'విజయ్ దేవరకొండ' ఇంటర్వ్యూ

Thursday,October 31,2019 - 02:29 by Z_CLU

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తొలిసారిగా నిర్మాణ రంగంలో అడుగుపెట్టి ‘మీకు మాత్రమే చెప్తా’ అనే సినిమా చేసాడు. తరుణ్ భాస్కర్ హీరోగా షామీర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా రేపే విడుదలవుతోంది. ఈ సందర్భంగా విజయ్ మీడియాతో మాట్లాడాడు. ఆ విశేషాలు తన మాటల్లోనే…

అర్జున్ రెడ్డి కంటే ముందే

‘పెళ్లి చూపులు’ అయిపోయాక అర్జున్ రెడ్డి రిలీజ్ కి ముందు షామీర్, అర్జున్ నాకు కథ చెప్పాడు. బాగుంది చేద్దాం అని చెప్పాను. కానీ ‘నోటా’,’డియర్ కామ్రేడ్’ లాంటి స్క్రిప్ట్స్ తర్వాత ఇలాంటి సినిమా కరెక్టేనా అనిపించింది. ఇప్పుడు కరెక్ట్ కాదు అనుకున్నాను. మళ్ళీ వాళ్ళిద్దరూ ఆరు నెలల తర్వాత ఇంకో స్క్రిప్ట్ చెప్పారు. అది నచ్చలేదు. సో వెళ్ళిపోయారు. తర్వాత ఆ స్క్రిప్ట్ పట్టుకొని చాలా ప్రయత్నాలు చేసారు. సో నాకు మా ‘పెళ్లి చూపులు’ టైం గుర్తొచ్చింది.అందుకే ఫిగరౌట్ చేసి నేనే చేద్దామని ఫిక్సయ్యాను.


నా మనసులో ఇద్దరే

కథ చెప్పినప్పుడు రాకేశ్ అనే రోల్ కి ఎవరైతే బాగుంటుందా అనుకున్నప్పుడు వెంటనే నాకు తరుణ్ , నవీన్ పోలిశెట్టి ఇద్దరే గుర్తొచ్చారు. సో ముందు తరుణ్ కి చెప్దాం అనిపించింది. రీజన్ ఏంటంటే తరుణ్ పెళ్లి చూపులు టైం మాకు సీన్స్ తను చేసి చూపించేవాడు. ఒక్కో సారి మాకంటే తనే బాగా చేసేవాడు. సో రాకేశ్ క్యారెక్టర్ కి తరుణ్ టైమింగ్ పర్ఫెక్ట్ అనిపించింది. ముందు ఒప్పుకోలేదు తర్వాత మెల్లగా ఒప్పించాను.

ఆ కల ఇప్పుడు నెరవేరింది

నేను , నవీన్ థియేటర్ ఆర్టిస్టులుగా ఉన్నప్పుడు షార్ట్ ఫిలిం మేకర్స్ తో ఎక్కువ ట్రావెల్ అయ్యే వాళ్ళం. సో ఆ టైంలో మేము కొంత డబ్బు సంపాదించి అందరం కలిసి ఓ ఫిలిం చేయాలని కల కంటుండే. సో ఫైనల్ గా మేము అప్పుడు అనుకున్న కల ఇప్పుడు నెరవేరింది. ఒక్కసారిగా అప్పటి రోజులు
గుర్తొచ్చాయి.

ఇప్పుడు నేను…అంతే

నిజానికి నాకు యాక్టర్ గా నాగీ , తరుణ్ ఛాన్స్ ఇచ్చారు. సో వాళ్ళు ఇచ్చిన అవకాశాల వాళ్ళే నన్ను నేను ప్రూవ్ చేసుకోగలిగాను. ఇప్పుడు నా టైం. నేను నాలాంటి వారికి సపోర్ట్ చేస్తూ కాన్సెప్ట్ సినిమాలను ప్రొడ్యూస్ చేద్దామనే ఉద్దేశ్యంతో ముందుగా ‘మీకు మాత్రమే చెప్తా’ నిర్మించడం జరిగింది.


అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్

సినిమా అంతా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా ఉంటుంది. స్టార్టింగ్ నుండి ఎంగింగ్ వరకూ అందరూ సరదాగా నవ్వుకుంటారు. క్యారెక్టర్స్ అన్నీ ప్రేక్షకులకు బాగా నవ్వు తెప్పిస్తాయి. సినిమా చూసి బయటికి వచ్చాక కూడా నవ్వుతారు.

