'ఐరా' మూవీ రివ్యూ

Thursday,March 28,2019 - 03:32 by Z_CLU

న‌టీన‌టులు : నయనతార , కళైయ‌ర‌సన్, యోగిబాబు, జ‌య‌ప్ర‌కాష్‌, లీలావ‌తి త‌దిత‌రులు

కెమెరా: సుద‌ర్శ‌న్ శ్రీనివాస‌న్‌

కూర్పు: కార్తిక్ జోగేష్‌

స్క్రీన్‌ప్లే: ప్రియాంక ర‌వీంద్ర‌న్‌

సంగీతం: సుంద‌రమూర్తి. కె.ఎస్‌.

నిర్మాత :కోటపాడి రాజేష్

దర్శకత్వం : సర్జున్

 

న‌య‌న‌తార నటించిన `ఐరా` సినిమా తమిళ్, తెలుగులో ఈరోజే విడుదలైంది. తొలి సారి నయన్ ద్విపాత్రాభిన‌యం చేసిన ఈ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసిందా..? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.


కథ :

ప్రజా బంధు అనే మీడియా సంస్థలో రిపోర్టర్ గా పనిచేసే యమున తన వృత్తి మీద ఆసక్తి తగ్గుతుండడంతో ఏదైనా ప్రయోగం చేయాలనుకుంటుంది. ఈ క్రమంలో అక్కయ్య పాలెంలో ఉండే బామ్మ(లీలావతి) దగ్గరికి వెళ్తుంది. ఆ ఊర్లో తమ బంగ్లా లో ఉంటూ దెయ్యాలపై కొన్ని వీడియోలు తీసి యూ ట్యూబ్ లో పెడుతూ జనాలని ఆకర్షిస్తుంది. ఈ క్రమంలో యమున బామ్మ చనిపోతుంది. అప్పుడే ఆ బంగ్లాలో నిజంగా దెయ్యం ఉందని తెలుసుకుంటుంది యమున.

మరో వైపు అభినవ్ (కళైయ‌ర‌సన్) కూడా జరుగుతున్న హత్యల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటాడు. అయితే తన బామ్మ చావుకు భవాని(నయనతార) అనే ఆత్మ కారణమని తెలుసుకుంటుంది యమున. ఇంతకీ భవాని ఎవరు..? ఆమె ఎలా చనిపోయింది. అభినవ్ కి భవాని కి సంబంధం ఏమిటి..? చివరికి భవాని ఆత్మ యమున ని ఎందుకు చంపాలనుకుంది..? అనేది మిగతా కథ.

 

నటీనటుల పనితీరు :

తమిళ్లో లేడీ సూపర్ స్టార్ గా వరుస విజయాలు అందుకుంటున్న నయనతార ద్విపాత్రాభినయంతో ఆకట్టుకుంది. ముఖ్యంగా భవాని పాత్రతో నటిగా మంచి మార్కులు అందుకుంది.

కళైయ‌ర‌సన్ హరికృష్ణ కూడా బాగా నటించాడు. తన క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ అనిపించాడు. యోగిబాబు కామెడీ పండలేదు. మాతేవన్, గబ్రెల్ల సెల్లస్ బాగా నటించారు. జయ ప్రకాష్ ,లీలావ‌తి బెస్ట్ అనిపించుకున్నారు. మిగతా నటీ నటులు పరవాలేదనిపించుకున్నారు.

 

సాంకేతికవర్గం పనితీరు :

సినిమాకు సుంద‌రమూర్తి. కె.ఎస్‌ అందించిన బ్యాక్ గ్రౌండ్ హైలైట్ గా నిలిచింది. ‘మేఘమాల’ సాంగ్ ఆకట్టుకుంది. సుద‌ర్శ‌న్ శ్రీనివాస‌న్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని సన్నివేశాల్లో ఆయన కెమెరా పనితనం కనిపిస్తుంది. ఆర్ట్ వర్క్ బాగుంది. కార్తిక్ జోగేష్‌ ఎడిటింగ్ పరవాలేదు. సినిమా నిడివి తగ్గించి ఎడిట్ చేసుంటే బాగుండేది. రాకేందు మౌళి పాటలకు తగ్గ సాహిత్యం అందించాడు. సుందరమూర్తి ఎంచుకున్న కథతో పాటు ప్రియాంక రవీంద్రన్ కథనం కూడా ఆకట్టుకోలేకపోయింది.

