టాలీవుడ్ నుంచి వెల్లువెత్తుతున్న విరాళాలు

Friday,March 27,2020 - 01:18 by Z_CLU

చిరంజీవి
కరోనా వైరస్ ని కట్టడి చేసేందుకు సినీ ప్రముఖులు భారీగా విరాళాలను అందజేస్తున్నారు. దేశంలో లాక్ డౌన్ ప్రభావంతో సర్వం నిలిచిపోయిన పరిస్థితుల్లో టాలీవుడ్ సినీ కార్మికుల కోసం మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం ప్రకటించారు. ఉపాధి కోల్పోయిన కార్మికులను ఆదుకొనేందుకు పెద్ద మనసుతో రూ.కోటి విరాళం ఇస్తున్నట్టు ట్వీటర్‌లో తెలిపారు. సినీ కార్మికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ మొత్తం ఇస్తున్నట్టు పేర్కొన్నారు.

అల్లు అర్జున్
క‌రోనా పై పోరాటానికి త‌న వంతు బాధ్య‌త‌గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 1.25 కోట్లు విరాళం అందిస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు. ఈ మొత్తంలో 50 ల‌క్ష‌లు ఆంధ్రప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి రిలీఫ్ ఫండ్ కు మ‌రో 50 ల‌క్ష‌లు తెలంగాణ ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి అందిస్తున్న‌ట్లుగా అల్లు అర్జున్ తెలిపారు. ఇక మ‌రో 25 ల‌క్ష‌లు కేర‌ళ ముఖ్య‌మంత్రి రిలీఫ్ ఫండ్ కు అందిస్తున్నారు.

నితిన్
క‌రోనా వైర‌స్ వ్యాప్తి నిరోధంలో త‌న వంతు భాగ‌స్వామ్యం అందించాల‌ని హీరో నితిన్ నిర్ణ‌యించుకున్నారు. క‌రోనా క‌ట్ట‌డికి రెండు తెలుగు రాష్ట్రాలు చిత్త‌శుద్ధితో కృషి చేస్తున్నాయ‌ని ప్ర‌శంసించిన ఆయ‌న‌, రెండు
రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు ప్ర‌జ‌లంద‌రూ స‌హ‌క‌రించాల‌ని కోరారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి చెరో 10 ల‌క్ష‌ల రూపాయ‌ల విరాళాన్ని నితిన్ ప్ర‌క‌టించారు.

అనీల్ రావిపూడి
క‌రోనా మ‌హ‌మ్మారిపై పోరాటానికి తెలుగు చిత్ర‌సీమ నుంచి మ‌ద్ద‌తు పెరుగుతోంది. తాజాగా డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్ట‌డానికి రెండు తెలుగు రాష్ట్రాల‌కు త‌న వంతుగా మొత్తం రూ. 10
ల‌క్ష‌లు విరాళం ప్ర‌క‌టించారు. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి స‌హాయ నిధుల‌కు చెరో రూ. 5 ల‌క్ష‌లు అంద‌జేస్తున్న‌ట్లు గురువారం ట్వీట్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, ప్ర‌జ‌లంద‌రూ సామాజిక దూరం పాటిస్తూ, ఇళ్ల‌ల్లో ఉండి లాక్‌డౌన్ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాలని కోరారు.

రామ్ చరణ్
ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి ప్రమాదకరంగా విస్తరిస్తున్న నేపథ్యంలో సామాన్యులను ఆదుకునేందుకు మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌రోనా నిర్మూలనా చర్యలకు రూ.70 ల‌క్షలు విరాళ‌మిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

త్రివిక్రమ్
ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడల్లా తన వంతు బాధ్యతగా స్పందిస్తూ ఉంటారు దర్శకుడు త్రివిక్రమ్. ఈ నేపథ్యంలో కరోనా సహాయక చర్యల కోసం తెలుగు రాష్ట్రాలు చేస్తున్న పోరాటానికి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ ‌విరాళం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో రూ.10 లక్షల చొప్పున విరాళం అందజేస్తానని వెల్లడించారు.

దిల్ రాజు
‘‘క‌రోనా వైర‌స్‌(కోవిడ్ 19) కార‌ణంగా అంతర్జాతీయ విప‌త్తు ఏర్ప‌డింది. దీని నివారించ‌డం మ‌న బాధ్య‌త‌. అందుకు తీసుకుంటున్న నివార‌ణా చ‌ర్య‌ల‌కు మ‌న వంతు స‌హ‌కారాన్ని అందించాలి. అది ఎంత చిన్న‌దైన కావ‌చ్చు. అందులో భాగంగా శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ తెలంగాణ రాష్ట్రానికి రూ.10 ల‌క్షలు, ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్రానికి రూ.10 ల‌క్ష‌లు నివార‌ణ చ‌ర్య‌ల నిమిత్తం విరాళంగా అందిస్తుంది. క‌రోనా వైర‌స్ నివార‌ణ కోసం కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను అభినందిస్తున్నాం’’ అని దిల్‌రాజు, శిరీష్ తెలిపారు.

అల్లరి నరేష్


సాయితేజ్
‘‘మనం ఇది వరకు మనం చూడనటువంటి శత్రువుతో యుద్ధం చేస్తున్నాం. దాని కోసం మనం అందరం కలిసే ఉన్నాం. అలాగే మనం ఆ యుద్ధంలో విజయం సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల సహాయ నిధికి నా వంతుగా రూ.10 లక్ష‌ల విరాళాన్ని అందిస్తున్నాను.. ఇంట్లోనే ఉండండి.. జాగ్ర‌త్త‌గా ఉండండి’’అని తెలిపారు సాయితేజ్‌.