ఆ నమ్మకంతోనే

నిజానికి సినిమా నిర్మాణం అనేది ఆశా మాషీ వ్యవహారం కాదు. కాకపోతే నేను ప్రొడ్యూస్ చేయడం వల్ల నా పరిచయాలతో సినిమా ముందుకు వెళ్తుంది. ఎవరికైనా చూపించగలను. వాళ్ళకి నచ్చితే రిలీజ్ చేస్తారు లేదంటే ఏదో చిన్న హెల్ప్ చేస్తారు. సో నమ్మకంతో ముందడుగు వేసాను. అనుకున్నట్లే సునీల్ నరంగ్ గారు సినిమాను రిలీజ్ చేస్తున్నారు.

అది నా జాబ్ కాదు

ఈ సినిమా విషయంలో స్క్రిప్ట్ సైడ్ ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వలేదు. యాక్టర్స్ ఛాయిస్ కూడా డైరెక్టర్ టీం దే. నేను జస్ట్ ఎలా పుష్ చేయాలి ఎంత వరకూ మనీ పెట్టాలి అనేది మాత్రమే చూసుకున్నాను. సెట్ కి కూడా ఒకే ఒక్కసారి టీం అందరూ అడిగితే వెళ్లాను. సో పోస్ట్ ప్రొడక్షన్ టైంలో మాత్రమే నిర్మాతగా నా బాధ్యత గుర్తుచేసుకొని ప్లాన్స్ తో ఇంత వరకూ తీసుకొచ్చాను.


పూరి గారిని కలిసింది అక్కడే

డియర్ కామ్రేడ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బెంగళూరు వెళ్ళాము. ఆ ఈవెంట్ కి నాతో పాటు కొందరు డాన్సర్స్ వచ్చారు. వారికి హైదరాబాద్ వచ్చాక ఓ పబ్ లో పార్టీ ఏర్పాటు చేసాను. వారికి థాంక్స్ చెప్పడానికి అక్కడికి వెళ్ళాను. అదే పబ్ లో కింద ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ పార్టీ జరుగుతుంది. సో వెళ్లి పూరి గారిని కలిసి కంగ్రాట్ చెప్పాను. ఆయన మనం కలుద్దాం అని అన్నారు. అన్న పదిహేను రోజులకే కాల్ చేసారు. వెళ్లి కలిసాను. అప్పుడు సినిమా చేద్దాం అని చెప్పి లైన్ చెప్పారు. సో అలా ఓ పబ్ లో మా కాంబినేషన్ సెట్ అయింది.

అవన్నీ రూమర్స్

‘హీరో’ సినిమా ఫస్ట్ షెడ్యూల్ అవ్వగానే సినిమా ఆగిపోయిందని అనే న్యూస్ వచ్చింది. మళ్ళీ సినిమా క్యాన్సల్ అవ్వలేదు ఉంది అనే న్యూస్ వచ్చింది. నేను ఇంట్లో ఉండగా సినిమా షూటింగ్ స్టార్టయింది అనే వార్త వచ్చింది. ఇలా మాకు సంబంధం లేకుండా మేకర్స్ నుండి ఎలాంటి అప్డేట్ లేకుండానే అవన్నీ జరిగాయి. జనవరి నుండి పూరి జగన్నాథ్ సినిమా స్టార్ట్ అవుతుంది. ఆ సినిమా తర్వాత హీరో రెండో షెడ్యూల్ స్టార్ట్ చేస్తా. ఆ సినిమా తర్వాత శివ నిర్వాణతో సినిమా చేస్తాను.

‘వరల్డ్ ఫేమస్ లవర్’… ఇంకా ఫిక్సవ్వలేదు

‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాకు సంబంధించి ఇంకా ఎనిమిది రోజులు షూట్ బ్యాలెన్స్ ఉంది. అది పూర్తయ్యాక సినిమా రిలీజ్ డేట్ గురించి డిసిషన్ తీసుకుంటాం. డిసెంబర్ లో అనుకున్నాం కానీ ఇప్పుడు చాలా సినిమాలు ఆ మంత్ లో రిలీజవుతున్నాయి.