'మహానటి'లో మెరిసిన దర్శకులు వీళ్లే..!

Wednesday,May 09,2018 - 06:27 by Z_CLU

దర్శకులు నటులయితే అదరగొట్టేస్తారు. ఈ విషయాన్ని దాసరి, విశ్వనాధ్, ఎస్.వి.కృష్ణారెడ్డి లాంటి ఎంతో మంది దర్శకులు నిరూపించారు. ఇప్పుడు ఆ కోవలోకి చేరిపోయారు కొందరు దర్శకులు. ఈరోజు గ్రాండ్ గా రిలీజైన మహానటి సినిమాలో కొందరు దర్శకులు నటులుగా మెరిశారు. అలనాటి మేటి దర్శకుల క్యారెక్టర్స్ లో ఒదిగిపోయారు.

క్రిష్ :

దర్శకుడిగా విభిన్న సినిమాలతో తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్ సంపాదించుకున్న క్రిష్ జాగర్లమూడి…మహానటి సినిమాలో కే.వి.రెడ్డి గా నటించి ఆ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు. ముఖ్యంగా నటనతోనే కాకుండా.. కేవీ రెడ్డి మేనరిజమ్స్ కూడా చూపించి శభాష్ అనిపించుకున్నాడు.

తరుణ్ భాస్కర్ :

‘పెళ్లి చూపులు’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ కూడా ఈ సినిమాలో ఓ దర్శకుడి పాత్రను పోషించాడు. మాయాబజార్ సినిమాకు కేవి.రెడ్డి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు సింగీతం శ్రీనివాసరావు. ఆ పాత్రలో తరుణ్ భాస్కర్ కనిపించారు. కనిపించింది తక్కువ సేపే అయినప్పటికీ మెరిశాడు.

అవసరాల శ్రీనివాస్ :

ఆరంభంలో నటుడిగా అలరించి ఆ తర్వాత దర్శకుడిగా మారిన అవసరాల శ్రీనివాస్ కూడా ఓ ముఖ్య పాత్రలో కనిపించాడు. సావిత్రిని వెండితెరకు పరిచయం చేసిన దర్శకుడు ఎల్వీ ప్రసాద్ పాత్రలో అవసరాల కనిపిస్తాడు.

 

సందీప్ రెడ్డి వంగ :

‘అర్జున్ రెడ్డి’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి దర్శకుడు వేదాంతం రాఘవయ్య పాత్రలో కనిపించాడు. సెకండ్ హాఫ్ లో సావిత్రి నటించిన ‘దేవదాసు’ సినిమాకు సంబంధించి వచ్చే సన్నివేశాల్లో సందీప్ కనిపిస్తాడు. ఇలా ఈ నలుగురు దర్శకులు తమ క్యారెక్టర్స్ చిన్నవే అయినప్పటికీ సినిమాలో తమ నటనతో సినిమా విజయంలో ఓ భాగం అయ్యారు.