సూర్యకాంతం మూవీ రివ్యూ

Friday,March 29,2019 - 02:27 by Z_CLU

నటీనటులు: నిహారిక కొణెదల, రాహుల్ విజయ్, పెర్లెన్ భేసానియా, శివాజీ రాజా, సుహాసిని, సత్య తదితరులు

సమర్పణ : వరుణ్ తేజ్

సినిమాటోగ్రాఫర్ : హరిజ్ ప్రసాద్

సంగీతం : మార్క్ కె రాబిన్

బ్యానర్ : నిర్వాణ సినిమాస్

నిర్మాతలు : సందీప్ ఎర్రంరెడ్డి, సృజన్ యారబోలు, రామ్ నరేష్

దర్శకుడు : ప్రణీత్ బ్రహ్మాండపల్లి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రాజ్ నిహార్

నిడివి – 2 గంటల 3 నిమిషాలు

రిలీజ్ డేట్ – మార్చి 29, 2019

 

మెగా హీరోయిన్ మూడో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రణీత్ దర్శకుడిగా పరిచయమైన సూర్యకాంతం ఈరోజే థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మరి సూర్యకాంతంగా నిహారిక ఎలా ఎంటర్టైన్ చేసింది..? ఈసారైనా హిట్ కొడుతుందా..? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ


కథ :
అమ్మ (సుహాసినీ) గారాబంతో పెరిగి పెద్దైన సూర్యకాంతం(నిహారిక కొణిదెల) పెళ్లి అనే మాటకి అరకిలో మీటరు దూరంలో ఉంటూ తనకి నచ్చినట్టు గా జీవితాన్ని కొనసాగిస్తుంది. బాధేసినప్పుడు ఇంటి నుంచి దూరంగా వెళ్లిపోతుంది. మళ్లీ ఎప్పుడొస్తుందో తెలీదు. సింపుల్ గా చెప్పాలంటే రిలేషన్ షిప్ అంటే ఇష్టముండదు.

అల్లరి పిల్లలా ఉండే సూర్యకాంతంని మొదటి చూపులునే చూసి ప్రేమలో పడతాడు అభి(రాహుల్). కొన్ని రోజులు సూర్యకాంతం వెంట పడుతూ ప్రేమ విషయం చెప్తాడు. అయితే పెళ్లి అనే పదానికి దూరంగా ఉండే సూర్యకాంతం అనుకోకుండా అభికి కనెక్ట్ అవుతుంది. అదే సమయంలో అమ్మ చనిపోవడంతో సూర్యకాంతం ఒంటరవుతుంది.

అమ్మ మరణం తర్వాత అభికి ఇంకా దగ్గరవుతుంది. ప్రేమించిన సూర్యకాంతం ని పెళ్లి చేసుకోవాలని భావిస్తాడు అభి. అయితే ఎప్పట్లానే అనుకోకుండా సూర్యకాంతం ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోతుంది. అప్పటి నుండి తన జాడ కోసం ఎదురుచూస్తూ జీవితాన్ని గడిపే అభికి పూజ(పెర్లెన్ భేసానియా)తో నిశ్చితార్థం జరుగుతుంది. సరిగ్గా అదే టైమ్ కు సూర్యకాంతం మళ్లీ ఎంట్రీ ఇస్తుంది. అభిని ప్రేమిస్తున్నానని చెబుతుంది. పెళ్లి చేసుకుందాం అంటుంది. ఇలా ఇద్దరి మధ్య నలిగిపోతున్న అభి, ఏ నిర్ణయం తీసుకున్నాడు? ప్రేమించిన సూర్యకాంతంని పెళ్లి చేసుకున్నాడా..? లేదా నిశ్చితార్థం అయిన పూజనే భార్య గా ఫిక్స్ అయ్యాడా..? అనేది బ్యాలెన్స్ కథ.

 

నటీనటుల పనితీరు:

మూడో సినిమాకి నటన పరంగా ఇంకాస్త మెరుగైంది నిహారిక కొణెదల. సూర్యకాంతం పాత్రలో చాలా యాక్టివ్ గా కనిపించింది. కొన్ని సీన్స్ లో నిహారిక కామెడీ పంచ్ లు కూడా పేల్చింది. క్లయిమాక్స్ లో ఎమోషన్ గా కూడా ఆకట్టుకుంది. హీరో రాహుల్ లుక్స్, యాక్టింగ్ పరంగా ఆకట్టుకున్నాడు. ఇద్దరు అమ్మాయి మధ్య నలిగిపోయే పాత్రలో బాగా చేశాడు. కానీ అది చాలదు. నటుడిగా రాహుల్ ఇంకా బెటర్ అవ్వాలి.