ఎన్టీఆర్
క‌రోనా వైర‌స్‌(కోవిడ్ 19) నిర్మూల‌న‌కు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు యుద్ధ ప్ర‌తిపాదిక‌న చ‌ర్య‌లు చేప‌డుతున్నాయి. టాలీవుడ్‌కి చెందిన ప‌లువురు స్టార్స్ ఇప్ప‌టికే త‌మ వంతు సాయంగా విరాళాల‌ను ప్ర‌క‌టిస్తున్నారు. తాజాగా యంగ్ టైగ‌ర్ ఎన్టీర్ రూ.75ల‌క్ష‌ల విరాళాన్ని ప్ర‌క‌టించారు. ఈ మొత్తంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల స‌హాయ నిధికి చెరో రూ.25ల‌క్ష‌లు అంటే రెండు రాష్ట్రాల‌కు రూ.50 ల‌క్ష‌ల విరాళంతో పాటు మ‌రో రూ.25 ల‌క్ష‌ల‌ను క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో ఉపాధి కోల్పోయిన రోజువారీ సినీ పేద క‌ళాకారుల‌కు అంద‌చేస్తున్నారు.

మహేష్ బాబు
‘‘క‌రోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్ర‌భుత్వాలు చ‌క్క‌టి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ఈ పోరాటంలో నా వంతు భాగ‌స్వామ్యంగా తెలంగాణ‌ ముఖ్యమంత్రి సహాయనిధికి, అలాగే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి స‌హాయ‌నిధికి కలిపి రూ. కోటి రూపాయ‌ల్ని విరాళంగా ఇస్తున్నాను. బాధ్య‌తాయుత‌మైన పౌరులుగా ప్ర‌తి ఒక్క‌రూ లాక్‌డౌన్‌కు స‌హ‌క‌రించి నియ‌మ‌ నిబంధనలను పాటించండి. ఇంటిలోనే ఉండి.. సురక్షితంగా ఉండండి..’’ అంటూ ట్వీట్ చేశాడు మ‌హేష్‌బాబు.

రాజశేఖర్
కరోనా కారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో సరైన ఆహారం దొరకక నిరుపేద కళాకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యాంగ్రీ స్టార్ రాజశేఖర్ పెద్ద మనసుతో అటువంటి కళాకారులకు నిత్యావసర సరుకులు అందజేశారు. రెండొందల మందికి 10 కేజీల బియ్యం, 2 కేజీల కందిపప్పు, 2 కేజీల పంచదార, కేజీ ఉప్పు అర కేజీ కారం, పావుకిలో టీ పొడి, 2 లీటర్ల ఆయిల్, 2 కేజీల ఆట, పావు కిలో పచ్చడి రాజశేఖర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందజేశారు. మరో రెండు వందల మందికి నిత్యావసరాలు అందజేయనున్నారు. ‌

సుకుమార్
క‌రోనా వైర‌స్‌(కోవిడ్ 19) నిర్మూల‌న‌కు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు యుద్ధ ప్ర‌తిపాదిక‌న చ‌ర్య‌లు చేప‌డుతున్నాయి. టాలీవుడ్‌కి చెందిన ప‌లువురు స్టార్స్ ఇప్ప‌టికే త‌మ వంతు సాయంగా విరాళాల‌ను ప్ర‌క‌టిస్తున్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ రూ. 10 ల‌క్ష‌ల విరాళాన్ని ప్ర‌క‌టించారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల స‌హాయ నిధికి చెరో రూ.5 ల‌క్ష‌లు చొప్పున విరాళం అందజేస్తానని ఆయన వెల్లడించారు. ఈ విరాళాలను ప్రభుత్వాలకు త్వరలోనే అందజేయనున్నట్లుగా ఆయన తెలియజేశారు.

పవన్ కల్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… తన వంతు సాయంగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి చెరో రూ.50 లక్షల విరాళాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇస్తున్నట్టు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

ప్రభాస్
క‌రోనా నివార‌ణ చ‌ర్య‌ల‌ నిమిత్తం రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ. కోటి రూపాయలు ప్రకటించారు ప్రభాస్. ఈ కోటి విరాళం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల స‌హాయ నిధికి ఇవ్వనున్నట్లుగా ఆయన తెలియజేశారు. దీనికి అదనంగా ప్రధానమంత్రి సహాయనిధికి రూ. 3 కోట్ల విరాళం ఇస్తున్నట్లుగా ప్రకటించారు. దీంతో ఇప్పటి వరకు అధిక విరాళం ప్రకటించిన టాలీవుడ్ ప్రముఖుడిగా నిలిచాడు ప్రభాస్.

కొరటాల శివ
క‌రోనా వైరస్‌పై పోరాటంలో భాగంగా తీసుకుంటున్న చర్యలకు తమ‌ వంతు సాయం అందించేందుకు ముందుకొచ్చారు దర్శకుడు కొరటాల శివ. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల సహాయ నిధికి చెరో రూ. 5ల‌క్ష‌ల మొత్తాన్ని అందజేయనున్నట్టు చెప్పారు.