టాలీవుడ్ నుంచి వెల్లువెత్తుతున్న విరాళాలు-6

Tuesday,April 07,2020 - 10:01 by Z_CLU

మైత్రీ మూవీ మేకర్స్
క‌రోనా వైర‌స్‌పై పోరాటంలో భాగ‌మ‌వుతూ ఇదివ‌రకే తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం స‌హాయ‌నిధుల‌కు చెరొక రూ. 10 ల‌క్ష‌ల చొప్పున రూ. 20 ల‌క్ష‌లను విరాళంగా ప్ర‌ముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ అధినేత‌లు న‌వీన్ యెర్నేని, వై. ర‌విశంక‌ర్ అంద‌జేశారు. తాజాగా క‌రోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)కి మ‌రో రూ. 5 ల‌క్ష‌ల‌ను వారు అంద‌జేశారు.

శ్రీ సత్యసాయి ఆర్ట్స్ – రాథామోహన్
కరోనా సమస్య వలన షూటింగ్ లు అన్నీ ఆగిపోయి వాటి మీదే ఆధారపడి వున్న సినీ కార్మికుల సంక్షేమం కోసం మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పాటైన కరోనా క్రైసిస్ ఛారిటీ (సి సి సి) కి తనవంతు సహాయంగా ‘ఒరేయ్.. బుజ్జిగా’ నిర్మాత, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ అధినేత కె కె రాధామోహన్ 3 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఇలాంటి ఊహించని కష్ట కాలంలో చేతనైనంత సహాయం చేయడం ద్వారానే కలిసికట్టుగా కరోనా ను జయించవచ్చని రాధామోహన్ అన్నారు.

కృష్ణంరాజు కుటుంబం
సుప్రసిద్ధ నటులు, నిర్మాత, మాజీ కేంద్ర మంత్రి రెబల్ స్టార్ కృష్ణంరాజు, ఆయన కుటుంబ సభ్యులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రిలీఫ్ ఫండ్ కు 10 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు. కృష్ణంరాజు
పెద్దమ్మాయి సాయి ప్రసీద, రెండవ అమ్మాయి సాయి ప్రకీర్తి, మూడవ అమ్మాయి సాయి ప్రదీప్తి తాము దాచుకున్న పాకెట్ మనీ నుండి తలా రెండు లక్షలు చొప్పున ప్రధాని రిలీఫ్ ఫండ్ కు ఇచ్చారు. కృష్ణంరాజు భార్య శ్యామలా దేవి ఏప్రిల్ 13న తన జన్మదిన సందర్భంగా నాలుగు లక్షల రూపాయలను ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కు ఇస్తానని చెప్పారు. కాబట్టి మొత్తం 10 లక్షల విరాళాన్ని వీళ్లు
ప్రధానమంత్రి సహాయనిధికి పంపించారు.

వీకే నరేష్
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) అధ్య‌క్షుడు వీకే న‌రేష్ త‌నలోని దాతృత్వాన్ని చాటుకున్నారు. కరోనా మహమ్మారి తాండవం చేస్తున్న ఈ సమయంలో ‘మా’ సభ్యులకు అండగా నిలబడటం త‌న‌ బాధ్యతగా భావించిన ఆయ‌న త‌న‌ వంతుగా 100 కుటుంబాలని దత్తత తీసుకుని ఒక్కో కుటుంబానికి రూ. 10,000 చొప్పున మొత్తం రూ. 10 ల‌క్ష‌లు ఆర్థిక సాయం చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. వారిలో ‘మా’ సర్వే చేయించిన‌ 58 మంది సభ్యులకు ఇప్పటికే వారి బ్యాంక్ అకౌంట్‌లో రూ. 10,000 చొప్పున డిపాజిట్ చేశారు. అదేవిధంగా సినీ కార్మికుల‌ను ఆదుకోవ‌డానికి మెగాస్టార్ చిరంజీవి చైర్మ‌న్‌గా ఏర్పాటైన క‌రోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)కి త‌న వంతుగా మ‌రో రూ. 1 ల‌క్ష విరాళం అంద‌జేస్తున్న‌ట్లు న‌రేష్ ప్ర‌క‌టించారు.

ఆదిత్య మ్యూజిక్
ప్ర‌ముఖ మ్యూజిక్ కంపెనీ ఆదిత్య మ్యూజిక్ సంస్థ క‌రోనా నివార‌ణ‌కు త‌మ వంతుగా ఆర్ధిక స‌హ‌కారం అందించ‌డానికి ముందుకొచ్చారు. ఆదిత్య మ్యూజిక్ అధినేత‌లు ఉమేశ్ గుప్త‌, సుభాష్ గుప్త‌, దినేశ్ గుప్త‌, ఆదిత్య గుప్త‌లు తాజాగా తెలంగాణ ఐటి మంత్రి కేటీఆర్ ను క‌లిసి క‌రోనా నివార‌ణ చ‌ర్య‌ల‌కు గాను సీఎం రిలీఫ్ ఫండ్ కు 31 లక్షలు విరాళం అందించారు.

సంపత్ నంది
కరోనా సంక్షోభం వలన సినిమా షూటింగులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సినీ కార్మికులకు సహాయం అందించేందుకు ఏర్పాటైన కరోనా క్రైసిస్ ఛారిటీ (సి సి సి) కు దర్శకుడు సంపత్ నంది 5 లక్షల రూపాయల విరాళాన్ని అందించనున్నట్లు ప్రకటించారు.