ఇక పూజ క్యారెక్టర్ లో పెర్లెన్ భేసానియా చక్కగా చేసింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో తన అందంతో పాటు పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. వీళ్లతో పాటు ఇతర పాత్రలు పోషించిన శివాజీ రాజా, సుహాసిని, సత్య తమ పాత్రల మేరకు నటించారు.

 

సాంకేతిక వర్గం పనితీరు:

సాంకేతిక వర్గంలో ఔట్ స్టాండింగ్ అవుట్ పుట్ ఇచ్చిన విభాగం ఏదీ లేదు. ఉన్నంతలో అంతా ఓకే అనిపించుకున్నారు. మార్క్ కె రాబిన్ కంపోజ్ చేసిన సాంగ్స్ పెద్దగా ఎక్కలేదు. ఇంతేనా ఇంతేనా సాంగ్మాత్రం బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అక్కడక్కడ బాగుంది. హరి ప్రసాద్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఫ్రేమ్స్ బాగున్నాయి. సాంగ్స్ పిక్చరైజేషన్ కూడా బాగుంది. ఎడిటింగ్ పరవాలేదు. కృష్ణ కాంత్ అందించిన లిరిక్స్ బాగున్నాయి.

ఇక దర్శకుడి విషయానికొస్తే ప్రణీత మంచి లైన్ రాసుకున్నాడు కానీ దానిచుట్టూ పెర్ ఫెక్ట్ సీన్స్ అల్లుకోలేకపోయాడు. మరీ ముఖ్యంగా మొదటి సినిమా కావడంతో స్క్రీన్ ప్లే పరంగా కొన్ని మిస్టేక్స్ చేశాడు. నిర్వాణ సినిమాస్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

జీ సినిమాలు రివ్యూ:

నిహారిక సినిమాలు ఎలా ఉంటాయో ఇప్పటికే ఆడియన్స్ కు ఓ ఐడియా వచ్చేసింది. అందుకే సూర్యకాంతంపై ఎక్కువ అంచనాలు పెట్టుకోలేదు జనాలు. అలా ఓ మోస్తరు అంచనాలతో విడుదలైన సూర్యకాంతం ఆశించిన స్థాయిలో ఎంటర్ టైన్ చేయలేకపోయింది. దర్శకుడు మంచి పాయింట్ పట్టుకున్నాడు కానీ యూత్ పల్స్ పట్టుకోలేపోయాడు.

ఇదే ట్రయాంగులర్ లవ్ స్టోరీకి కాస్త ఫన్ జోడించి, అడుగడుగునా కామెడీ పెట్టి భలేగా ఫన్ జెనరేట్ చేయొచ్చు. కానీ దర్శకుడు పూర్తిగా నిహారికను మాత్రమే దృష్టిలో పెట్టుకోవడంతో కథలో ఫన్ మిస్ అయిపోయింది. పైగా నిహారికతో పెట్టుకున్న కామెడీ ట్రాక్ కనెక్ట్ కాలేదు. సినిమాకు మెయిన్ మైనస్ ఇదే. నిహారికను దృష్టిలో పెట్టుకోకుండా.. ఈ కథను ఫన్ యాంగిల్ లో రాసుకుని ఉన్నట్టయితే సినిమా బాగా వచ్చేది.

సినిమాలో నిహారిక-రాహుల్ మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వలేదు. లవ్ ట్రాక్ మైనస్. సూర్యకాంతం మళ్ళీ తిరిగొచ్చే ఎపిసోడ్ ను కూడా బాగా చూపించలేకపోయాడు దర్శకుడు. ముఖ్యంగా కామెడీ సన్నివేశాలు బాగా రాసుకోవాల్సింది. టీజర్, ట్రైలర్ చూసి ప్రేక్షకులు ఊహించుకున్న ఫన్ సినిమాలో ఒక్క పర్సెంట్ కూడా లేదు. సూర్యకాంతం క్యారెక్టర్ తో ఇంకా కామెడీ పండించాల్సింది. ఇక క్లైమాక్స్ ను రొటీన్ గా కాకుండా, ఎవరి ఊహలకు అందకుండా కాస్త కొత్తగా ట్రై చేయాలనుకున్నాడు డైరక్టర్. కానీ ఆ ప్రయత్నం పెద్దగా వర్కవుట్ కాలేదు. ప్రీ క్లైమాక్స్ తో పాటు క్లైమాక్స్ పెద్దగా పండలేదు.

బాటమ్ లైన్ – కనెక్ట్ అవ్వలేదు కాంతం

రేటింగ్ : 2/5