 సినిమా చూసాక అందరికీ టైం మిషన్ ఎక్కి వెనక్కి వెళ్ళాలనే కోరిక కలిగింది. అప్పట్లో నాకూ అనిపించింది. అనుకోకుండా బయోపిక్స్ క్యారెక్టర్స్ వల్ల టైం మిషన్ ఎక్కి మళ్ళీ వెనక్కి వెళ్ళాననే ఫీలింగ్ కలిగింది. ‘వంగవీటి’ లో దేవినేని నెహ్రూ క్యారెక్టర్ చేయడం , కథానాయకుడు -మహానాయకుడు లో దివంగత మాజీ ముఖ్యమంత్రి ‘వై.ఎస్.ఆర్’ గా నటించడం ఇప్పుడు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ లో ప్రస్తుత ఆంద్రప్రదేశ్ ముఖ్య మంత్రి క్యారెక్టర్ చేయడం నాకు దక్కిన గౌరవంగా ఫీలవుతున్నాను. బయోపిక్ స్పెషలిస్ట్ అనే ట్యాగ్ లైన్ ని ఎంజాయ్ చేస్తున్నాను. త్వరలో మరిన్ని మంచి పాత్రలతో ప్రేక్షకులను ఇలాగే మెప్పించాలని భావిస్తున్నాను.

సినిమా పూర్తయ్యాకే కలిశాను – యజ్ఞా శెట్టి 

సినిమా చేసే ముందు లక్ష్మీ పార్వతి గారిని కలిసిందే లేదు. కనీసం ఆవిడ వీడియోలు కూడా చూడలేదు. వర్మ గారు, మంజు గారి చెప్పింది చేసాను. సినిమా పూర్తయ్యాక ఆవిడను కలిసి ఓ ఐదు నిమిషాలు మాట్లాడటం జరిగింది. చాలా బాగా చేశావమ్మా అన్నారు. ఈ సినిమా ద్వారా చాలా అభినందనలు దక్కాయి. ప్రస్తుతం ‘నయీం డైరీస్’ అనే సినిమాలో నటిస్తున్నా.