టాలీవుడ్: ఆగస్ట్ బాక్సాఫీస్ రివ్యూ

Monday,September 03,2018 - 05:25 by Z_CLU

డబ్బింగ్ సినిమాలతో కలుపుకొని ఆగస్ట్ లో 23 సినిమాలు రిలీజయ్యాయి. వీటిలో ఒకే ఒక్క సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మరో 2 సినిమాలు హిట్ అవ్వగా, మరో 3 సినిమాలు యావరేజ్ హిట్స్ గా నిలిచాయి. ఆగస్ట్ నెల టాలీవుడ్ బాక్సాఫీస్ రివ్యూ చూద్దాం.

ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో ఏకంగా అరడజను సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో గూఢచారి సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. తక్కువ బడ్జెట్ లో తీసిన సినిమా ఎక్కువ లాభాలు ఆర్జించింది. ఈ మూవీ తర్వాత హిట్ అయిన మూవీ చిలసౌ. ఈ మూవీతో చాన్నాళ్ల గ్యాప్ తర్వాత హిట్ కొట్టాడు సుశాంత్. ఈ రెండు సినిమాలతో పాటు బ్రాండ్ బాబు మూవీత కూడా ఓ మోస్తరు విజయాన్నందుకుంది. ఇలా ఆగస్ట్ మొదటి వారం బాక్సాఫీస్ కళకళలాడింది. అయితే ఈ 3 సినిమాలతో పాటు వచ్చిన మరో 3 సినిమాలు (మన్యం, తరువాత ఎవరు, శివకాశీపురం) మాత్రం ఫ్లాప్ అయ్యాయి

సెకండ్ వీక్ లో శ్రీనివాసకళ్యాణం, విశ్వరూపం-2 సినిమాలు వచ్చాయి. జస్ట్ 24 గంటల గ్యాప్ లో వచ్చిన ఈ రెండు సినిమాల్లో శ్రీనివాసకళ్యాణం ఓ మోస్తరు విజయాన్నందుకుంటే, కమల్ హాసన్ నటించిన విశ్వరూపం-2 మాత్రం ఫ్లాప్ అయింది.

ఇక ఆగస్ట్ మూడో వారంలో వచ్చిన గీతగోవిందం సినిమా టోటల్ టాలీవుడ్ కే ఓ కళ తీసుకొచ్చింది. గీతాఆర్ట్స్-2 బ్యానర్ పై విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమా దెబ్బకు అప్పటివరకు థియేటర్లలో ఉన్న మూవీస్ అన్నీ దుకాణం సర్దేశాయి. విడుదలై 3 వారాలైనా ఇప్పటికీ ఈ సినిమా థియేటర్లలో కొనసాగుతూ, అటు ఓవర్సీస్ లో ఇటు డొమస్టిక్ గా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ మూవీ వచ్చిన 2 రోజుల గ్యాప్ లో జ్యోతిక నటించిన ఝాన్సీ సినిమా థియేటర్లలోకి వచ్చి అట్టర్ ఫ్లాప్ అయింది.

నాలుగో వారంలో ఆటగాళ్లు, నీవెవరో, అంతకుమించి, లక్ష్మి సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో ఆది-తాప్సి నటించిన నీవెవరో సినిమా ఓ మోస్తరుగా ఆకట్టుకోగా, మిగతా సినిమాలన్నీ నిరాశపరిచాయి. నారా రోహిత్, జగపతిబాబు నటించిన ఆటగాళ్లు సినిమా ఎట్రాక్ట్ చేయలేదు. రష్మి అందాలు అంతకుమించి సినిమాను ఆదుకోలేకపోయాయి. ఇక ప్రభుదేవా నటించిన లక్ష్మి సినిమా కూడా థియేటర్లలో క్లిక్ అవ్వలేదు.

ఆగస్ట్ కు ఫినిషింగ్ టచ్ ఇస్తూ ఆఖరి వారంలో 5 సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. వీటిలో నర్తనశాల సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ ఓ మోస్తరుగా మాత్రమే అలరించింది. అక్కడక్కడ మాత్రమే నవ్వించింది. పేపర్ బాయ్, కోకో కోకిల సినిమాలు ఫర్వాలేదనిపించుకోగా.. క్రైమ్-23, సమీరమ్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.