భారీ స్టార్ కాస్ట్.. భారీ క్రేజ్.. మహానటి మేనియా

Tuesday,May 08,2018 - 04:07 by Z_CLU

కమర్షియల్ ఎంటర్ టైనర్ కు క్రేజ్ రావడం కామన్. ఓ బయోపిక్ కు క్రేజ్ రావడం చెప్పుకోదగ్గ విషయం. మరీ ముఖ్యంగా ఓ హీరోయిన్ ఓరియంటెడ్ మూవీకి హైప్ రావడం ఇంకా గొప్ప విషయం. అందుకే టాలీవుడ్ హాట్ టాపిక్ గా మారింది మహానటి. మరికొన్ని గంటల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలకానున్న మహానటి సినిమాలో హైలెట్స్ కంటే.. ఇందులో స్టార్ కాస్ట్ ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది. రియల్ లైఫ్ పాత్రల్ని పోషిస్తున్న ఆ నటులెవరో చూద్దాం.

కీర్తిసురేష్ :

మహానటి సినిమా గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ముందుగా చెప్పుకోవాల్సింది కీర్తి సురేష్ గురించే. సినిమాలో సావిత్రి పాత్రను పోషించిన ఈ హీరోయిన్.. ఈ ఒక్క సినిమాతో నటిగా ఎన్నో మెట్లు ఎక్కేసింది. ఫస్ట్ లుక్ నుంచే సినిమాపై ఇంత హైప్ రావడానికి మెయిన్ రీజన్ కీర్తిసురేష్. సినిమా రిలీజ్ తర్వాత సావిత్రిని చూస్తే కీర్తిసురేష్.. కీర్తిసురేష్ ను చూస్తే సావిత్రి గుర్తుకొస్తారు. దటీజ్ మహానటి.

దుల్కర్ సల్మాన్ :

సినిమాలో మరో మెయిన్ క్యారెక్టర్ దుల్కర్ సల్మాన్. సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటించాడు. కీర్తి, దుల్కర్ మధ్య కెమిస్ట్రీనే ఈ సినిమాకు మెయిన్ పిల్లర్. నిజానికి జెమినీ గణేశన్ పాత్ర కోసం ముందుగా విజయ్ దేవరకొండను అనుకున్నారట మేకర్స్. తర్వాత దుల్కర్ కు ఫిక్స్ అయ్యారు. ఈ క్యారెక్టర్ కు పెర్ ఫెక్ట్ అనిపించుకున్నాడు దుల్కర్.

ఏఎన్నార్ :

మహానటి సినిమాలో లెజెండ్ అక్కినేని నాగేశ్వర రావు కూడా ఉన్నారు. ఈ పాత్రను పోషించింది మరెవరో కాదు. ఏఎన్నార్ మనవడు అక్కినేని నాగచైతన్య. యంగ్ ఏఎన్నార్ గా చైతూ ఎలా కనిపించబోతున్నాడనే క్యూరియాసిటీ ఆడియన్స్ లో పీక్ స్టేజ్ లో ఉంది.

ఎన్టీఆర్ :

మహానటుడు ఎన్టీఆర్ కూడా మహానటి సినిమాలో ఉన్నారు. ఈ పాత్ర కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను సంప్రదించారు. కానీ తాతగారిలా కనిపించే సాహసం చేయలేకపోయాడు తారక్. మరి నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు పాత్రను మహానటిలో ఎలా చూపించబోతున్నారనేది సస్పెన్స్ గా మారింది. మరికొన్ని గంటల్లో ఈ సస్పెన్స్ కు తెరపడనుంది.

రాజేంద్రప్రసాద్ :

నటకిరీటి రాజేంద్రప్రసాద్ కూడా మహానటిలో ఉన్నారు. సావిత్రి జీవితంలో అత్యంత కీలకమైన కేవీ చౌదరి పాత్ర ఇది. సావిత్రికి వరసకు పెదనాన్న అవుతారు. తన జీవితంలో సావిత్రి బాగా ఇష్టపడిన వ్యక్తుల్లో చౌదరి ఒకరు. నిజానికి సావిత్రిని సినిమాల వైపు ప్రోత్సహించిందే ఇతను.

