ఫిబ్రవరి బాక్సాఫీస్ రివ్యూ

Saturday,March 02,2019 - 03:29 by Z_CLU

సంక్రాంతి సందడి ఇలా ముగిసిందో లేదో టాలీవుడ్ లో స్లంప్ స్టార్ట్ అయింది. ఒకట్రెండు సినిమాలు మినహా ఫిబ్రవరిలో ఆకట్టుకున్న సినిమాల్లేవ్. లాభాల సంగతి పక్కనపెడితే బ్రేక్-ఈవెన్ అయిన సినిమాలు కూడా చాలా తక్కువ.

ఫిబ్రవరి మొదటి వారంలో రహస్యం, బిచ్చగాడా మజాకా, అక్కడొకడుంటాడు, సకల కళావల్లభుడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో క్లిక్ అయిన సినిమా ఒక్కటి కూడా లేదు. బిచ్చగాడా మజాకా సినిమాలో బాబు మోహన్ ఉన్నారు. ఆయన ఎప్పీయరెన్స్ సినిమాకు కలిసొస్తుందని భావించారు కానీ, ప్రమోషన్ సరిగ్గా చేయక సినిమా చతికిలపడింది.

ఇక ఫిబ్రవరి రెండో వారంలో ఎమ్-6, అమావాస్య, విచారణ, సీమరాజా, యాత్ర సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో యాత్ర సినిమా తప్ప మిగతా సినిమాలేవీ ఆడలేదు. కనీసం అవి వచ్చిన విషయాన్ని కూడా ఎవ్వరూ పట్టించుకోలేదు. వైఎస్ఆర్ పాదయాత్ర బ్యాక్ డ్రాప్ లో మహి వి రాఘవ్ తీసిన యాత్ర మాత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఎమోషనల్ గా కనెక్ట్ అయిన ఈ సినిమా, మీడియా రేంజ్ బడ్జెట్ లో తీయడం వల్ల బ్రేక్-ఈవెన్ అయింది.

ఫిబ్రవరి మూడో వారంలో లవర్స్ డే, దేవ్ సినిమాలు వచ్చాయి. కార్తీ-రకుల్ జంటగా నటించిన దేవ్ సినిమాపై విడుదలకు ముందు భారీ అంచనాలుండేవి. ఇక సోషల్ మీడియాలో వింక్-సెన్సేషన్ గా పేరుతెచ్చుకున్న ప్రియా వారియర్ నటించిన సినిమా లవర్స్ డేపై కూడా ఓ మోస్తరు అంచనాలుండేవి. పైగా ఆ కన్నుగీటే సన్నివేశం ఈ సినిమాలోనిదే కావడంతో కుర్రాళ్లు కాస్త ఫోకస్ పెట్టారు. కానీ ఈ రెండు సినిమాలు ఫెయిల్ అయ్యాయి.

ఫిబ్రవరి ఆఖరి వారంలో మిఠాయి, అంజలి సీబీఐ, మహానాయకుడు సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. వీటిలో మిఠాయి సినిమా డిజాస్టర్ అయింది. మమ్మల్ని క్షమించండంటూ స్వయంగా మేకర్స్ ప్రెస్ నోట్ రిలీజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక నయన్ నటించిన అంజలి సీబీఐ బాగుందనే టాక్ తెచ్చుకున్నప్పటికీ, పూర్ పబ్లిసిటీ కారణంగా దీనికి వసూళ్లు లేవు. ఎన్టీఆర్ బయోపిక్ లో పార్ట్-2గా వచ్చిన మహానాయకుడు సినిమా కూడా ఫ్లాప్ అయింది.