జీ సినిమాలు సమీక్ష :

హార్రర్ సినిమాకి ఓ స్ట్రాంగ్ సోల్ ఉండేలా చూసుకోవాలి. లేదంటే సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వదు. ముఖ్యంగా ఆత్మ తాలుకు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఎమోషన్ తో అందరినీ కదిలించాలి. సరిగ్గా ‘ఐరా’ లో అదే మిస్ అయ్యింది. కథలో ఏదో స్ట్రాంగ్ పాయింట్ ఉందని ఎదురుచూసిన ప్రేక్షకులను ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ నిరాశ పరుస్తుంది. చిన్నతనం నుండి పెళ్లి వరకూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్న ఓ అమ్మాయి జీవితాన్ని ఎమోషనల్ గా చూపించడంలో విఫలం అయ్యాడు దర్శకుడు.

సినిమా ప్రారంభం నుండి చివరివరకూ ప్రేక్షకులు మెచ్చే సన్నివేశాలు వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. సినిమా ప్రారంభంలోనే ఒక బంగ్లా అందులో  దెయ్యం అనే ఓల్డ్ కాన్సెప్ట్ ని రివీల్ చేసేసిన దర్శకుడు కథను ఆసక్తికరంగా ముందుకు నడిపించలేకపోయాడు. నయన్ కి ఈ తరహా కథ కాస్త కొత్తగా అనిపించొచ్చు కానీ ప్రేక్షకులకు మాత్రం ఈ కాన్సెప్ట్ తో చాలా సినిమాలు చూసేసాం అని ఫీలింగ్ కలుగుతుంది. నిజానికి ఫస్ట్ హాఫ్ అంతా హర్రర్ ఎపిసోడ్స్ బోర్ కొట్టించే కామెడీ సన్నివేశాలతో నెట్టేసిన దర్శకుడు సెకండ్ హాఫ్ తో ప్రేక్షకులను సీట్ లో కూర్చుబెట్టలేకపోయాడు. ఇలాంటి హర్రర్ సినిమాలకు ఆసక్తి నెలకొల్పే స్క్రీన్ ప్లే చాలా అవసరం. అదే సినిమాకు మెయిన్ మైనస్ అయ్యింది. కథతో పాటు కథనంలో కూడా కొత్తదనం లేకపోకపోవడం,  చెప్పాలనుకున్న కథను సాగదీసి చూపించడంతో ప్రేక్షకులు అసహనానికి గురవుతారు.

కథలో కీలకం అనిపించే విషయాలకు క్లారిటీ ఇవ్వకుండా గాలికొదిలేసాడు దర్శకుడు. ఇక భవాని ఆత్మ యమున ని ఎందుకు చంపాలనుకుంటుంది అనే పాయింట్ తో కాస్త ఆసక్తి నెలకొల్పినా దానికి సరైన క్లారిటీ ఇవ్వలేకపోయాడు. అందువల్లే క్లైమాక్స్ మరీ సిల్లీ గా అనిపిస్తుంది. హార్రర్ కి కామెడీ ని జోడించి ఎంటర్టైన్ చేయడంలోనూ విఫలం అయ్యాడు దర్శకుడు. యోగి బాబుతో కామెడీ పండించలేకపోయాడు. ఐరా అనే డిఫరెంట్ టైటిల్ , నయనతార ద్విపాత్రాభినయంతో సినిమాపై కొన్ని అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను ఐరా అందుకోలేకపోయింది. ఓవల్ ఆల్ గా తమిళ్ లో డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు చేస్తూ లేడీ సూపర్ స్టార్ గా దూసుకెళ్తున్న నయన్ కెరీర్ కి ‘ఐరా’ బ్రేక్ వేయడం ఖాయమనిపిస్తుంది. మరి నయన్ తన ఇమేజ్ తో ఈ సినిమాను ఎంత వరకూ నెట్టుకొస్తుందో చూడాలి.

రేటింగ్ : 1 .5 / 5