మోహన్ బాబు :

కలెక్షన్ కింగ్ మోహన్ బాబుది మరో ప్రత్యేకమైన పాత్ర. అది కూడా అలాంటిలాంటి క్యారెక్టర్ కాదు. ఏకంగా ఏస్వీ రంగారావు క్యారెక్టర్ ఇది. టాలీవుడ్ లో ఇప్పుడున్న నటుల్లో ఈ రియల్ లైఫ్ క్యారెక్టర్ ను పోషించే సత్తా, అర్హత ఉన్న ఏకైక నటుడు మెహన్ బాబు. మహానటిలో ఎస్వీఆర్ పాత్రకు ప్రాణంపోశారు కళాప్రపూర్ణ.

ప్రకాష్ రాజ్:

ఇక విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా మహానటిలో ఉన్నారు. ఈయన పోషించిన క్యారెక్టర్ కూడా చిన్నదేం కాదు. తెలుగు సినీచరిత్రను మలుపుతిప్పిన చక్రపాణి పాత్రలో ప్రకాష్ రాజ్ కనిపించనున్నాడు.

షాలినీ పాండే

అర్జున్ రెడ్డితో సెన్సేషనల్ హీరోయిన్ అయిపోయిన షాలినీ పాండే కూడా మహానటిలో భాగమే. సావిత్రికి తన జీవితంలో ఉన్న ఒకే ఒక్క బెస్ట్ ఫ్రెండ్ సుశీల. అలాంటి అరుదైన పాత్రను షాలినీ పాండే పోషించింది. ఈ పాత్ర ద్వారా దర్శకుడు నాగ్ అశ్విన్ ఏం చెప్పబోతున్నాడనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.

మాళవిక నాయర్ :

మరో హీరోయిన్ మాళకి నాయర్ కూడా ఉంది. జెమినీ గణేశన్ మొదటి భార్య అలిమేలు పాత్రలో మాళవిక నాయక్ కనిపించబోతోంది. రియల్ లైఫ్ లో సావిత్రి కూతురుకు కన్యాదానం చేసింది ఈవిడే.

క్రిష్:

డిఫరెంట్ చిత్రాల దర్శకుడు క్రిష్ కూడా మహానటిలో ఉన్నాడు. తెలుగు సినిమా గతిని మార్చి, ఆణిముత్యాల్లాంటి చిత్రాల్ని అందించిన మేటి దర్శకుడు కేవీ రెడ్డి పాత్రను క్రిష్ పోషించాడు. పాతాళభైరవి, దొంగరాముడు, మాయాబజార్ లాంటి ఆణిముత్యాల్ని అందించిన కేవీ రెడ్డి.. సావిత్రిని తిరుగులేని నటిగా తీర్చిదిద్దారు.

అవసరాల శ్రీనివాస్:

ఇదే సినిమాలో నటుడు కమ్ దర్శకుడు అవసరాల శ్రీనివాస్ కూడా చిన్న గెస్ట్ రోల్ పోషించాడు. ప్రముఖ దర్శకుడు ఎల్వీ ప్రసాద్ పాత్రలో కనిపించనున్నాడు అవసరాల. సావిత్రిని కేవీ రెడ్డి స్టార్ ను చేస్తే.. ఆమెకు హీరోయిన్ గా లైఫ్ ఇచ్చారు ఎల్వీ ప్రసాద్.

వీళ్లతో పాటు సమంత, విజయ్ దేవరకొండ లాంటి స్టార్లు కూడా మహానటిలో ఉన్నారు. ఈ రెండు పాత్రలతోనే మహానటి కథను ప్రేక్షకులకు చెప్పబోతున్నాడు దర్శకుడు. ఇలా భారీ స్టార్ కాస్ట్ తో తెరకెక్కిన మహానటి… మరికొన్ని గంటల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.