మెగా స్టార్ ను కలిసిన పల్లె కోయిల

Monday,November 26,2018 - 01:31 by Z_CLU

కొన్ని రోజుల క్రిందట ‘ఓ చెలియా నాప్రియ సఖియా’ అంటూ పల్లెటూరి మహిళ పాడిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.. తన గానంతో యావత్ సంగీతాభిమానులందరినీ ఆకట్టుకొని చివరికి రెహమాన్ ని కూడా అవక్కయ్యేలా చేసిన ఆ పల్లె కోయిలమ్మ పేరు బేబి …

తన సాంగ్ వీడియో ద్వారా అందరికీ సుపరిచుతురాలైన బేబీ ఇటివలే తన ఫేవరేట్ హీరో మెగా స్టార్ ని కలిసి మురిసిపోయింది… సంగీత దర్శకుడు కోటి ద్వారా ఆమె గురించి తెలుసుకున్న చిరు ఇటివలే ఆమెను తన ఇంటికి పిలిపించుకొని మరీ కాసేపు ముచ్చటించాడు. తను పాట పాడిన వీడియో చూశానని సింగర్ గా బేబీ ప్రతిభ ను ప్రత్యేకంగా మెచ్చుకొని అభినందించాడు చిరు. తన అభిమాన హీరోతో ఇలా పక్కన కూర్చొని మాట్లాడే అవకాశం రావడంతో ఉబ్బితబ్బిబ్బయ్యింది సింగర్ బేబీ.

అంతే కాదు లేటెస్ట్ గా ఓ సినిమాలో రఘు కుంచె సంగీతంలో పాట కూడా పాడి తెలుగు సినిమా పరిశ్రమలో సింగర్ గా అడుగుపెట్టేసింది ఈ పల్లె కోయిల. సినిమాలో ఓ పాటతో పాటు పనిలోపనిగా ఆమెపై ఒక ప్రత్యేక పాట కూడా క్రియేట్ చేసి ఓ ఆల్బం సాంగ్ పాడించాడు రఘు కుంచె. ఈ పాటకు లక్ష్మి భూపాల లిరిక్స్ అందించాడు. బేబీ పాడిన ఆల్బం సాంగ్ త్వరలోనే మెగా స్టార్ చేతుల మీదుగా రిలీజ్ కానుంది.