టాలీవుడ్ నుంచి వెల్లువెత్తుతున్న విరాళాలు-3

Sunday,March 29,2020 - 12:37 by Z_CLU

రామ్ చరణ్
క‌రోనా వైర‌స్ కార‌ణంగా దేశ‌మంత‌టా లాక్ డౌన్‌. సినీ ప‌రిశ్ర‌మంతా స్తంభించిపోయింది. ఈ త‌రుణంలో పేద సినీ కార్మికులను కాపాడ‌టానికి సినీ ప్ర‌ముఖులు ముందుకొచ్చారు. అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి ఆధ్వ‌ర్యంలో ’క‌రోనా క్రైసిస్ చారిటీ’(సి.సి.సి) ను ఏర్పాటు చేశారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల సహాయ నిధికి 70 లక్షలు డొనేట్ చేసిన మెగాపవర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ఇప్పుడు రూ.30 ల‌క్ష‌ల విరాళాన్ని సినీ కార్మికుల సహాయ నిధికి అంద‌చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు.

నిఖిల్
క‌రోనా నివార‌ణ చ‌ర్య‌ల‌కు యంగ్ హీరో నిఖిల్ కూడా ముందుకొచ్చారు. క‌రోనాని అరిక‌ట్టేందుకు ముందు వ‌ర‌స‌లో ఉండి యుద్ధం చేస్తున్న డాక్ట‌ర్స్ కి, మెడిక‌ల్ సిబ్బందికి చేయుత‌గా వారి ర‌క్ష‌ణ‌కి ప‌ర్స‌న‌ల్ ప్రొట‌క్ష‌న్స్ కిట్స్ భారీగా అందించారు.
2000 ఎన్ 95 రెస్పిరేట‌ర్లు
2000 రీ యూజ‌బుల్ గ్ల‌వ్స్
2000 ఐ ప్రొట‌క్ష‌న్స్ గ్లాస్లులు, శానిటైజ‌ర్లు
10000 ఫేస్ మాస్క‌లు
ఈ కిట్స్ అన్నిటిని గాంధీ ఆసుపత్రిలో ఉన్న హెల్త్ డిపార్టెంట్ అధికారుల‌కి స్వయంగా నిఖిల్ తీసుకెళ్లి అంద‌జేయడం విశేషం.

నాగచైతన్య
షూటింగులు లేక ఇబ్బంది పడుతున్న పేద సినీ కార్మికుల కోసం సినీ పరిశ్రమ ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ ఛారిటీ కి నాగ చైతన్య 25 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. మనకి రోజూ తోడుండే రోజువారీ సినీ వర్కర్స్ కి సహాయం చేయడం కోసం పరిశ్రమ పూనుకోవడం తనని కదిలించిందని, తన వంతుగా వారికి 25 లక్షల రూపాయల సహాయం అందిస్తున్నట్టు, ఇలాంటి సమయంలో అందరం కలిసికట్టుగా ఈ పరిస్థితిని ఎదుర్కోవాలని నాగ చైతన్య అన్నారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల సహాయ నిధికి 20 లక్షలు డొనేట్ చేసిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ.. ఇప్పుడు రూ.10 ల‌క్ష‌ల విరాళాన్ని ’క‌రోనా క్రైసిస్ చారిటీ’(సి.సి.సి) కి అంద‌చేస్తున్న‌ట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ అధినేతలు దిల్ రాజు, శిరీష్ ఓ ప్రకటన చేశారు.

వరుణ్ తేజ్
చిరంజీవి పిలుపునకు స్పందించిన యువ హీరో వరుణ్ తేజ్ తన వంతుగా ఈ సినీ కార్మికుల సహాయ నిధి కి రూ. 20 లక్షలు డొనేషన్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఈ కష్ట సమయంలో ఇబ్బంది పడుతున్న మన సినిమా కార్మికులకు సి.సి.సి ద్వారా మంచి జరగాలని కోరుకుంటున్నా అని వరుణ్ తేజ్ అన్నారు.

శర్వానంద్
హీరో శ‌ర్వానంద్ ఆదివారం ఉద‌యం 11 గంట‌ల‌కు తొలిసారిగా ‘ఐయామ్ శ‌ర్వానంద్’ అనే ట్విట్ట‌ర్ అకౌంట్‌తో సోష‌ల్ మీడియాలో అడుగుపెట్టారు. దిన‌స‌రి వేతనంతో ప‌నిచేసే కార్మికులు సినిమా సెట్ల‌పై అంద‌రికంటే ఎక్కువ‌గా క‌ష్ట‌ప‌డుతుంటార‌ని పేర్కొన్న ఆయ‌న‌, షూటింగ్‌లు లేక ఆర్థిక ఇబ్బందుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న‌ తెలుగు సినీ కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ‘క‌రోనా క్రైసిస్ చారిటీ’కి రూ. 15 ల‌క్ష‌లు విరాళం ప్ర‌క‌టించారు.